అమ్మాయంటే అబద్ధం | girls is Lying | Sakshi
Sakshi News home page

అమ్మాయంటే అబద్ధం

Published Fri, Jun 3 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

అమ్మాయంటే  అబద్ధం

అమ్మాయంటే అబద్ధం

అమ్మాయంటే లక్ష్మి అనంటారు.. అబద్ధం.
 అమ్మాయంటే సరస్వతి అనంటారు అబద్ధం.
 అమ్మాయంటే దుర్గ అనంటారు అబద్ధం.
 అమ్మాయి అంటే అదృష్టం అంటారు.. అబద్ధం.
 అమ్మాయంటే మహాలక్ష్మి అనంటారు.. అబద్ధం.
 మనదేశంలో దేవతలకు గుళ్లు కట్టినట్లు  ఆడపిల్లలను గుండెలో పెట్టి చూసుకుంటారనంటారు...
 అబద్ధం.
 మరి నిజమేంటి?
 దేవతలకు గుళ్లు.. ఆడపిల్లలకు సమాధులు.
 సమాధి దేనికి?
 అమ్మాయి గౌరవానికి, స్వేచ్ఛా సమానత్వానికి, ఆమె ప్రతి హక్కుకు, ఆమె ప్రతి అవకాశానికి.

 
 
కల్పన నమశక్యం కాకుండా ఉండొచ్చు. కాని వాస్తవం కూడా నమ్మశక్యం కాకుండా ఉంటే. ఈ ఘటన అలాంటిది. ఆమెకు మొదట ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత అత్తింట్లో కొడుకును కనమని అత్త, ఆడపడుచుల పోరు ఎక్కువైంది. మళ్లీ గర్భం దాల్చింది. దురదృష్టవశాత్తు మూడోనెలలో గర్భస్రావం అయింది. కాని ఇంట్లో తెలిస్తే ఆరళ్లు ఎక్కువవుతాయనే భయంతో ఆ విషయం దాచిపెట్టి గర్భం ఉన్నట్టుగానే నటించింది. నెలల నిండగానే కాన్పుకు తల్లిగారింటికి వెళ్తానని బట్టలు సర్దుకొని బయలుదేరింది. వేములవాడలో దిగింది. కొడుకును కంటేనే ఆ ఇంట్లో తనకు స్థానం. లేకపోతే ఇంటి చూరు కిందే జీవితం అని ఆందోళన చెందింది. భయపడింది. ఎలాగైనా ఓ మగబిడ్డను సంపాదించాలని వేములవాడంతా తిరిగింది. ఎక్కడా పసిబిడ్డ దొరకలేదు. అలసిపోయి రాజరాజేశ్వరుడి సన్నిధి చేరుకుంది. ‘ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలే రాజన్నా...’ అని దేవుడికి మొర పెట్టుకుంటుంటే చంటిపిల్లాడి ఏడుపు చెవినపడింది. గబుక్కున కళ్లు తెరిచి చూసింది ఏడుపు వినిపించినవైపు. పొత్తిబట్టల్లో పసిపిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. దగ్గరకి వెళ్లింది. బాబు తప్ప ఆ దరిదాపుల్లో ఎవరూ కనిపించలేదు. రెండు దిక్కులా చూసింది. అంత రద్దీలో తనెనవరూ గమనించట్లేదు. అంతే. మెరుపువేగంతో బాబును తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన లావణ్య జీవితం ఇది.
 
కాని ఈ దొంగతనం దాగుతుందా?
 ఆమె పిల్లాడిని తీసుకొని వెళ్లిపోయిన కొన్ని క్షణాలకు ఆ పసివాడి అసలు తల్లి వచ్చి చూసుకుంది. తాను పడుకోబెట్టిన చోట కొడుకు లేకపోయేసరికి లబోదిబోమంది.  కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆ కొడుకుతో లావణ్యను పట్టుకున్నారు. జైల్లో పెట్టారు. దాంతో అత్తింట్లో, పుట్టింట్లో లావణ్య ఆడిన నాటకం బయటపడింది. ఆమెకు బెయిల్ వచ్చాక అత్తింటికి వెళితే నాటకాలు ఆడేవాళ్లకు ఇంట్లో చోటులేదుపొమ్మని గెంటేశారు. భర్తా కనికరించలేదు. పుట్టింటికి ఫోన్ చేస్తే తమ దగ్గరకీ రావద్దని చెప్పేశారు. చిన్నపిల్లైన కూతురితో ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఆచూకీలేదు.
 
ఆ తల్లి దొంగలా ఎందుకు మారింది?
 ఈ వార్తాకథనం  పత్రికల్లో వచ్చినప్పుడు గర్భం ఉందని నాటకం ఆడ్డమేకాక ఇంకో తల్లి కన్నబిడ్డను ఎలా ఎత్తుకుపోతుంది? అంటూ లావణ్యను చాలామందే ఆడిపోసుకుని ఉంటారు. కాని ఆమె ఆ నాటకం ఆడడానికి కారణం, మూలం గురించి ఆలోచించి ఉండరు. అవును అదే.. మగసంతానం పట్ల ఆసక్తి.. ఆడపిల్లంటే విరక్తి. చదువు, అవగాహనలేని కుటుంబాల్లో ఇలా జరుగుతుందిగాని అవగాహన ఉన్న కుటుంబాల్లో ఇలా జరగదు అని అనుకుంటున్నారా? అయితే ఇంకో కేస్‌స్టడీ గురించి మీకు చెప్పాల్సిందే!
 
బిడ్డకు పాలు కూడా ఇవ్వని తల్లి...
 విజయ, అజయ్ దంపతులు. ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలే. ఇంకా చెప్పాలంటే విజయ లెక్చరర్. మొదటి సంతానం కొడుకే పుడతాడని, పుట్టాలనీ ఇష్ట దైవం ఏడుకొండలవాడికి ముడుపుకట్టింది. కాని పాప పుట్టింది. రెండో చాన్స్ ఉందికదా అని సర్దుకుంది. రెండో కాన్పులో కొడుకే అని ఫిక్స్ అయిపోయింది. మళ్లీ కూతురే పుట్టింది. ఈసారి ఆమె భర్తా అప్‌సెట్ అయ్యాడు. మూడో చాన్స్ తీసుకున్నారు. ఎవరో కొడుకు పుట్టడానికి ఏదో మందు ఇస్తారని చెబితే అక్కడికి వెళ్లి ఆ మందు తిని వచ్చింది. తన పొట్టలో పెరుగుతున్నది వంశోద్ధారకుడే అని మురిసిపోయింది. డెలివరీ అయింది. పండంటి ఆడపిల్ల. బాధ, కోపం, అవమానంతో కనీసం ఆ బిడ్డను చూడనైనా లేదు. భర్త అయితే ఆసుపత్రి దరిదాపులకే రాలేదు. తల్లి కూడా బిడ్డను ఎత్తుకోలేదు. పాలసలపరం మొదలైనా భరించింది కాని ఆడపిల్లను వ్యతిరేకించింది. లాభం లేదనుకున్న విజయతల్లి ఓ జ్యోతిష్యుడితో మొగుడు పెళ్లాలిద్దరికీ ఆ మూడోపిల్ల అదృష్టజాతకురాలని, ఆ పిల్లతో వాళ్లింటి దశ తిరుగుతుందని, పట్టిందల్లా బంగారమవుతుందని చెప్పించింది. అప్పుడు ఆ బిడ్డను చూశారు విజయ, అజయ్!
 
ఆశ... అబార్షన్...

 ఇక ఇది నవనాగరికత విలసిల్లుతున్న ముంబైలో వెలుగుచూసిన సత్యం. భర్త డాక్టర్. భార్య ముంబై మున్సిపాలిటీలో గ్రూప్‌వన్ ఉద్యోగిని. అత్తారింట్లో నలుగురు ఆడపిల్లల మీద ఆమె భర్త ఒక్కడే మగసంతానం. పెళ్లయిన మొదటిరాత్రే భర్త తనమనసులో మాట, వాళ్ల అమ్మానాన్న కోరికా చెప్పాడు భార్యకు. తను కొడుకునే కనాలని. అవాక్కయింది భార్య. తన చేతుల్లో ఉందా? ప్రశ్నించింది. నీ చేతుల్లో లేదు కాని నా మెదడులో ఉపాయం ఉంది అన్నాడు. ఆమె గర్భం దాల్చినప్పుడు ఆ ఉపాయాన్ని చెప్పాడు. స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఆడపిల్ల అని తేలగానే అబార్షన్ చేయించాడు. అలా అయిదుసార్లు జరిగింది. ఆరోసారి గర్భానికి ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పుడూ కడుపులో ఉన్నది అమ్మాయే అని తేలగానే ఆమె అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. తోటి డాక్టర్లు వారించినా వినలేదు. ఈలోపే వీక్‌నెస్ వల్ల భార్యకు అబార్షన్ అయింది. తర్వాత మగపిల్లాడిని కనిచ్చే యోగ్యత ఆమెకు లేదని విడాకులూ ఇచ్చేశాడు. ఇది బ్లాక్ అండ్ వైట్ జమానా సంగతి కాదు. మూడేళ్ల కిందటి ముచ్చట.
 అంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి, ఇంటికి కళ వంటి మాటలన్నీ ఉట్టివే. ఓ వైపు కేంద్రప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పఢావో అంటుంటే  దాని ప్రభావం సామాన్యుల మీద ఆవగింజంతైనా ఉండట్లేదు. ఉంటే ఉత్తర భారతంలోని ఎన్నో సంతానసాఫల్యకేంద్రాలు మగపిల్లాడినే పుట్టించే ఫ్యాక్టరీలుగా ఎందుకు మారేవి? అక్కడి చాలా సంతానసాఫల్యకేంద్రాలు మగపిల్లాడి కోసం చేస్తున్న పని ఏమిటో తెలుసా? తండ్రి వీర్యం నుంచి వై క్రోమోజోమ్‌ను మాత్రమే తీసుకొని తల్లి అండానికి జత చేయడం!

ఇలాంటి నమ్మశక్యంకాని ఇంకెన్నో సత్యాలు మరెన్నో పైకప్పుల కింద, నాలుగు గోడల మధ్య నిస్సిగ్గుగా తలదాచుకుంటున్నాయి.
 కంటే కూతురినే కనాలి.. ఆడపిల్లే పుట్టాలి.. కూతురైనా కొడుకునై ఆరోగ్యంగా పుడితే చాలు.. అని కోరుకుంటున్న కోరికలు, అనుకుంటున్న మాటలు... చాలావరకు అబద్ధాలే అని.. కొడుకు పట్ల పక్షపాతమే అని తేలడానికి.. తేల్చడానికి .. నమ్మడానికి పైన వివరించిన వాస్తవాలు చాలేమో! - సరస్వతి రమ
 
 వెయ్యికోట్ల ఇండస్ట్రీ
లింగనిర్థారణ పరీక్షలు,లింగ నిర్ధారణ పరీక్షలు, సెక్స్ సెలక్టివ్ అబార్షన్స్ ఈ రోజు దేశంలో వెయ్యికోట్ల ఇండస్ట్రీగా మారాయి.  హర్యానా, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్,మహారాష్ట్ర హిమాచల్‌ప్రదేశ్, ఒరిస్సా, బెంగుళూరు వంటి పారంతాలు భ్రూణహత్యల్లో ముందున్నాయి.
 
 వెయ్యి మందికి 943 మందే...
2015 సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో ప్రతివెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 993 మంది స్త్రీలు ఉన్నారు. పిల్లల్లో ప్రతి వెయ్యిమంది  బాలురకు 930 మంది మాత్రకే బాలికలున్నారు. పురుషుల కన్నా స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. కాని పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఈ ఆధిక్యత లేదు. అక్కడ ప్రతి వెయ్యిమంది బాలురకు 964 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. స్త్రీల జనాభా అత్యంత కనిష్ఠంగా డామన్, డయ్యూ కేంద్రపాలితం ప్రాంతంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ ప్రతి వెయ్యిమంది పురుషులకు కేవలం 618 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. అలాగే పిల్లల విషయంలో ప్రతి వెయ్యిమంది బాలురకు 904 మంది బాలికలే ఉన్నారు. రాష్ట్రాలకు వస్తే అత్యంత కనిష్టంగా ఢిల్లీ, హర్యానాలు ఆ అపకీర్తిని మోస్తున్నాయి. ఢిల్లీలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 868 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. పిల్లల్లో కూడా ప్రతి వెయ్యిమంది బాలురకు 871 మంది మాత్రమే బాలికలున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రాజధాని చండీగఢ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 818 మంది స్త్రీలు ఉంటే ప్రతివెయ్యిమంది బాలురకు 880 మంది బాలికలు మాత్రమే ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement