వైరస్‌ల నియంత్రణకు శాశ్వత వార్డులు | Permanent wards for control of viruses | Sakshi
Sakshi News home page

వైరస్‌ల నియంత్రణకు శాశ్వత వార్డులు

Published Wed, Mar 11 2020 2:54 AM | Last Updated on Wed, Mar 11 2020 2:54 AM

Permanent wards for control of viruses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని రకాల వైరస్‌ల నియంత్రణకు శాశ్వతంగా ప్రత్యేక ఐసీయూలు, ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌తోపాటు స్వైన్‌ఫ్లూ, నిపా వంటి వైరస్‌లన్నింటికీ చికిత్స కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 10 పడకలతో ఐసీయూలు, 20 పడకలతో ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయనుంది. ఒక్కో ఐసీయూ ఏర్పాటుకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 20 కోట్లు, ఒక్కో ఐసోలేషన్‌ వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 10 కోట్లు లెక్కన మొత్తం రూ. 30 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నిబంధనల ప్రకారం ఐసీయూలు, ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చే యనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటికి ప్రత్యేక ప్రవేశ మార్గాలను సిద్ధం చేయనున్నారు. అలాగే రోగులు ఇళ్లకు వెళ్లేందుకు సైతం విడిగా మార్గాలను అందుబాటులోకి తీసుకురాను న్నారు. వాటిని ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ ప్రతినిధులు మంగళవారం ఆయా జిల్లాల కేంద్రాలకు వెళ్లారు. దీనిపై బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. కాగా, నిన్న మొన్నటివరకు కోవిడ్‌ భయాలతో మా స్క్‌లు కావాలంటూ వైద్య ఆరోగ్యశాఖకు వీఐపీల నుంచి ఒత్తిడి నెలకొన్నా సీఎం కేసీఆర్‌ మాస్క్‌లు పెద్దగా అవసరం లేదని చెప్పడంతో వీఐపీల నుంచి మాస్క్‌ల డిమాండ్‌ తగ్గిందని అంటున్నారు. మరోవైపు లక్ష మాస్క్‌లు కావాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరినా ఇప్పటివరకు ఒక్క మాస్క్‌ కూడా రాలేదు. మహారాష్ట్రలో తయారీ యూనిట్లు ఉన్న మూడు చోట్ల నుంచి మాస్క్‌లు తెప్పించడంలో కేంద్రం సహకరించడంలేదని అధికారులు అంటున్నారు.  

కోవిడ్‌ దెబ్బతో బయోమెట్రిక్‌ బంద్‌
కోవిడ్‌ వైరస్‌ దెబ్బతో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని విద్యా సంస్థలు క్రమంగా నిలిపివేస్తున్నాయి. కోవిడ్‌ కారణంగా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వవద్దని, వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా ఒకరి తరువాత ఒకరు వేలి ముద్రలు వేయాల్సిన బయోమెట్రిక్‌ హాజరును తాత్కాలికంగా నిలి పివేస్తున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్‌ జయశంకర్‌ అ గ్రికల్చర్‌ యూనివర్సిటీ బయోమెట్రిక్‌ హాజరు వి ధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా, కాకతీయ యూనివర్సిటీ కూడా తమ పరిధిలోని కాలేజీల్లో బ యోమెట్రిక్‌ హాజరు విధానం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, పాఠశాలల్లోనూ బయోమెట్రిక్‌ హాజరు విధానం నిలిపివేతపై ఆలోచనలు చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement