
బెర్లిన్: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధనామ్ గెబ్రెయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ ప్రబలుతుంటే... అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపై ఈ సునామీ మరింత ఒత్తిడిని పెంచుతుంద’ని విలేకరుల సమావేశంలో అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్‌తో ముప్పు తక్కువని ప్రాథమిక గణాంకాలు సూచించినా... అదే నిజమని అప్పుడే స్థిర అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు.
మరింత విశ్లేషణ జరిగాకే ఒమిక్రాన్ తీవ్రతపై పూర్తి స్పష్టతకు రావొచ్చన్నారు. అమెరికాలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రధాన వేరియెంట్‌గా మారగా... యూరప్‌లోని కొన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ బాగా ప్రబలుతోంది. ఒమిక్రాన్‌తో ముప్పు ఇప్పటికైతే తీవ్రమేనని డబ్ల్యూహెచ్‌వో తమ వారాపు నివేదికలో పేర్కొంది. డిసెంబరు 20–26 వరకు ప్రపంచవ్యాప్తంగా 49.9 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంటే రోజుకు సగటున 7.12 లక్షల కొత్త కేసులొచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 11 శాతం కేసులు పెరిగాయి. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3.56 లక్షల కేసులు రాగా, ఫ్రాన్స్‌లో ఇదివరకూ ఎప్పుడూ లేనంత ఎక్కువగా.. రికార్డు స్థాయిలో 2.08 లక్షల కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.29 లక్షల కేసులు వచ్చాయి.
చదవండి: (Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment