![63 percent of people die in the country due to lifestyle changes - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/17/43.jpg.webp?itok=Ct5rZ1hu)
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది.
టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు
అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్‌సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది.
దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్‌సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం..
జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రాజీందర్‌కే ధనుంజయ పరిశీలనలో తేలింది.
అధిక బరువు (ఒబేసిటీ)
2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం.
మానసిక సమస్యలు
దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది.
క్యాన్సర్
ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది.
పాశ్చాత్య సంస్కృతితో ముప్పు..
మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్‌లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment