జెనీవా: విషయంలో వరుసగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ దారుణ సంక్షోభ పరిస్థితి నెలకొన్నదని కోవిడ్ 19పై అధ్యయనం చేసిన ఒక స్వతంత్ర కమిటీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో పాటు దాదాపు 33 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి ఈ తప్పుడు నిర్ణయాలే కారణమని ‘ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండెమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ (ఐపీపీపీఆర్)’ అభిప్రాయపడింది. సరైన సమయంలో స్పందించి తగు నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ ఉత్పాతాన్ని అడ్డుకోగలిగి ఉండేవారమని పేర్కొంది. వైరస్ విజృంభణకు సంబంధించి నిపుణుల హెచ్చరికలను పట్టించుకోలేదని విమర్శించింది.
ప్రజా రక్షణలో వ్యవస్థలు విఫలమయ్యాయని, సైన్స్‌ను విశ్వసించని నాయకుల వల్ల ఆరోగ్య వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. చైనాలో ఈ వైరస్‌ను గుర్తించిన వెంటనే ప్రపంచదేశాలు స్పందించకుండా, విలువైన కాలాన్ని వృథా చేశాయని విమర్శించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత సంపన్న దేశాలు.. అత్యంత పేద దేశాలకు ముందుగా కనీసం వంద కోట్ల టీకా డోసులు విరాళంగా అందించాలని సూచించింది. అలాగే, ఇలాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న సంస్థలకు సాయం అందించాలని సంపన్న దేశాలకు విజ్ఞప్తి చేసింది.
సమర్థ హెచ్చరిక వ్యవస్థ అవసరం
కరోనా మహమ్మారిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గత సంవత్సరం మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు అభ్యర్థించడంతో ‘ఐపీపీపీఆర్’ ఈ నివేదికను రూపొందించింది. ఈ కమిటీకి న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ ప్రెసిడెంట్ ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ సంయుక్తంగా నేతృత్వం వహించారు. ఎలెన్ జాన్సన్‌కు 2011లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ‘కోవిడ్ 19– మేక్ ఇట్ ద లాస్ట్ ప్యాండెమిక్’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ఇలాంటి మరో మహమ్మారి రాకుండా ఉండాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ ఉండాలని ఈ కమిటీ సూచించింది.
‘వరుస వైఫల్యాలతో పాటు సంసిద్ధతలో, స్పందించడంలో అనవసర జాప్యాల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. సరిగ్గా స్పందించి ఉంటే ఈ పరిస్థితిని అడ్డుకుని ఉండేవాళ్లం’ అని ఎలెన్ జాన్సన్ పేర్కొన్నారు. ‘వ్యూహాత్మకంగా అసమర్థ నిర్ణయాలు, సమన్వయంలో లోపాలు, ఉదాసీనత, సత్వరమే స్పందించకపోవడం.. ఇవన్నీ కలిసి ఈ దారుణమైన సంక్షోభానికి కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. ఈ మహమ్మారిపై ప్రపంచ దేశాలన్నీ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించాయని విమర్శించింది. ఈ సంక్షోభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం కూడా ఉందని పేర్కొంది. గత సంవత్సరం జనవరి 22వ తేదీననే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే బావుండేదని నివేదికలో పేర్కొంది. ఆ తరువాత, మరింత ఆలస్యంగా మార్చి నెలలో దీనిని మహమ్మారి(ప్యాండెమిక్)గా నిర్ధారించారని పేర్కొంది.
కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంలో చైనా ఆలస్యం చేసిందని, ఆ తరువాత తక్షణమే స్పందించడంలో ఇతర దేశాలు విఫలమయ్యాయని వివరించింది. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంపన్న దేశాలు కోవాక్స్ కార్యక్రమం కింద పేద దేశాలకు సెప్టెంబర్ 1లోపు వంద కోట్ల టీకా డోసులు, 2022 జూన్‌లోపు మరో వంద కోట్ల డోసులు అందించాలని సూచించింది. వ్యాక్సిన్ కోసం అవసరమైన 19 బిలియన్ డాలర్లలో 60 శాతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జీ 7 దేశాలు చెల్లించాలని సూచించింది. మిగిలిన జీ 20 దేశాలు మిగతా 40% భరించాలని కోరింది. టీకాలకు సంబంధించి లైసెన్సింగ్, టెక్నాలజీ బదిలీపై ప్రపంచదేశాలు ఒక అంగీకారానికి రావాలని పేర్కొంది. భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాధినేతలు సభ్యులుగా గ్లోబల్ హెల్త్ థ్రెట్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయాలని సూచించింది.
డబ్ల్యూహెచ్‌వోకు మరిన్ని అధికారాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు మరిన్ని అధికారాలు ఉండాలని నివేదిక పేర్కొంది. ప్రపంచదేశాల్లో ఇలాంటి వ్యాధుల గురించి అధ్యయనం జరిపేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేని హక్కు డబ్ల్యూహెచ్‌ఓకు ఉండాలంది. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌గా ఎన్నికయ్యే వ్యక్తికి ఏడేళ్ల కాలపరిమితిలో ఒకేసారి అవకాశం కల్పించాలంది. మరోవైపు, ఈ నివేదికను పలువురు నిపుణులు విమర్శించారు. ఈ సంక్షోభానికి చైనా, డబ్ల్యూహెచ్‌వోలదే బాధ్యత అని నివేదిక స్పష్టం చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment