
పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేస్తున్న బెదిరింపులపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తీవ్రంగా స్పందించారు. ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టంచేశారామె.
‘‘ట్రంప్ చేసే డ్రగ్స్ ముఠాల కట్టడికి మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల బెదిరింపులకు నేను భయపడను. నేను ప్రజల మనిషిని. మెక్సికన్ ప్రజల మద్దతు ఉంది. మెక్సికో (Mexico) సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకుంటా’’ అని అన్నారామె.
వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టగానే.. అగ్రరాజ్యంలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా దేశాలపై 25 శాతం సుంకం విధిస్తానంటూ హెచ్చరించారు కూడా. అలాగే.. అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే..
మెక్సికోపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలను నెలరోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై చర్చలు జరిపేందుకు ఇరుదేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.