dengue vaccine
-
కోవిడ్ మూడో వేవ్ ముంగిట.. పులి మీద పుట్ర! జర జాగ్రత్త
కరోనా అన్నది సీవోవీ–2 వైరస్‌తో వచ్చినట్టే డెంగీ కూడా డెంగీ వైరస్ వల్ల వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. ఏడిస్ ఈజిపై్ట అనే టైగర్ మస్కిటో ఈ వైరల్ జ్వరాన్ని వ్యాప్తి చేస్తుంది. చాలా వైరల్ జ్వరాల్లాగే ఇది తనంతట తానే తగ్గిపోయే జ్వరం. కాకపోతే ప్లేట్లెట్స్ విపరీతంగా తగ్గిపోవడం వల్ల కొందరిలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటివారిలో మినహా మిగతావారిలో ఇది అంత ప్రమాదం కాదు. అయితే డెంగీ కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న వారు, బీపీ పడిపోతున్నవారు, చిగుళ్లలోగానీ లేదా అంతర్గతంగాగాని రక్తస్రావం అవుతున్నవారు (ఇలా జరిగినప్పుడు మలం నల్లగా వస్తుంది), లేదా స్పృహతప్పిపోయినా... వారు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. అందుబాటులో వ్యాక్సిన్ ఉన్నప్పటికీ: డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) ఉంది. అయితే ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మొదటిసారి కంటే రెండోసారి డెంగీ (సెకండరీ డెంగీ ఇన్ఫెక్షన్) రావడం చాలా ప్రమాదకరం కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిబంధనను విధించింది. డెంగీలో జ్వరం వచ్చి తగ్గాక వ్యాధి పూర్తిగా తగ్గిందని అనుకోకూడదు. నిజానికి ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది జ్వరం తగ్గాకే మొదలవుతుంది. అందుకే ప్లేట్లెట్స్ తగ్గి, మళ్లీ నార్మల్కు వచ్చాక మాత్రమే డెంగీ తగ్గిందని అనుకోవాలి. డెంగీలో కనిపించే లక్షణాలేమిటి? ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాల్లో ఆగకుండా రక్తస్రావం కారడమనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొందరిలో ఒంట్లోని నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎర్రరక్తకణాల సాంద్రత (హీమోగ్లోబిన్ కాన్సంట్రేషన్) పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. కొంతమందిలో కడుపులో, ఊపిరితిత్తుల పొరల్లో నీరుచేరుతుంది. దీన్ని క్యాపిల్లరీ లీక్ అంటారు. ఇది మరింత వేగంగా, తీవ్రంగా (అగ్రెసివ్‌గా) చికిత్స అవసరమైన కండిషన్. బీపీ తగ్గడం వల్ల రక్తపోటు పడిపోతుంది. జబ్బు తీవ్రంగా ఉంటే కొందరిలో లివర్, మూత్రపిండాలూ దెబ్బతినవచ్చు. ఆగకుండా రక్తస్రావం కావడం, ఫిట్స్ రావడం సంభవించి మెదడు కూడా దెబ్బతినవచ్చు. కొందరిలో గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి బాధితులకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాలి. నిర్ధారణ పరీక్షలు : ప్లేట్లెట్స్ తగ్గిన సందర్భాల్లో ప్రతి 24 గంటలకు ఒకసారి రక్తపరీక్ష (సీబీపీ) చేయాలి. డెంగీ ఎన్ఎస్1 (స్క్రీనింగ్), ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు (నిర్ధారణ కోసం) అవసరం కావచ్చు. ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనేది డెంగీ నిర్ధారణకు పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునికమైన నిర్ధారణ పరీక్ష. అయితే ఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రిపోర్టులు వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున, వాటికోసం వేచిచూడకుండా లక్షణాల ఆధారంగానే చికిత్స కొనసాగించాలి. చికిత్స: డెంగీ అన్నది వైరస్‌తో వచ్చేది కాబట్టి దానికంటూ మందులు లేవు. లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలి. అంటే డీ హైడ్రేషన్‌కు నోటి ద్వారా ఓఆర్ఎస్ వంటివి ఇస్తూ ఉండాలి. పరిస్థితి మరీ విషమిస్తే రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ అందించాలి. రక్తస్రావం జరుగుతుంటే అవసరాన్ని బట్టి రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) ఇవ్వాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేలు – 15 వేలకు పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వడం తప్పనిసరి. డెంగీ జ్వరానికి సాధారణ జ్వరం వచ్చిన వారికిలా ఆస్పిరిన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబరుస్తుంది కాబట్టి రక్తస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. నివారణ ఎంతో మేలు... ఎందుకంటే? అన్ని వ్యాధుల లాగే డెంగీకి కూడా చికిత్స కంటే నివారణ మేలు. డెంగీని కలిగించే టైగర్ దోమ సాధారణంగా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఇంట్లోని మూలల్లోని చీకటి / చల్లని ప్రదేశాల్లో ఆవాసం ఏర్పరచుకుంటుంది. అందుకే పగలు అవి కుట్టకుండా ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీళ్లు ఎక్కడా నిల్వ కాకుండా చూసుకోవాలి. ఇల్లంతా గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తపడాలి. - డాక్టర్ కె. శివ రాజు, సీనియర్ ఫిజీషియన్ -
డెంగీ వ్యాక్సిన్ కనబడదేం?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదేళ్లుగా సీజన్ మారగానే దేశానికి డెంగీ జ్వరం పట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయ్. మన రాష్ట్రంలోనూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి. అయినా దేశవ్యాప్తంగా డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు డెంగీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా భారత్ మాత్రం దాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కార్పొరేట్ లాబీయింగ్ వల్లే డెంగీ వ్యాక్సిన్ ఇంతవరకు భారత్‌లోకి రాలేదనే చర్చ జరుగుతోంది. అయితే.. వ్యాక్సిన్ పనితీరుపై వివాదాలు నెలకొన్నందునే భారత్ ముందడుగు వేయడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 5.24 లక్షల భారతీయులకు.. ప్రపంచంలో అనేక దేశాలను డెంగీ వణికిస్తోంది. భారత్‌లో గత నాలుగేళ్లుగా డెంగీ జ్వరాలు ప్రజలను పీల్చి పిప్పిచేశాయి. కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం డెంగీ కేసులను లెక్కగట్టగా.. ఒక్క 2015లోనే దేశంలో లక్ష మందికి డెంగీ సోకింది. అందులో 220 మంది చనిపోయారు. 2016లో 1.26 లక్షల మందికి డెంగీ జ్వరం రాగా.. ఇందులో 245 మంది చనిపోయారు. 2017లో 1.88 లక్షల మందికి డెంగీ రాగా, అందులో 325 మంది చనిపోయారు. 2018లో 1.01 లక్షల మంది బాధితుల్లో.. 172 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 5,504 మందికి డెంగీ రాగా ఐదుగురు చనిపోయినట్లు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 967మంది చనిపోయారు. తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో 17,476 మందికి డెంగీ సోకగా.. 8 మంది మాత్రమే చనిపోయినట్లు కేంద్ర నివేదిక పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులను మాత్రమే కేంద్రం పరిగణన లోకి తీసుకుంది. ప్రైవేటుతో కలిపితే ఈ సంఖ్య ఏకంగా 5రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతుంటే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌తో డెంగీకి చెక్! ‘డెంగ్వాక్సియా’అనే వ్యాక్సిన్ 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఈ ఏడాది మాత్రమే ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అలాగే గతేడాది చివర్లో యూరోపియన్ కమిషన్ కూడా.. యూరప్‌లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలలో ఈ టీకా వాడేందుకు అనుమతిచ్చింది. మరో 19 దేశాలలో ఈ వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపారు. తాజాగా లాటిన్ అమెరికా సహా ఆసియాలోని 10 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు ‘డెంగ్వాక్సియా వ్యాక్సిన్’ను గతంలో ఓసారి డెంగీకి గురైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మరోసారి వారికి డెంగీ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ లాబీకి తలొగ్గేనా? లక్షలాది మందికి ఇప్పటికే ఓసారి సోకినప్పటికీ మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను ఎందుకు ప్రవేశపెట్టడంలేదన్న చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్‌కు అనుమతిస్తే డెంగీ ద్వారా వచ్చే వ్యాపారమంతా పోతుందన్న భావనలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు వ్యక్తం చేసినట్లు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది డెంగీ వ్యాక్సిన్ దేశంలో 4వ దశ ట్రయల్స్‌లో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి కూడా వచ్చినందున నాలుగో దశ ట్రయల్ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. – డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్,సన్‌షైన్ ఆసుపత్రి, హైదరాబాద్. ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే ఉంది ప్రస్తుతం దేశంలో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని ప్రవేశానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియదు. ప్రస్తుతం కేవలం ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. – డాక్టర్ శ్రీనివాసరావు, సంచాలకులు, ప్రజారోగ్యం, తెలంగాణ ప్రభుత్వం -
డెంగ్యూకు వ్యాక్సిన్ వచ్చేసింది
మెక్సికో : ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని మంచాన పడేస్తూ దాదాపు ఏడాదికి 22 వేల మంది ప్రాణాలను హరిస్తున్న డెంగ్యూ మహమ్మారిని విజయవంతంగా నిరోధించేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ వచ్చేసింది. దీన్ని ఫ్రెంచ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సనాఫీ గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి ఈ వ్యాక్సిన్‌ను కనుగొన్నది. దీన్ని అధికారికంగా వినియోగించేందుకు మెక్సికన్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. డెంగ్యూ జ్వరానికి కారణమవుతున్న నాలుగు రకాల వైరస్‌ను ఈ వ్యాక్సిన్ శక్తివంతంగా నిరోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 29వేల మంది ప్రజలపై ప్రయోగాత్మకంగా పరిశీలించి నిర్ధారించిన ఈ వ్యాక్సిన్‌కు ‘డెంగ్వాక్సియా’ అని నామకరణం చేశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తున్న విషయం తెల్సిందే. భారత్‌లో ఈ ఏడాది 85 వేల మందికి డెంగ్యూ వ్యాధి సోకగా, ఒక్క ఢిల్లీ నగరంలోనే 15వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కొత్తగా కనుగొన్న ఈ వ్యాక్సిన్‌ను ప్రాథమికంగా 9 ఏళ్ల పైబడి 49 ఏళ్ల లోపున్న వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నది మెక్సికోనే. తొలుత 40 వేల మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు ఫలితాలను విశ్లేషించడం ద్వారా క్రమంగా వినియోగాన్ని విస్తరించాలని మెక్సికో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్‌ను కనుగొనడం ప్రజారోగ్య చరిత్రలో ఓ మైలురాయి వంటిదని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన సనాఫీ వ్యాక్సిన్ డివిజన్ అధిపతి ఆలివియర్ చర్మేయిల్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
వచ్చే ఏడాది మధ్య నాటికి డెంగీ వ్యాధికి టీకా!
ముంబై: ప్రపంచంలోనే తొలి డెంగీ టీకా 2015 మధ్యనాటికి అందుబాటులోకి రానుంది. దోమల ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం డెంగీకి వచ్చే ఏడాది మధ్యనాటికి టీకాను సిద్ధం చేయనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ సనోఫీ వెల్లడించింది. తుది దశ ఔషధ పరీక్షల్లో భాగంగా.. డెంగీ జ్వరం బాధితులు ఉన్న 10 దేశాల్లోని 31 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను పరీక్షించగా డెంగీ నుంచి 95.5 శాతం రక్షణ కల్పించినట్లు తేలిందని ఆ కంపెనీ తెలిపింది.