అడవి బిడ్డల బిడ్డ: విచిత్ర, కేరళ ; క్షేమసమాచారం: లక్ష్మీ వాఘేలా, గుజరాత్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్‌కు ‘గ్లోబల్ హెల్త్‌లీడర్స్’ పురస్కారం ప్రకటించింది. ఈ సందర్భంగా వారి గురించి...
కోవిడ్ సంక్షోభంలో ప్రపంచం తుఫానులో చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో వారు ధైర్యంగా ముందడుగు వేశారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ కదిలారు. బాటలు నడిచీ, పేటలు కడచీ, నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అంటూ ఏటికి ఎదురీదారు. మృత్యుభయకంపిత ముఖాల్లో బతుకు ఆశ కలిగించారు...
గుజరాత్‌లోని వాజీపూర్ వెయ్యికి పైగా గడపల ఊరు. ఈ ఊరికి నలభై రెండు సంవత్సరాల లక్ష్మీ వాఘేలా అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశ). ఆమె ఊరంతటికీ అమ్మలాంటిది. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిస్సంకోచంగా లక్ష్షి్మ దగ్గర చెప్పుకుంటారు. ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన లక్ష్మి కోవిడ్ సమయంలో ఉదయం అయిదింటికి లేచి ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి బయలుదేరేది. ‘బయట పరిస్థితి ఏమీ బాగలేదు. ఉద్యోగం కంటే బతికి ఉండడం ముఖ్యం కదా. ఉద్యోగం వదిలెయ్’ అని చుట్టాలుపక్కాలు చాలామంది చెప్పారు. అయితే వారి మాట పట్టించుకోలేదు. ఆమె దృష్టిలో తాను చేస్తున్నది ఉద్యోగం కాదు. సమాజసేవలో భాగం కావడం.
వ్యాక్సినేషన్ సమాచారానికి సంబంధించి డోర్–టు–డోర్ సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు చేయించుకోవడానికి భయపడేవారిని ఒప్పించడం, కోవిడ్ బాధితులకు నిరంతరం ధైర్యం చెప్పడం, అత్యవసర మందులను సరఫరా చేయడం... ఒకటారెండా ఊపిరి సలపనంత పని ఉండేది. అయితే ఎప్పుడూ చిరాకు పడింది లేదు. వెనక్కి తగ్గింది లేదు.
‘డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో అందరూ నన్ను అనుమానంగా చూసేవారు. ఎప్పుడూ ఆత్మీయంగా పలకరించేవాళ్లు కూడా భయపడి దూరం దూరంగా వెళ్లిపోయేవారు. ఇది చూసి నాలో నేను నవ్వుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లక్ష్మీ వాఘేలా.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా గ్రామాల్లో ఆశా కార్యకర్తలపై దాడులు జరిగాయి. మంచిపని కోసం వెళితే చెడు ఎదురయ్యేది. అయినా సరే భయపడుతూనో, బాధ పడుతూనో వెనక్కి వెళ్లలేదు. భయంతో వెనక దాక్కున్న వారిని ముందుకు తీసుకువచ్చారు. వారికి పరీక్షలు చేయించారు. ‘కోవిడ్ సమయంలో ఆశా వర్కర్స్ కనిపించగానే ముఖం మీదే తలుపు వేసేవారు. అలాంటి అవమానాలను మనసులోకి తీసుకోకుండా చాలా ఓపికగా బాధ్యతలు నిర్వర్తించారు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ప్రజలకు సేవలు చేస్తూ చనిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు’ అంటుంది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆశా వర్కర్స్ జనరల్ సెక్రటరీ బీవీ విజయలక్ష్మి.
కేరళలోని కరింగరి గిరిజన ప్రాంతాలలోని పల్లెలపై వైద్య అధికారులు దృష్టి సారించే వారు కాదు. అయితే విచిత్ర వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 23 సంవత్సరాల విచిత్ర ఓ ఆశా వర్కర్. ప్రతి ఇంటికీ వెళ్లేది. వారి క్షేమ సమాచారాలు కనుక్కునేది. కోవిడ్ సమయంలో తాను ఆరునెలల గర్భిణి, ఇల్లు దాటి వెళ్లవద్దని ప్రతి ఒక్కరూ చెప్పారు. కొందరైతే... ‘నీకు వచ్చే కొద్దిపాటి నెల జీతం కోసం ఆశ పడితే...జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటీ’ అని విసుక్కునేవారు.
‘అన్నీ తెలిసిన వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లే కోవిడ్ బారిన పడుతున్నారు. పాపం ఆ అడవి బిడ్డలలో చాలామందికి ఏమీ తెలియదు. వారిని జాగ్రత్త పరచడం, సహాయంగా ఉండడం అవసరం’ అంటూ బ్యాగ్ సర్దుకొని డ్యూటీకి బయలుదేరేది విచిత్ర. ఎన్నో గిరిజన గ్రామాలకు విచిత్ర బయటి నుంచి వచ్చిన ఉద్యోగి కాదు. తమ ఇంటిబిడ్డ. ఏ ఒక్కరోజైనా ఆమె రాకపోతే ఆందోళనగా తన గురించి ఆరా తీసేవారు. గుజరాత్‌లోని లక్ష్మీ వాఘేలా నుంచి కేరళలోని విచిత్ర వరకు ఎందరెందరో ఆశా ఉద్యమకారులు తమ వృత్తి నిబద్ధత చాటుకుంటూ జేజేలు అందుకున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆశావర్కర్స్‌కు ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ పురస్కారాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment