న్యూఢిల్లీ/జెనీవా: కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ప్రపంచదేశాల డిమాండ్‌కు భారత్ మద్దతిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వహించిన వర్చువల్ సదస్సులో దాదాపు 120 దేశాలు ఒక తీర్మానం చేస్తూ వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాల తీరుతెన్నులను సమీక్షించాలని నిర్ణయించాయి. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్‌ఏ) పేరుతో సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశంలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అదనపు నిధులను ఎలా సమీకరించాలన్న అంశంపైనా చర్చ జరగనుంది.
కరోనా పుట్టుకకు చైనానే కారణమని, జరిగిన నష్టానికి పరిహారం కోరతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ల నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యమేర్పడింది. నిన్నమొన్నటివరకూ విచారణకు ససేమిరా అన్న చైనా.. తాజాగా కాస్త మెత్తబడటంతోపాటు కరోనాపై పోరుకు రెండేళ్లలో రూ.15 వేల కోట్లిస్తాననడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్‌ఏ) సోమవారం 27 యూరోపియన్ దేశాలు చైనా పేరు ప్రస్తావించకుండా వైరస్ పుట్టుకపై విచారణ జరగాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్నిదేశాల ప్రాతినిధ్యంతో శాస్త్రీయమైన విచారణ జరగాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మేలైన పద్ధతులు అందుబాటులోకి వస్తాయని తీర్మానంలో ప్రతిపాదించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌లపై ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని 50 దేశాలు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, ఖతార్, రష్యా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. తీర్మానానికి మద్దతిచ్చిన దేశాల జాబితాలో అమెరికా లేదు. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో పాల్గొన్నారు.
అన్ని వివరాలూ ఇచ్చాం: జిన్‌పింగ్
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చామని, కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించేందుకు దాదాపు రూ.15 వేల కోట్లిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో ప్రకటించారు. విపత్తును ఎదుర్కొనేందుకు రెండేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. కరోనాపై ప్రపంచం స్పందించిన తీరుపై సమగ్ర దర్యాప్తునకూ చైనా మద్దతిస్తుందన్నారు. ఈ విచారణ అనేది శాస్త్రీయపద్ధతిలో జరగాలన్నారు. ఈయూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఝావ్ బీజింగ్‌లో చెప్పారు. భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ పుట్టకతోపాటు ఈ అంశంపై ప్రపంచదేశాల స్పందనపై వీలైనంత తొందరగా స్వతంత్ర విచారణ చేపడతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment