సర్కారు నిద్రపోతోందా? | High Court Fires On Telanagana Government About Not Caring Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

Published Tue, Jul 21 2020 12:56 AM | Last Updated on Tue, Jul 21 2020 11:40 AM

High Court Fires On Telanagana Government About Not Caring Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాధి కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద ప్రజల జీవితాలు ఆధారపడి లేవని, రాజ్యాంగ బద్దంగా కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో ప్రజలకు సరైన వైద్యం అందక జీవించే హక్కు కాలరాయబడుతోందని, ఇటువంటి తీవ్రమైన సమయంలో న్యాయ స్థానం చూస్తూ ఊరు కోదని హెచ్చరిం చింది. కేంద్రం, ఐసీఎంఆర్‌ తమ మార్గ దర్శకాలు పాటించాలంటూ పదేపదే చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయిదాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది

. రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూ నిత్యం వందలాది కేసులు నమోదు అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని,  ప్రభుత్వ తీరు చూస్తోంటే నిద్రపోతున్నట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది.  కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి పరీక్షలు పెంచాలంటూ గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ఇప్పటికీ తమకు అందలేదని ఏజీ చెబుతున్నారని....ఇంతకాలమైనా సమాచారం అందలేదనడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ప్రజలకు తెలియజేయాల్సిన కీలకమైన సమాచారాన్ని దాస్తున్నారని, ప్రజల సంరక్షణ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా ఇలా వ్యవహరించడం తగదన్నారు. తమ ఆదేశాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా, ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్య ధోరణితోనే అమలు చేయలేదని, అధికారుల తీరు ఇప్పటికైనా మారకపోతే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించింది.

వెంటనే తమ ఆదేశాలను అమలు చేయాలని, ఈనెల 28 నాటికి తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, మునిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ కె.రమేష్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు  వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. కరోనా చికిత్స అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. 

ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయండి
‘‘కరోనా బారినపడుతున్న వారిలో ఏ వయసు వారున్నారో ప్రకటించండి. అందులో ఫురుషులు, స్త్రీల సంఖ్య ఎంతో తెలియజేయండి. కరోనా రోగులతో కలిసిన వారి (సెకండరీ కాంటాక్ట్‌) వివరాలు వెల్లడించండి. వారికి 5వ, 10వ రోజు పరీక్షలు చేసి ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచండి. వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను వెంటనే పునరుద్దరించండి. వైద్యం అందించే ఆసుపత్రుల వివరాలు, అందుబాటులో ఉన్న బెడ్స్‌ కేటగిరీ వారీగా వెల్లడించండి. వెంటిలేటర్‌తో కూడిన బెడ్స్, ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్, సాధారణ బెడ్స్‌ ఏ ఆసుపత్రిలో ఎన్ని అందుబాటులో ఉన్నాయో అన్ని భాషల్లో ప్రముఖంగా కనిపించేలా అందులో ఉంచండి. అలాగే ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రసార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయండి. బెడ్స్‌ వివరాలను చెప్పాలని తాము ఈనెల 1న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 19 రోజులు గడిచినా ఇంకా అరకొర సమాచారమే ఇస్తున్నారు. ప్రజలకు వారికి సమీపంలోని ఏ ఆసుపత్రిలో బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయో తెలిస్తే వారు అక్కడికి వెళ్లి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. వెంటనే ఈ సమాచారాన్ని ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయి? ఏ ల్యాబ్‌లో ఎన్ని ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్స్‌ అందుబాటులో ఉన్నాయో వెల్లడించాలి.

రోజూ ఇచ్చే మెడికల్‌ బులెటిన్‌లోనూ ఈ సమాచారాన్ని చేర్చాలి. అలాగే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రస్తుతం ఉన్న వాట్యాప్‌ నెంబర్‌ 9154170960ను ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయండి. మెడికల్‌ బులెటిన్‌లోనూ పేర్కొనండి. ఫిర్యాదుల స్వీకరణకు టెలిఫోన్లను పెంచండి. అత్యవసరమైన ఫిర్యాదులైతే 24 గంటల్లో పరిష్కరించండి. అంత తీవ్రతలేనివైతే 72 గంటల్లో పరిష్కరించండి. అలాగే ఏఏ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయో పేర్కొనండి. అన్ని జిల్లాల కలెక్టర్లు కరోనా రోగుల వివరాలను ప్రతి రోజూ ప్రకటించండి. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరుకావాలని నిబంధనలున్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చూడండి. తదుపరి విచారణలోగా తీసుకున్న చర్యలను వివరించండి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇప్పటికైనా మేల్కొనండి
‘‘కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో భారత్‌లో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. కర్ణాటకలో ఎనిమిదిన్నర రోజులకు కేసులు రెండింతలు అవుతుండగా....తెలంగాణ తొమ్మిదిన్నర రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. 2 వారాల్లో 20 వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సగటు 7.18 శాతం ఉండగా...తెలంగాణలో 21.91 శాతం ఉంది. జాతీయ సగటుకన్నా మూడింతలు ఎక్కువ. అయినా అధికారుల్లో చలనం లేదు. 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2.10 లక్షల టెస్టులు చేయగా, తెలంగాణలో 1.09 లక్షల టెస్టులు మాత్రమే చేశారు. టెస్టులు నిర్వహించడంతో తెలంగా>ణ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. తమిళనాడులో ప్రతి పదిలక్షల మందికి 24,292, ఏపీలో 24,138, మహారాష్ట్రలో 12,179 టెస్టులు చేస్తుండగా తెలంగాణలో కేవలం  5,961 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి 50 శాతం మంది కరోనా బారినపడే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండడంతో కర్ణాటకలో 10 రోజుల లాక్‌డౌన్‌ పెట్టారు. కేసులు తక్కువగానే ఉన్నా అస్సాంలోని గౌహతిలో 3 రోజుల లాక్‌డౌన్‌ పెట్టారు. ప్రజల ప్రాణాలకన్నా ఏదీ ఎక్కువ కాదు. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోండి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 

చివాట్లు పెడితే ప్రశంసించామంటారా ?
‘‘కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరు బాగాలేదని, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు పెంచాలని పలుమార్లు ఆదేశాలు జారీచేశాం. ప్రతి విచారణ సమయంలో అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. అయినా ప్రభుత్వ పనితీరును హైకోర్టు ప్రశంసించినట్లుగా డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఇది ఎంత వరకు సమంజసం. మేము అనని అంశాన్ని తప్పుగా ఎలా చెబుతారు?  అధికారులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఏదో చేశామని గొప్పలు చెప్పుకోవడంలో భాగంగా హైకోర్టు పేరును వాడుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. సదరు అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలి. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రతిసారీ ఏజీ హామీ ఇస్తారు. అయినా అధికారులు అమలు చేయరు. ఇది ఇప్పటికి నాలుగోసారీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీకి విలువ లేకుండా పోయింది. ప్రభుత్వం వినికిడి లోపం ఉన్నట్లుగా వ్యవహరిస్తోంది. మేం ఏం చేయాలనుకుంటే అదే చేస్తాం. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరన్న వైఖరి అధికారుల్లో కనిపిస్తోంది. ఈ పద్ధతిని ఇకనైనా మార్చుకోవాలి. ఇది కోర్టుకు అధికారులకు మధ్య ఘర్షణ కాదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అధికారులు మా ఆదేశాల్లోని తీవ్రతను అర్థం చేసుకుంటారనే బావిస్తున్నాం’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

తెలుగులో ఉన్న క్లిప్పింగ్స్‌ పెడతారా ?
‘‘నాకు తెలుగు చదవడం రాదనే విషయం తెలుసు. అయినా ఈనెల 10, 11 తేదీలకు సంబంధించిన కొన్ని పేపర్‌ క్లిప్పింగ్స్‌ను తెలుగులోనే నా ముందుంచారు. ఈ వారం రోజుల వ్యవధిలో కనీసం హెడ్‌లైన్స్‌ అయినా ఇంగ్లీషులోకి తర్జమా చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది అధికారుల చేతగానితనం. చాలా ఓపికగా, సహనంతో ఎదురుచూశాం. ఇక తీవ్రమైన చర్యలుంటాయి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అధికారుల చర్యలు నేరపూరితంగా ఉన్నాయి. ఇక నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రిమినల్‌ చర్యలుంటాయి. న్యాయవ్యవస్థలో నలుగురిని కోల్పోయాం. 45 మంది సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు.

జిల్లాల్లో న్యాయస్థానాలు తెరిచే పరిస్థితి లేదు. సరైన పీపీఈ కిట్స్‌ ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందనే భయంతో కేరళకు చెందిన నర్స్‌లు పనిచేసేందుకు సిద్దంగా లేరని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికైనా పరిస్థితి చక్కదిద్దండి. ఏ ఆసుపత్రిలో ఎన్ని పీపీఈ కిట్స్‌ అందుబాటులో ఉన్నాయో చెప్పండి. వైద్య సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించండి. ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వారు కరోనాబారిన పడకుండా కాపాడండి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయండి. లేదంటే కోర్టుధిక్కరణ కింద తీవ్రమైన చర్యలను ఎదుర్కొంటారు’’ అని ధర్మాసనం హెచ్చరించింది. 

ఉస్మానియా ఆసుపత్రిలో వర్షానికి నీళ్లు చేరాయి. వార్డులన్నీ నీటితో నిండిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఎలా వైద్యం పొందుతారు ? వైద్యులు, నర్సులు అక్కడ విధులెలా నిర్వహిస్తారు. రెండేళ్లుగా ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తామని చెబుతున్నా ఎందుకు కల్పించలేదు. ఇప్పటికైనా ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాల్లో నూతన భవనాలు నిర్మించండి’’ అని ధర్మాసనం సూచించింది.

   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement