డెంగ్యూకు వ్యాక్సిన్ వచ్చేసింది | First dengue vaccine cleared for use in Mexico | Sakshi
Sakshi News home page

డెంగ్యూకు వ్యాక్సిన్ వచ్చేసింది

Published Thu, Dec 10 2015 1:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

డెంగ్యూకు వ్యాక్సిన్ వచ్చేసింది

డెంగ్యూకు వ్యాక్సిన్ వచ్చేసింది

మెక్సికో : ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని మంచాన పడేస్తూ దాదాపు ఏడాదికి 22 వేల మంది ప్రాణాలను హరిస్తున్న డెంగ్యూ మహమ్మారిని విజయవంతంగా నిరోధించేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ వచ్చేసింది. దీన్ని ఫ్రెంచ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సనాఫీ గత 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి ఈ వ్యాక్సిన్‌ను కనుగొన్నది. దీన్ని అధికారికంగా వినియోగించేందుకు మెక్సికన్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.


డెంగ్యూ జ్వరానికి కారణమవుతున్న నాలుగు రకాల వైరస్‌ను ఈ వ్యాక్సిన్ శక్తివంతంగా నిరోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 29వేల మంది ప్రజలపై ప్రయోగాత్మకంగా పరిశీలించి నిర్ధారించిన ఈ వ్యాక్సిన్‌కు ‘డెంగ్వాక్సియా’ అని నామకరణం చేశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తున్న విషయం తెల్సిందే. భారత్‌లో ఈ ఏడాది 85 వేల మందికి డెంగ్యూ వ్యాధి సోకగా, ఒక్క ఢిల్లీ నగరంలోనే 15వేల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

కొత్తగా కనుగొన్న ఈ వ్యాక్సిన్‌ను ప్రాథమికంగా 9 ఏళ్ల పైబడి 49 ఏళ్ల లోపున్న వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నది మెక్సికోనే. తొలుత 40 వేల మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎప్పటికప్పుడు ఫలితాలను విశ్లేషించడం ద్వారా క్రమంగా వినియోగాన్ని విస్తరించాలని మెక్సికో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్‌ను కనుగొనడం ప్రజారోగ్య చరిత్రలో ఓ మైలురాయి వంటిదని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన సనాఫీ వ్యాక్సిన్ డివిజన్ అధిపతి ఆలివియర్ చర్మేయిల్ మీడియాతో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement