న్యూయార్క్: కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటివరకూ చెబుతూండగా.. గాలి ద్వారా సోకుతుందని, అతి సూక్ష్మ స్థాయి కణాలూ వైరస్‌ను మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు సడలింపుతో ప్రజలు బార్లు, కార్యాలయాలు, మార్కెట్లలో గుమికూడటం ఎక్కువైందని, దంతో రోగుల వారి సమూహాలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్నిబట్టి కరోనా వైరస్ గాల్లో ఎక్కువకాలం మనగలగడమే కాకుండా ఇతరులకు సోకుతోందని అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఇచ్చే సలహా, సూచనల్లో మార్పులు చేయాలని వారు కోరారు.
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ అది కేవలం దగ్గు, తుమ్ముల ద్వారా తుంపర్లతోనే ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పడం తెల్సిందే. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను నియంత్రించవచ్చునని ఆ సంస్థ అందరికీ సూచనలు కూడా చేసింది. అయితే గత నెల 29న మాత్రం వైద్య ప్రక్రియల సమయంలో వెలువడే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న తుంపర్ల ద్వారా వైరస్ సోకే అవకాశమున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భవనాల లోపల కూడా, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ద్వారా సోకుతుందన్న సమాచారానికి ప్రాధాన్యమేర్పడింది. భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలకు సాధారణ మాస్కుల స్థానంలో అతిసూక్ష్మమైన కణాలను అడ్డుకోగల ఎన్95 మాస్కులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో వెంటిలేషన్ వ్యవస్థలను సరిచేసుకోవాల్సి ఉంటుందని, అతినీలలోహిత కిరణాల సాయంతో భవనాల్లోపల శుద్ధి చేసుకోవడం మేలని డాక్టర్ బెనెడెట్టా అలెగ్రాంజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment