కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు | COVID-19: World can learn from Kerala about how to fight | Sakshi
Sakshi News home page

కరోనా కొమ్ములు వంచింది

Published Tue, Apr 21 2020 3:26 AM | Last Updated on Tue, Apr 21 2020 12:44 PM

COVID-19: World can learn from Kerala about how to fight - Sakshi

తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వంటి వైరస్‌లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్‌ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్‌లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులు ఎక్కువే. అయినా కరోనా కట్టడి చర్యల్లో కేరళలో అధికార లెఫ్ట్‌ ప్రభుత్వం ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటోంది. ఐక్యరాజ్య సమితి కేరళని భళా అంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేరళని చూసి పాఠాలు నేర్చుకోవాలని చెప్పింది. లాన్సెట్‌ జర్నల్‌దీ అదే మాట.

సమన్వయంతో సగం విజయం  
చైనాలోని వూహాన్‌ నుంచి కేరళలోని త్రిసూర్‌కి వచ్చిన వైద్య విద్యార్థినికి జనవరి 18న కరోనా పాజిటివ్‌ వచ్చిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేయడంతో సగం విజయం సాధించినట్టయింఇ. తొలి కేసు నమోదైన వెంటనే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న అయిదు విమానాశ్రయాల్లో అంబులెన్స్‌లు, అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ఆసుపత్రులను సిద్ధం చేసింది.

కరోనా పాజిటివ్‌ ఎవరికైనా సోకితే వెంటనే వాళ్లంతా ఎవరెవరిని కలిశారో గూగుల్‌ మ్యాప్‌ సహకారంతో వెతికి పట్టుకొని మరీ పోలీసులు క్వారంటైన్‌ చేసేవారు. విపత్తుల సమయంలో ప్రజల్ని తరలించడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఈ సంక్షోభ సమయంలో కేరళని ఆదుకున్నాయి. ప్రతీ గ్రామాల్లోనూ వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. దీనివల్ల సమాచారం అందించుకోవడం సులభమైపోయింది. కేరళ ఆరోగ్య మంత్రి శైలజ స్వయంగా కరోనా రోగులతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు.  

కరోనాపై యుద్ధానికి రూ.20 వేల కోట్లు  
నైరుతి రుతుపవనాలు మొట్టమొదట తాకే కేరళలో వ్యాధులు కూడా ఎక్కువే. ఫ్లూ, డెంగ్యూ వంటి జ్వరాలు అక్కడ సర్వసాధారణం. అందుకే కొత్త వైరస్‌ ఏది వచ్చినా ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో నిధులు భారీగా కేటాయిస్తుంది. ఇప్పుడు కరోనా దాడి మొదలవగానే అధికార ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ.20వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పీపీఈ కిట్స్, మందులు పెద్ద మొత్తంలో తెప్పించింది. మాస్క్‌లు, శానిటైజర్లు భారీగా తయారు చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. కేరళ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కావడం.. విద్యాధికులే ఎక్కువ ఉండడంతో కరోనా ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకొని ప్రజలంతా క్రమశిక్షణతో భౌతిక దూరం పాటించారు. అందరినీ మానసికంగా సిద్ధం చేశాక కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మార్చి 11న ముఖ్యమంత్రి పి. విజయన్‌ లాక్‌డౌన్‌ ప్రకటించారు. గత రెండు వారాలుగా కేరళలో రోజుకి ఒకటీ రెండు కేసులు కంటే ఎక్కువ నమోదు కాకపోవడం ఆ రాష్ట్రం సాధించిన ఘన విజయంగా చెప్పుకోవాలి.  
ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ  
కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది. ఉపాధి పనులు కోల్పోయిన వారికి బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇంటింటికీ వెళ్లి పంచేపనిలో ఉంది.

28 రోజుల క్వారంటైన్‌
కరోనా అనుమానితుల్ని అన్ని రాష్ట్రాల్లోనూ 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచితే కేరళ ముందుజాగ్రత్తగా 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచింది. అదే సరైన చర్యని ఇప్పుడు రుజువు అవుతోంది. 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు బయటకు వచ్చే కేసులు ఉన్నాయి.  }

కేరళలో అధికార వికేంద్రీకరణ ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామాల స్థాయిలో స్థానిక మండళ్లు, సమర్థంగా పనిచేసే మున్సిపాల్టీలు, వరదలు వంటి విపత్తుల్ని ఎదుర్కొనే యంత్రాంగం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.    – జాకబ్‌ జాన్, ఆర్థికవేత్త  

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేరళ ఆరోగ్యం, విద్యా రంగం మీద అత్యధికంగా ఖర్చు చేసింది. అందరికీ ఆరోగ్యం కోసం మూడు అంచెల విధానం అమల్లో ఉంది. ఆ వ్యవస్థ కరోనాపై అపారమైన పోరాట పటిమ ప్రదర్శిస్తోంది.        
– బి. ఇక్బాల్, ప్రభుత్వ సలహాదారు, వైరస్‌ల నియంత్రణ మండలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement