
జెనీవా: శుక్రవారం ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు, పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. కొత్తగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య గత 24 గంటల్లో 2,84,196గా రికార్డు అయ్యింది. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా అత్యధికంగా 9,753 కోవిడ్ మరణాలు సంభవించడం ఆందోళనకలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా కోవిడ్ సోకిన వారిలో, దాదాపు సగం మంది అమెరికా, బ్రెజిల్‌లకు చెందినవారే.
ప్రధానంగా అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలు ప్రపంచంలో కోవిడ్‌తో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలు. జూలై 25, సాయంత్రం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6,34,325 మరణాలతోసహా, 1,55,38,736 కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కోవిడ్ వ్యాప్తి విజృంభిస్తున్నంత కాలం మనమంతా ప్రమాదపుటంచుల్లో ఉన్నట్టేనని, అందుకే ఎవరైనా బయటకు వెళితే, ఎక్కడికి వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారు? అక్కడ ఎవరిని కలవబోతున్నారు? ఏం చేయబోతున్నారనే విషయాలు ఇప్పుడు ప్రతిఒక్కరికీ జీవన్మరణ సమస్యగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియోసస్ చెప్పారు.