జెనీవా: ప్రపంచ దేశాల్లో రోజురోజుకీ కోవిడ్ విజృంభిస్తోందని, ఈ వైరస్‌పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రాస్ అద్నామ్ ఘెబ్రెయాసస్ చెప్పారు. ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘కరోనా వైరస్ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. ఈ కేసుల్లో 75శాతం అమెరికా, బ్రెజిల్, దక్షిణాసియా దేశాలకు చెందినవేనని వెల్లడించారు. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పడితే ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తరిస్తోందన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్ హెచ్చరించారు.
నిరసన ప్రదర్శనల్లో జాగ్రత్తలు వహించాలి
ఆఫ్రికా అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రాస్ అన్నారు. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, అయితే ఈ ప్రదర్శనలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ నిరసనకారుడు ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, దగ్గినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం వంటివి చేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment