సాక్షి, హైదరాబాద్: యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని పరిమితం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు మరెన్నో వైద్య సంస్థలు సూచిస్తున్నప్పటికీ వాటి వినియోగం ఎంతమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా 20 ప్రభుత్వ ఆసుపత్రులలో జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన అతిపెద్ద మల్టీ సెంటర్ పీపీఎస్ (పాయింట్ ప్రెవలెన్స్ సర్వే)ల్లో ఇది ఒకటి. కాగా ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన 10 మంది రోగులలో ఏడుగురికి యాంటీ బయోటిక్స్‌ను సూచిస్తున్నట్టు (ప్రిస్క్రైబ్) ఈ సర్వే వెల్లడించింది. 70%లో కనీసం 5% మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రకాల యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నారని వెల్లడైంది.
వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్సే ఎక్కువ
సాధారణంగా రోగులకు ఉపయోగించే 180 రకాల యాంటీబయోటిక్‌లను, వాటి సామర్థ్యాలకు అనుగుణంగా, వినియోగించాల్సిన తీరుతెన్నులను నిర్ధారించడానికి వాచ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. వీటిలో అత్యధిక సామర్ధ్యం కలిగిన హయ్యర్ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కిందకు వచ్చే వాచ్ గ్రూప్ తరహా యాంటీ బయాటిక్స్‌నే ఎక్కువగా సూచిస్తున్నారని సర్వే నిర్ధారించింది. అదే సమయంలో తక్కువ రెసిస్టెన్స్ పొటెన్షియల్ కలిగిన యాక్సెస్ గ్రూప్ రకాన్ని తక్కువగా సూచిస్తున్నట్టు వెల్లడించింది. యాక్సెస్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ ప్రిస్క్రిప్షన్‌ను రెండు వెబ్‌సైట్లు మాత్రమే అధికంగా నమోదు చేశాయని తెలిపింది.
యాంటీ బయాటిక్స్ కలపడం వల్ల ప్రతికూల ప్రభావం
చాలా కేసుల్లో పాలీ ఫార్మసీ (బహుళ ఔషధాలను ఒకే సమయంలో వినియోగించడం) గమనించామని, రెండు యాంటీ బయాటిక్స్ కలపడం వలన ప్రతికూల ప్రభావాలు చూపేందుకు, ఔషధ పరస్పర చర్యల ప్రమాదాన్ని పెంచేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్య మంగళవారం విడుదల చేశారు. యాంటీ బయాటిక్స్ అధిక వాడకం వల్ల కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ గ్రూప్ యాంటీ బయాటిక్స్ వినియోగం వీలైనంత తక్కువ స్థాయిలో ఉండేలా చూడాలని ఈ అధ్యయనం ఆసుపత్రులకు సిఫారసు చేసింది.
70 శాతం రోగులకు యాంటీ బయోటిక్స్!
Published Thu, Jan 4 2024 6:25 AM | Last Updated on Thu, Jan 4 2024 8:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment