డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి దీనికి అతి పెద్ద ఉదాహరణ అని ప్రశంసించింది. కరోనా బాంబు పేలుతుందనుకున్న ప్రాంతంలో కట్టుదిట్టమైన ప్రణాళికతో కరోనాని కట్టడి చేశారంటూ డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ధారావిలో తీసుకున్న చర్యల్ని కొనియాడారు.
జన సాంద్రత అత్యధికంగా ఉన్న ధారావిలో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా మూడు నెలల్లోనే కరోనాని నియంత్రించింది. శుక్రవారం టెడ్రోస్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సామాజిక సహకారం, జాతీయ ఐక్యత, ప్రపంచ సంఘీభావంతో తీసుకునే చర్యల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేయగలమని అన్నారు.
ఇటీవల చాలా దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఆందోళన పెంచుతున్న సమయంలో ధారావిలో తీసుకున్న చర్యలు వైరస్‌ని నియంత్రించగలమన్న భరోసాని నింపుతున్నాయని ప్రశంసించారు. ‘కరోనాని మనం కట్టడి చేయగలం. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, «ముంబైలో జనసాంద్రత్య అత్యధికంగా ఉన్న ధారావి.. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి’అని టెడ్రోస్ పేర్కొన్నారు.
సమర్థవంతమైన నాయకత్వం, వివిధ వర్గాల భాగస్వామ్యం, సమష్టి బాధ్యతతో వైరస్‌ను నియంత్రించగల మన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్, ట్రీటింగ్ విధానం ద్వారా కరోనా చైన్‌ను బద్దలు కొట్టవచ్చునని టెడ్రోస్ పేర్కొన్నారు. మరోవైపు కజకిస్తాన్‌లో న్యుమోనియా లక్షణాలతో వస్తున్న కేసులు కరోనా వైరస్‌కి చెందినవేనని డబ్ల్యూహెచ్‌ఓ అదికారి డాక్టర్ ర్యాన్ అనుమానం వ్యక్తం చేశారు. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు 50 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment