సాక్షి, హైదరాబాద్: కరోనాతో చనిపోతున్నవారి మరణాల సంఖ్యపై ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం అనుమానాస్పదంగా ఉందని, నమ్మశక్యంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. మార్చి నుంచి ఇప్పటికి కేసు ల సంఖ్య గణనీయంగా పెరిగినా మరణాల సంఖ్య మాత్రం రోజుకు 9 నుంచి 10 మాత్ర మే రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుండటంపై అనుమానం వ్యక్తం చేసింది. కరోనా రోగుల మరణాలపై స్పష్టమైన సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణాల పై వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాల్సి ఉంటుం దని పేర్కొంది. కరోనాకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా, వైద్య సిబ్బంది రక్షణకు చర్యలు చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన 19 పిల్స్‌ను సీజే జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది.
అధిక బిలు ్లలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలతో కరోనా చికిత్సల అనుమతి రద్దుకు 3 ఆసుపత్రులకు నోటీసులిచ్చినట్లుగా ప్రభుత్వం నివేదికలో పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ ఆస్పత్రుల పేర్లు ఎందుకు పేర్కొనలేదని, వాటి ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆ పేర్లను వెల్లడించలేదా అంటూ ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నిం చింది. అలాగే 161 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 38 హాస్పిటల్స్‌కు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నా.. ఏ రకమైన ఫిర్యాదు లు వచ్చాయి? ఏ హాస్పిటల్స్‌కు ఎప్పుడు నోటీసులిచ్చారు? నోటీసుల తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు తదితర వివరాలేవీ పేర్కొనపోవడంపై మండిపడింది. ప్రైవేటు హాస్పిటల్స్ చట్టానికేమీ అతీతం కాదని గుర్తించాలని, వాటిపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారంటూ ప్రశ్నించింది.
విచారణకు 3 నిమిషాల ముందు నివేదికలా?
విచారణ ప్రారంభమయ్యే 3 నిమిషాల ముందు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత 20 రోజుల క్రితం ఈ కేసును విచారించామని, తమ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు నివేదిక సమర్పణకు 20 రోజుల గడువు సరిపోలేదా అని ఏజీని ప్రశ్నించింది. ‘ప్రతి విచారణలోనూ అరకొర సమాచారమిస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే లోపాలు సరిచేసుకొని వచ్చే విచారణకు సమగ్రమైన నివేదిక ఇస్తామంటారు. మళ్లీ ఆ విచారణకూ ఇదే చెబుతారు. కోర్టుకు నివేదిక సమర్పించే ముందు ఏజీ కార్యాలయం పూర్తిగా చదవాలి. లోపాలు, కోర్టు కోరిన సమాచారం లేకపోతే తిప్పి పంపాలి.
అంతేగానీ వారిచ్చిన అరకొర సమాచారాన్ని సమర్పించడం ద్వారా ప్రభుత్వ నివేదికలపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఉత్తర్వులు జారీచేశాం. గతంలో 90 శాతం ఆదేశాలు అమలు చేశారని ఆయన హాజరునకు మినహాయింపునిచ్చాం. ప్రభుత్వ అధికారులు ప్రభువులు కాదు. ప్రభుత్వ అధికారులు మీ క్లయింట్స్ మాత్రమే అనే విషయాన్ని ఏజీ మర్చిపోవద్దు. ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ఏజీకి ధర్మాసనం ఏం సమాచారం కోరిందో తెలియదని అనుకోవాలా ? అధికారుల తీరు ఇలాగే ఉంటే మళ్లీ సీఎస్‌ను హాజరుకావాలని ఆదేశించాల్సి ఉంటుంది’అని ధర్మాసనం హెచ్చరించింది.
ఆరోగ్య శాఖ మంత్రి హామీకే దిక్కులేదు..
ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్యలో భారత్ ద్వితీయ స్థానంలో ఉందని, తెలంగాణలో కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులు, సిబ్బంది రక్షణకు ప్రమాదం ఏర్పడుతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోందంటూ వచ్చిన కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ‘ప్రైవేట్ హాస్పిట ల్స్‌లో 50 శాతం బెడ్లను స్వాధీనం చేసుకుంటామంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదు. ఇటువంటి తప్పుడు హామీలు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని పొందిన హాస్పిటల్స్ ఒప్పందం మేరకు పేదలకు చికిత్సలు చేశాయా? లేదా అన్న సమాచారం ఇవ్వలేదు. ఒప్పందం ఉల్లంఘించి ఉంటే వాటిపై ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఎన్ని హాస్పిటల్స్‌కు ప్రభుత్వం రాయితీ పద్ధతిలో భూమిని ఇచ్చింది.. తదితర వివరాలను సమర్పించండి’అని కోర్టు స్పష్టం చేసింది.
ఆదివారం తక్కువ పరీక్షలా?
కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంటే గత ఆదివారం పరీక్షల సంఖ్యను 50 శాతం తగ్గించారని, అంటే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రజలను మభ్యపెట్టేందుకే ఇటువంటి ప్రయ త్నం చేసినట్లుగా ఉందంటూ ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదివారం కాబట్టి ఎవరూ రాక పరీక్షల సంఖ్య తగ్గిందన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. ఆదివారం సౌకర్యంగా ఉం టుందని, టెస్టుల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉన్నా తగ్గడమేంటని ప్రశ్నించింది. గతంలో ఆదివారాలు చేసిన పరీక్షల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ధర్మాసనం ముందు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment