
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కోవిడ్–19 టీకా కేటాయింపులో వివక్ష కొనసాగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. జనాభా, కేసుల తీవ్రత, వినియోగ సామర్థ్యం, వృథా వంటి అంశాల ప్రాతిపదిక రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వివరించింది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ పారదర్శకంగా లేదంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారాలని తెలిపింది.
కేంద్రం అమలు చేస్తున్న జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న మేలైన విధానాలు, శాస్త్రీయంగా, వివిధ అధ్యయనాల ఆధారంగా రూపుదిద్దుకుందని ఆరోగ్యశాఖ వివరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో ఈ కార్యక్రమం సమర్థనీయంగా, ప్రభావవంతంగా అమలవుతోందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ.. సరఫరా చేసిన, వినియోగించిన, నిల్వ ఉన్న టీకా డోసుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నట్లు తెలిపింది.
చదవండి: వచ్చే 10–12 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్–3లో ఉండాలి