సాక్షి, హైదరాబాద్: నాలుగైదేళ్లుగా సీజన్ మారగానే దేశానికి డెంగీ జ్వరం పట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయ్. మన రాష్ట్రంలోనూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి. అయినా దేశవ్యాప్తంగా డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు డెంగీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా భారత్ మాత్రం దాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కార్పొరేట్ లాబీయింగ్ వల్లే డెంగీ వ్యాక్సిన్ ఇంతవరకు భారత్‌లోకి రాలేదనే చర్చ జరుగుతోంది. అయితే.. వ్యాక్సిన్ పనితీరుపై వివాదాలు నెలకొన్నందునే భారత్ ముందడుగు వేయడం లేదని మరికొందరు వాదిస్తున్నారు.
నాలుగున్నరేళ్లలో 5.24 లక్షల భారతీయులకు..
ప్రపంచంలో అనేక దేశాలను డెంగీ వణికిస్తోంది. భారత్‌లో గత నాలుగేళ్లుగా డెంగీ జ్వరాలు ప్రజలను పీల్చి పిప్పిచేశాయి. కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం డెంగీ కేసులను లెక్కగట్టగా.. ఒక్క 2015లోనే దేశంలో లక్ష మందికి డెంగీ సోకింది. అందులో 220 మంది చనిపోయారు. 2016లో 1.26 లక్షల మందికి డెంగీ జ్వరం రాగా.. ఇందులో 245 మంది చనిపోయారు. 2017లో 1.88 లక్షల మందికి డెంగీ రాగా, అందులో 325 మంది చనిపోయారు. 2018లో 1.01 లక్షల మంది బాధితుల్లో.. 172 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 5,504 మందికి డెంగీ రాగా ఐదుగురు చనిపోయినట్లు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 967మంది చనిపోయారు. తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో 17,476 మందికి డెంగీ సోకగా.. 8 మంది మాత్రమే చనిపోయినట్లు కేంద్ర నివేదిక పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులను మాత్రమే కేంద్రం పరిగణన లోకి తీసుకుంది. ప్రైవేటుతో కలిపితే ఈ సంఖ్య ఏకంగా 5రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతుంటే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
వ్యాక్సిన్‌తో డెంగీకి చెక్!
‘డెంగ్వాక్సియా’అనే వ్యాక్సిన్ 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఈ ఏడాది మాత్రమే ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అలాగే గతేడాది చివర్లో యూరోపియన్ కమిషన్ కూడా.. యూరప్‌లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలలో ఈ టీకా వాడేందుకు అనుమతిచ్చింది. మరో 19 దేశాలలో ఈ వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపారు. తాజాగా లాటిన్ అమెరికా సహా ఆసియాలోని 10 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు ‘డెంగ్వాక్సియా వ్యాక్సిన్’ను గతంలో ఓసారి డెంగీకి గురైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మరోసారి వారికి డెంగీ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కార్పొరేట్ లాబీకి తలొగ్గేనా?
లక్షలాది మందికి ఇప్పటికే ఓసారి సోకినప్పటికీ మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను ఎందుకు ప్రవేశపెట్టడంలేదన్న చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్‌కు అనుమతిస్తే డెంగీ ద్వారా వచ్చే వ్యాపారమంతా పోతుందన్న భావనలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు వ్యక్తం చేసినట్లు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు.
భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది
డెంగీ వ్యాక్సిన్ దేశంలో 4వ దశ ట్రయల్స్‌లో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి కూడా వచ్చినందున నాలుగో దశ ట్రయల్ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
– డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్,సన్‌షైన్ ఆసుపత్రి, హైదరాబాద్.
ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే ఉంది
ప్రస్తుతం దేశంలో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని ప్రవేశానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియదు. ప్రస్తుతం కేవలం ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది.
– డాక్టర్ శ్రీనివాసరావు, సంచాలకులు, ప్రజారోగ్యం, తెలంగాణ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment