![Telangana High Court Request State Government To Provide Details Of Doctors Security Measures - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/5/corona12.jpg.webp?itok=k5hHTFtX)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లోని డాక్టర్లకు కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకున్న చర్యలను తమకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే 37 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంపై దాఖలైన ఏడు వేరువేరు ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకున్నా కరోనా బారిన 37 మంది డాక్టర్లు ఎలా పడ్డారని ప్రశ్నించింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లకు రక్షణ పరికరాలను సరఫరా చేసుంటే ఈ పరిస్థితులు ఏర్పడేవి కావని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వైద్యం చేసే డాక్టర్లకే ఈ పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రతివాదన చేస్తూ, డాక్టర్లందరికీ పీపీఈ కిట్లు, క్లినికల్ మాస్క్‌లు, ఎన్ 95 మాస్క్‌లు, గ్లౌజులు వంటికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదిక నిమిత్తం విచారణ 8కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment