మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి! | Sakshi Guest Column On Junk Food | Sakshi
Sakshi News home page

మంచిదేదో 'జంకు' లేకుండా చెప్పాలి!

Published Thu, Mar 2 2023 12:51 AM | Last Updated on Thu, Mar 2 2023 12:52 AM

Sakshi Guest Column On Junk Food

జంక్‌ ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజీ ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది.

ఇలా గుర్తించడం విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే, జంక్‌ ఫుడ్‌ తయారీదారులు తమ మార్కెటింగ్‌ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్‌ చేసే ప్రమాదం ఉంది. 

ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో భారతదేశాన్ని చిరుధాన్యాల ఎగుమతి కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ సిరి ధాన్యాలు మానవ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పర్యావరణానికీ మేలు చేసేవి. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ పండించగలగడం ఇందుకు కారణం. నిజానికి చిరుధాన్యాలు వందల ఏళ్లుగా భారతీయ ఆహారంలో భాగంగానే ఉన్నాయి.

జొన్న, సజ్జ, రాగి వంటివి 1960వ సంవత్సరం వరకూ నలుగురిలో ఒకరు తినేవారు. కానీ, హరిత విప్లవం తరువాత చిరుధాన్యాల వాడకం క్రమేపీ తగ్గిపోయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ చిరుధాన్యాలపై ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రమాదం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిరు ధాన్యాలను మళ్లీ మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు కొంత కాలంగా సూచిస్తున్న విషయం తెలిసిందే.

చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం తగ్గుతున్న క్రమంలోనే దేశంలో ఆహారపు అలవాట్లూ మారిపోయాయి. శుద్ధి చేసిన ప్యాకేజ్డ్, ‘రెడీ టు ఈట్‌’ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మొదలైంది. అప్పట్లో వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ఉండేందుకు, ఆహార వృథాను అరికట్టేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించా రన్నది మరువరాదు.

ఆర్థిక సరళీకరణ విధానాల అమలు ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వాడకం మరింత ఎక్కువయ్యేందుకు కారణమైంది. 1991 తరువాత చక్కెర లతో నిండిన పానీయాలు దేశీ మార్కెట్లను ముంచెత్తాయి. అలాగే జంక్‌ ఫుడ్‌ అని ఇప్పుడు మనం పిలిచే రకరకాల ఆహార పదార్థాలూ అందుబాటులోకి వచ్చాయి. చక్కెరలు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ కాస్తా ఊబకాయం, అసాంక్ర మిక వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో చిరుధాన్యాలను మళ్లీ ప్రధాన ఆహారంగా మార్చడం పెద్ద సవాలే. ఒక పక్క రైతులు తమ పంటలు, పద్ధతులు మార్చుకునేందుకు తగిన ప్రోత్సాహాలు అందించడం... ఇంకోవైపు వినియోగదారులను చైతన్యపరచడం, వారి ఆహారపు అలవాట్లను మార్చడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. భయం ఏమిటంటే... ఎక్కడ ఈ జంక్‌ ఫుడ్‌ పరిశ్రమ చిరుధాన్యాలపై ప్రస్తుతమున్న ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటుందో అని! అసాంక్రమిక వ్యాధులు ప్రబలేందుకు జంక్‌ ఫుడ్‌ ఒక కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే స్పష్టం చేసిందో, వీటిని పిల్లలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాల నియంత్రణకు సూచనలు జారీ చేసిందో... అప్పటినుంచీ జంక్‌ ఫుడ్‌ పరిశ్రమ తమ ఉత్పత్తులను ఆరోగ్య కరమైనవనీ, సహజమైనవనీ చెప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.

మల్టీ గ్రెయిన్  కుకీలు, చక్కెర తక్కువగా ఉన్న శీతల పానీయాలు, హృదయానికి దోస్తుల్లాటివని చెప్పే వంటనూనెలు, ‘పండ్ల’ రసాలు అని పేర్లు పెట్టి... ఇంట్లో వండుకునే ఆహారానికీ,పండ్లు, కాయగూరలకూ వీటిని ప్రత్యామ్నాయాలుగా చూపే ప్రయత్నం మొదలైంది. చిరుధాన్యాల ద్వారా కూడా ఈ మాయ చేసేందుకు కంపెనీలు కొన్ని ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ –నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ వైపు పరుగులు పెడు తున్నాయి కూడా. 

జంక్‌ ఫుడ్‌ తయారీదారులు తమ ఉత్పత్తుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గొప్పగా చెప్పుకొంటూనే కీలక సమాచారాన్ని విని యోగదారుల కంటపడకుండా చూస్తాయి. ఆహారంలోని పదార్థాలు, హానికారక ‘అడిటివ్స్‌’(కలిపినవి) వివరాలు కనిపించకుండా చేస్తాయి. దేశ నియమ నిబంధనల ప్రకారం ఫుడ్‌ ప్యాకెట్స్‌పై ‘పోషక సమా చారం’ తప్పనిసరిగా నిర్దిష్ట పద్ధతిలో ప్రచురించాలి. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలు ఎంత మోతాదుల్లో ఉన్నాయో తెలపాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి పుణ్యమా అని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇప్పుడు ‘ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాక్‌ న్యూట్రిషన్  లేబలింగ్‌’ను ప్రతిపాదించింది. సాధారణంగా ప్యాకెట్‌ వెనుకభాగంలో ఉండే సమాచారాన్ని ముందు కూడా ప్రచురించాలని ఈ ప్రతిపాదన ఉద్దేశం. దీనివల్ల వినియోగదారులకు మరింత సమాచారం అంది ఆరోగ్యకరమైన అల వాట్లు చేసుకుంటా రని అంచనా. శాకాహార, మాంసాహార ఉత్పత్తు లను వేరు చేసేందుకు వాడినట్లు ఇవి కూడా గుర్తుల రూపంలో ఉంటాయి. 

జంక్‌ ఫుడ్‌ కంపెనీలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కావాలని కోరుకుంటున్న స్టార్‌ రేటింగ్‌ల విషయంలో ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంత ఆరోగ్యకరం కాదని సూచించేందుకు రెండు స్టార్లను ఇచ్చినప్పుడు కూడా వినియోగదారులు వీటిని తీసుకునేందుకు మొగ్గు చూపు తున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసింది. పైగా ఈ స్టార్‌ రేటింగులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇచ్చేవి కాబట్టి వాటిని పరిశ్రమ వర్గాలు తమకు అనుకూలంగా మర్చుకునే అవకాశముందని అంచనా.

వీటికి భిన్నంగా వార్నింగ్‌ లేబుల్స్‌(హెచ్చరికలు) మాత్రం అందులో ఉన్న పదార్థాల ఆధారంగా తయారవుతాయి. కుకీలు, పాస్తా, నూడుల్స్‌ వంటివాటిల్లో కొంత మోతాదులో జొన్నలు, సజ్జలు కలిపి నంత మాత్రాన వాటికి ఆరోగ్యకరమైనవన్న ట్యాగ్‌ తగిలించాల్సిన అవసరమేమీ లేదు కదా!

మరి పోషకాలపై మనకున్న అవగాహన ఎంత? హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) అంచనా ప్రకారం అది చాలా తక్కువ. ఫుడ్‌ లేబుల్‌లోని సమాచారం అప్పు డప్పుడూ చదువుతాము కానీ... కొనుగోళ్ల సమయంలో ఎక్కువగా తయారీ, ఎక్స్‌పైరీ డేట్లనే చూస్తూంటామని ఎన్ ఐఎన్  నిర్వ హించిన ఒక అధ్యయనంలో అధికులు తెలపడం ఇక్కడ ప్రస్తావ నార్హం. ఇదే సమయంలో శాకాహార, మాంసాహారాలను వేరు చేసేందుకు ఉపయోగించే గుర్తులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నట్లు వారు ఒప్పుకొంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఆహారపు అనారోగ్యతను సూచించేందుకు ట్రాఫిక్‌ సిగ్నళ్ల మాదిరి గుర్తులను వాడాలని కొంతమంది సూచి స్తున్నారు. కానీ కంపెనీలు మాత్రం ‘హెల్త్‌ స్టార్‌ రేటింగ్‌’ ఉంటే మేలు అంటున్నాయి. అయితే స్టార్‌ గుర్తు సానుకూలతను సూచిస్తుంది. ఒకట్రెండు అధ్యయనాల ప్రకారం కొందరు బాగా శుద్ధి చేసిన ఆహారం ప్యాకెట్లపై ఎర్రటి గుర్తు పెట్టడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ కూడా ప్యాకేజీల ముందువైపు సమాచారం ఇవ్వడం మంచిదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 

అంటే జంక్‌ఫుడ్‌తో వచ్చే అనారోగ్యంపై ప్రజలను హెచ్చరించాలనుకుంటే ఆ హెచ్చరిక ఓ గుర్తు రూపంలో ఉండాలి. ప్యాకేజి ముందువైపున ముద్రించాలి. వేర్వేరు రంగుల సాయంతో అనారోగ్య స్థాయిని కూడా సూచించగలిగితే ప్రజలు ఓ మోస్తరు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని లేదా అనారోగ్య కారక ఆహారాన్ని వేర్వేరుగా గుర్తించి నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది.

ఈ లేబలింగ్‌ విజయవంతం కావాలంటే జాతీయ స్థాయిలో పౌష్టికతపై ఓనమాలు దిద్దించాలి. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. లేదంటే జంక్‌ ఫుడ్‌ తయారీదారులు తమ మార్కెటింగ్‌ బలం, నియంత్రణ సంస్థల చెలిమి సాయంతో చిరుధాన్యాలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా హైజాక్‌ చేసే ప్రమాదం ఉంది. 

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement