క్యాన్సర్‌ ఖర్చులకు బీమా భరోసా | Ensure insurance coverage for cancer costs | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ ఖర్చులకు బీమా భరోసా

Published Mon, Aug 20 2018 12:40 AM | Last Updated on Mon, Aug 20 2018 12:43 AM

Ensure insurance coverage for cancer costs - Sakshi

మనిషిని శారీరకంగానే కాక ఆర్థికంగాను కుంగదీసేసే ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం క్యాన్సర్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2017లో 15 లక్షలుగా ఉన్న కేసులు 2020 నాటికి 17.3 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు అంచనా. క్యాన్సర్‌ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అనుకోవడానికి లేదు. 70–90 శాతం క్యాన్సర్‌ కేసులు జీవన విధానం, పర్యావరణ కాలుష్య సంబంధమైనవే ఉంటున్నాయి. క్యాన్సర్‌ చికిత్స వ్యయాలు మామూలుగా రూ.25 లక్షల పైగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం బీమా సంస్థలు ప్రత్యేకంగా క్యాన్సర్‌ పాలసీలు అందుబాటులోకి తెచ్చాయి. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలు, వీటిని తీసుకునేటప్పుడు చూడాల్సిన అంశాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. 

అసలెందుకు తీసుకోవాలి.. 
క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లయితే.. హాస్పిటలైజేషన్‌ తప్పనిసరి అనే నిబంధనతో పనిలేకుండా నిర్దిష్ట సమ్‌ అష్యూర్డ్‌ను క్యాన్సర్‌ బీమా ప్లాన్‌ ద్వారా అందుకోవచ్చు. అన్ని దశల్లో క్యాన్సర్‌కి కవరేజీ ఉంటుంది. ఆయా పాలసీని బట్టి ప్రతి దశలోనూ కొంత మొత్తం అందుకోవచ్చు. వీటితో పాటు ప్రారంభ దశలోనే ఉన్నట్లు తేలినా భవిష్యత్‌లో కట్టాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు ఉండటం, వివిధ రకాల క్యాన్సర్స్‌కి కూడా క్లెయిమ్‌ చేసుకోగలగడం మొదలైన ఫీచర్లు ఈ పాలసీల్లో ఉంటున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్యాన్సర్‌ చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా బీమా పాలసీ రక్షణనిస్తుంది. ఇంతటి కీలకమైన క్యాన్సర్‌ పాలసీని ఎంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. 

అత్యధికంగా సమ్‌ అష్యూర్డ్‌ ఇస్తే... 
ఒక్కో క్యాన్సర్‌కి ఒక్కో రకమైన చికిత్స ఉంటుంది. దానికి తగ్గట్లే చికిత్స వ్యయాలూ మారుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవాలి. దేశీయంగా చికిత్స వ్యయాలను పరిశీలిస్తే కనీసం రూ. 20–25 లక్షల సమ్‌ అష్యూర్డ్‌నిచ్చే పాలసీని తీసుకోవడం మంచిది. 

వెయిటింగ్‌ పీరియడ్‌.. 
దేశీ బీమా సంస్థలు అందించే క్యాన్సర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు వెయిటింగ్‌ పీరియడ్‌తోనే ఉంటున్నాయి. అంటే.. నిర్దేశిత గడువు తీరేదాకా క్లెయిమ్‌ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండే పాలసీలు చూసుకోవాలి. సాధారణంగా ఇది 180–365 రోజుల మధ్యలో ఉంటోంది. 

వివిధ దశల్లో చెల్లింపులు.. 
ప్రాథమిక స్థాయి నుంచి క్రిటికల్‌ స్థాయి దాకా ప్రతి దశలోని క్యాన్సర్‌కి బీమా కవరేజీ ఉంటోంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు బైటపడితే బీమా సంస్థను బట్టి సమ్‌ అష్యూర్డ్‌లో 20–25 శాతం దాకా లభిస్తోంది. ఒకవేళ క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్నట్లయితే మొత్తం 100 శాతం లభిస్తుంది. కొన్ని ప్లాన్స్‌లో 150 శాతం దాకా కూడా చెల్లింపులు ఉంటున్నాయి.  

మినహాయింపులు.. పరిమితులు 
క్యాన్సర్‌ పాలసీ తీసుకునేటప్పుడు కింది అంశాలకు సంబంధించి కూడా కవరేజీ ఉంటుందో లేదో చూసుకోవాలి. ఏవైనా మినహాయింపులు ఉన్నాయేమో చెక్‌ చేసుకోవాలి.   
►అప్పటికే క్యాన్సర్‌ ఉంటే కవరేజీ. Üచర్మ క్యాన్సర్‌కి కవరేజీ.
►క్యాన్సర్‌కి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల మొదలైనవి కారకాలుగా ఉన్నా.
►జన్మతః వచ్చిన క్యాన్సర్, రసాయన.. అణు కాలుష్యం వల్ల వచ్చినా, అణుధార్మికత కారణంగా వచ్చే క్యాన్సర్‌కి కవరేజీ.
సంతోష్‌ అగర్వాల్‌ అసోసియేట్‌ డైరెక్టర్,
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగం, పాలసీబజార్‌డాట్‌కామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement