సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది.
ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది.
వైద్యులు కేస్‌షీట్‌లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది.
డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ..
♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది.
♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది.
♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు.
♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది.
♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు.
♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్‌రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది.
♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు.
♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది.
♦ 2023లో యాక్స్‌డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్‌లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది.
♦ యూఎస్‌కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్‌ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు.
క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు
అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది.
అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment