‘‘చాలా కాలం తర్వాత భారతదేశంలో ఓ రాజకీయ నాయకుడి నోటి వెంట ఒక వాస్తవికమైన, సున్నితమైన ప్రకటన విన్నా’’
– హృతిక్ మిశ్రా, (ట్విటర్‌లో ఓ నెటిజన్ వ్యాఖ్య)
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరోనాను మనం ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు కాబట్టి దాంతోపాటే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. నాకైనా, ఎవరికైనా సోకవచ్చు.. భయపడాల్సిన పనిలేదు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యకు నెటిజన్ల నుంచి వచ్చిన స్పందన అది. ఉన్న పరిస్థితిని చాలా వాస్తవికంగా ఉన్నదున్నట్లు చెప్పిన అరుదైన రాజకీయ నాయకుడు అంటూ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసిస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముందుముందు మనం కరోనాతో కలసి జీవించక తప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలు దేశాల అధినేతలు, పలువురు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఒక వర్గం మీడియా మాత్రం కోడిగుడ్డుకు ఈకలుపీకుతూ ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు మభ్యపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారు.
కరోనాతో కొనసాగాల్సిన పరిస్థితి..
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. మరణాల రేటు తక్కువ. వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఇంకో ఏడాది కూడా పట్టొచ్చు. లేదా ఎయిడ్స్‌కు మందు లేనట్లే కరోనాకూ మందు తయారు చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కరోనాతో కలసి జీవించాల్సిందే. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా కరోనా సోకిన వారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో అందుబాటులో ఉన్న వైద్యం అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే చాలు కరోనాకు దూరంగా ఉండవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఫ్రాన్స్ ప్రధాని ఫిలిప్పీ సహా అనేక మంది దేశాధినేతలు అదే చెబుతున్నారు. ‘‘కరోనా వైరస్ అనేది ఓ వాస్తవం.. ఇపుడు దానితో కలసి ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవలసి ఉంది..’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక అధికారి డేవిడ్ నెబారో ఇండియా టుడే కిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పటికి కట్టడి అవుతుందనేది కాలమే చెబుతుందనీ; అది ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ చెబితే మాత్రం ప్రతిపక్షానికి రుచించడం లేదు..
పరీక్షలు పెంచుతూ కేసులన్నీ తేల్చేసే పద్ధతి..
కరోనా వైరస్ బారిన పడినవారిని గుర్తించి క్వారంటైన్ చేయడం, చికిత్స అందించడం తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ఇదీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న పద్ధతి. దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇదే పద్ధతి విజయవంతమైంది. ఒక్కల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ఇపుడు రాష్ట్రంలో 9 ల్యాబ్‌లు పనిచేసే స్థితికి చేరుకుంది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా మిలియన్ జనాభాకు 1649 పరీక్షలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ రేటు (1.51శాతం) ఏపీలోనే తక్కువగా ఉంది. బుధవారం వరకు 88,061 టెస్టులు జరిగాయి. ఒక దశలో పరీక్షలు జరగకపోవడం వల్లనే కేసులు తక్కువగా ఉన్నాయన్న ప్రతిపక్షం ఇపుడు కేసులు పెరగడం అంటే రాష్ట్రప్రభుత్వ అసమర్థతగా ఆరోపణలు చేస్తోంది.
పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్..
వైరస్ కారణంగా జ్వరం వస్తే అది తగ్గేందుకు, దానితోపాటు కనిపించే తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గేందుకు ఇచ్చే తొలి మాత్ర ‘పారాసిటమాల్’. అందుకే భారత్ నుంచి దాదాపు 30 దేశాలు పారాసిటమాల్ టాబ్లెట్లను దిగుమతి చేసుకున్నాయి. కరోనా వైరస్‌తో వచ్చే జ్వరం, ఒళ్లునొప్పులకు పారాసిటమాల్ దివ్యౌషధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. ‘‘ఇతర వైరస్‌ల మాదిరిగానే ఏదైనా ఉపరితలంపై ఉన్న కరోనా వైరస్‌ను చంపడంలో బ్లీచింగ్ పౌడర్ సమర్థవంతంగా పనిచేస్తోంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మెడికల్ సెంటర్‌లో అంటువ్యాధుల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ పాల్ పాటింగర్ ప్రకటించారు.
కరోనా వైరస్ ఇప్పటికే బాగా వ్యాపించినందున దానితో మనం సహజీవనం చేయక తప్పదు
– సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్
కరోనా వైరస్ అనేది ఓ వాస్తవం.. ఇపుడు దానితో కలసి ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవలసి ఉంది..
– డేవిడ్ నెబారో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక అధికారి
సాధారణ కేసులే అధికం
కరోనా వైరస్ సోకితే ఆసుపత్రి కొద్దిమందికే అవసరమౌతుంది. 81 శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుంది. అసలు కరోనా సోకినట్లు ఈ 81 శాతంలో చాలా మందికి తెలియదు. ఎలాంటి లక్షణాలూ కనిపించవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. 13.8 శాతం కేసుల్లో ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న 4.7 శాతం కేసుల్లో మాత్రమే ఐసీయూ చికిత్స అవసరమౌతుంది. చైనాలోనూ, ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ పలు అధ్యయనాల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. అందుకే భయపడాల్సిన పనిలేదని వైఎస్ జగన్ పేర్కొంటే దానిపైనా విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment