పెరిగిపోతున్న సిజేరియన్లు.. | Cesarean deliveries are growing | Sakshi
Sakshi News home page

పెరిగిపోతున్న సిజేరియన్లు..

Published Sat, Oct 13 2018 2:21 AM | Last Updated on Sat, Oct 13 2018 2:37 AM

Cesarean deliveries are growing - Sakshi

లండన్‌: సిజేరియన్‌తో తల్లీబిడ్డ దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు హెచ్చరించినా.. పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇతర దేశాలతో పాటు, మన దేశంలోనూ ప్రసవాల కోసం సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో 2005–06లో సిజేరియన్ల సంఖ్య 9శాతం ఉండగా, 2015–16లో ఇది 18.5 శాతానికి చేరినట్లు ప్రతిష్టాత్మక మెడికల్‌ జర్నల్‌ లాన్‌సెట్‌ వెల్లడించింది. బెల్జియంలోని ఘెంట్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య 2000–15 మధ్య ఏడాదికి 3.7శాతం చొప్పున పెరిగిందని, 2000లో సిజేరియన్‌ ద్వారా 1.6 కోట్ల మంది శిశువులు జన్మించగా..2015 నాటికి ఈ సంఖ్య 2.97 కోట్లకు పెరిగినట్టు తేలింది.  

కాన్పు కష్టమైనప్పుడే సిజేరియన్‌... 
నొప్పులు మొదలైన తర్వాత సహజంగా కాన్పు జరగడం కష్టమై, తల్లీబిడ్డకు హానిజరిగే సంకేతాలున్నప్పుడు మాత్రమే సిజేరియన్‌ను ఆశ్రయించాలని పరిశోధకులు సూచించారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణికి బ్లీడింగ్‌ అవుతున్నప్పుడు, బీపీ సంబంధిత వ్యాధులున్నప్పుడు మాత్రమే ప్రసవానికి ఆపరేషన్‌ నిర్వహించాలని చెప్పారు. వైద్య పరంగా ఇలాంటి క్లిష్ట సందర్భాలు కేవలం 10 నుంచి 15 శాతం మందికే ఎదురవుతాయని పరిశోధకుడు అగాఖాన్‌ తెలిపారు. కానీ, చాలామంది మహిళలు పురిటినొప్పులు భరించలేక భయంతో సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటున్నారని, ఇది మంచిది కాదని హెచ్చరించారు. చాలా దేశాల్లో అవసరం లేకున్నా సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 15 దేశాల్లో సిజేరియన్‌ చేయించుకుంటున్న వారి సంఖ్య 40 శాతానికి పైగా ఉండటం గమనార్హం. 

169 దేశాలపై అధ్యయనం... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి 169 దేశాల సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దక్షిణాసియాలో 2000 నుంచి ఏడాదికి 6.1శాతం చొప్పున సిజేరియన్ల ఆపరేషన్ల శాతం పెరుగుతూ 2015కు 18.1 శాతానికి చేరింది. ఆఫ్రికాలో మాత్రం సిజేరియన్లను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. బ్రెజిల్, చైనాల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్‌లో చదువుకున్న వాళ్లలో 54.4శాతం మంది సిజేరియన్‌ను ఎంపిక చేసుకుంటుండగా.. చదువుకోని 19.4 శాతం మంది మాత్రమే దీన్ని ఎంపిక చేసుకోవడం గమనార్హం. అమెరికా, బ్రెజిల్, బంగ్లాదేశ్‌ల్లో 25 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

పాలకులు చట్టాలు తేవాలి: తల్లీబిడ్డా ఆరోగ్యం దృష్ట్యా క్లిష్ట సమయాల్లో మాత్రమే సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసేలా వైద్యులు చొరవ తీసుకోవాలని, పాలకులు కూడా దీనిపై దృష్టి సారించి ప్రత్యేక చట్టాలు తేవాలని పరిశోధకు డు సాండల్‌ అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా ఆపరేషన్‌ చేయించుకోవడం దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement