సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని గొప్పగా చెప్తున్నా.. ఆధునికంగా ప్రపంచం ఎంత వేగంగా ముందుకు పయనిస్తున్నా.. మహిళలపై వేధింపులు, హింస తగ్గడం లేదు. వివక్ష అంతరించడం లేదు. పరువు హత్య లు, వరకట్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు.. ఎక్కడా మహిళలకు రక్షణ లేని దుస్థితి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయినిలో జరిగిన సంఘటన దీనికి మరో నిదర్శనం.
అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక భయంతో వణికిపోతూ, అర్ధనగ్నంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరుగెత్తడం.. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఘట నా ఇలాంటిదే. పోలీసు వ్యవస్థ ఎంత ఆధునిక పోకడలు పోతున్నా.. దేశంలో ఇంకా అనాగరిక దుష్కృత్యాలు కొనసాగడం ఆందోళనకరం.
2011–2021 మధ్య 87 శాతం పెరుగుదల..
గత దశాబ్దంలో మహిళలపై హింసాత్మక సంఘటనలు దాదాపు 87 శాతం మేర పెరగడం ఏ అభివృద్ధికి సంకేతమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. మన దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస/వేధింపులు కొనసాగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల సంఖ్య ఆధారంగానే 2011లో 2,28,650 మంది మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే.. 2021నాటికి ఈ సంఖ్య 4,28,478కు అంటే.. 87శాతం మేర పెరగడం ఆందోళనకరం.
అయితే దీనిని పోలీసు యంత్రాంగం మరో విధంగా చూస్తున్నట్టు సమాచారం. గతంలో మహిళలు కేసులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదని.. పెరిగిన విద్యావకాశాలు, పోలీసుల ఔట్‌రీచ్ కారణంగా ముందుకొచ్చి కేసులు పెడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దేశ మహిళా జనాభాలో 7.5శాతం పశ్చిమ బెంగాల్‌లో ఉంటే.. అక్కడ మహిళలపై జరిగిన నేరాలు 12.7 శాతమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మహిళలు హింసను భరించాలని దేశంలోని దాదాపు 65శాతం మంది పురుషులు అభిప్రాయంతో ఉన్నారని ‘ఇంటర్నేషనల్ మెన్ అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్)’స్పష్టం చేసింది. కుటుంబం కలసి ఉండాలంటే మహిళలు ఈ హింసను భరించాల్సిందేనన్న ధోరణి ప్రమాదకరంగా మారుతోందని పేర్కొంది. ఇక గృహ హింసకు సంబంధించి కుటుంబ పరువు పేరిట చాలా వరకు మహిళలు కేసులు పెట్టడం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచ మహిళా జనాభాలో కనీసం 33.7% మంది ఏదో ఒక సమయంలో నేరాలు/వేధింపులకు గురైనవారే.
పరువు పేరిటహత్యలెన్నో..
దేశంలో ఇటీవలి కాలంలో పరువు హత్యలు పెరిగిపోయాయి.కుటుంబ పెద్దల అంగీకారం లేకుండా ప్రేమించి కుల, మతాంతర వివాహాలు చేసుకుంటున్నవారిని.. పరువుకు భంగం కలిగించారనే భావనతో వారి కుటుంబాలే హత్య చేయిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఖాప్ పంచాయతీలు నిర్వహించి మరీ మరణ శాసనాలు లిఖిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
అత్యాచార దారుణాలు..
మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలూ దారుణంగా పెరుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. గత దశాబ్దకాలంలో ఇలాంటి దారుణాలపై కేసులు బాగా పెరిగాయి. 2008లో దేశంలో 21,467 అత్యాచార కేసులు నమోదవగా.. 2021లో ఈ సంఖ్య 31,677కు పెరిగింది.
జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు కూడా..
తమపై వేధింపులకుసంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులూపెరిగాయి. 2022లో మొత్తం 33,906 నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే 54.5 శాతం ఫిర్యాదులు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బిహార్, హరియాణావంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రజల్లో చైతన్యం పెరిగితేనే ప్రయోజనం
దేశంలో మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై హింస మరింత పెరిగి క్రూరమైన రూపాలను సంతరించుకుంటోంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో స్త్రీలపై హింస విపరీతంగా పెరిగినట్టు మేం గమనించాం. మతం పేరిట, ఇతర రూపాల్లో ద్వేషం, విషపూరిత వాతావరణం నెలకొని గతంలోని స్నేహపూర్వక పరిస్థితి లేకుండా పోయింది. ఇది అన్నిరకాల హింసలకూ దారితీస్తోంది.
నిర్భయ చట్టం తీసుకొచ్చినపుడు.. స్త్రీల హక్కులేమిటి? వారిపై హింసకు ఎందుకు పాల్పడకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించింది. ఇప్పుడైతే మహిళల హక్కులు అనే స్పృహ లేకుండా చేస్తున్నారు. మíహిళలకు సంబంధించిన రంగాలు, అంశాలపై బడ్జెట్ కేటాయింపులను కూడా తగ్గించడం దురదృష్టకరం.
మహిళలపై ఎలాంటి దాడులకు పాల్పడినా తమకేమీ కాదులే అన్న మొండి ధైర్యం హింసకు దారితీస్తోంది. చట్టాలను అమలుచేయాల్సిన పోలీసు, ఇతర వ్యవస్థలు అవినీతితో పారదర్శకతను కోల్పోతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడే చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు దిగొస్తాయి.
- వి.సంధ్య సామాజిక కార్యకర్త,పీవోడబ్ల్యూ
Comments
Please login to add a commentAdd a comment