విదేశీ టీకాలకు నో ట్రయల్స్‌! | Foreign COVID-19 vaccines exempted from local trials, batch testing | Sakshi
Sakshi News home page

విదేశీ టీకాలకు నో ట్రయల్స్‌!

Published Thu, Jun 3 2021 6:15 AM | Last Updated on Thu, Jun 3 2021 6:15 AM

Foreign COVID-19 vaccines exempted from local trials, batch testing - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై అత్యధిక సామర్థ్యంతో పని చేస్తున్న ఫైజర్, మోడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌కు రావడానికి గల అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా  తొలగిపోతున్నాయి. భారత్‌లో అందరికీ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే విదేశాల్లోని వివిధ కంపెనీలకు చెందిన టీకాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన టీకాలు, అమెరికా, యూరోపినయన్‌ యూనియన్, యూకే, జపాన్‌లలో లక్షలాది మందిలో విజయవంతంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్న కోవిడ్‌–19 టీకాలను తిరిగి భారత్‌లో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌  జనరల్‌ ఆప్‌ ఇండియా (డీసీజీఐ) వెల్లడించింది. అయితే భారత్‌ దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లకు ఆయా దేశాల నేషనల్‌ కంట్రోల్‌ లేబొరేటరీల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలని డీజీసీఐ చీఫ్‌ వి.జి. సోమాని పేర్కొన్నారు.  

నష్టపరిహారంలోనూ సానుకూలంగా కేంద్రం
మరోవైపు టీకాల వినియోగం తర్వాత నష్టపరిహారానికి సంబంధించిన కేసులన్నీ భారత ప్రభుత్వమే చూసుకోవాలని ఫైజర్, మోడెర్నా కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి  దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో టీకాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఆ టీకాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఏమైనా ఉంటే తాము బాధ్యత వహించలేమని, న్యాయపరమైన అంశాలపై కూడా భారత్‌ ప్రభుత్వమే చూసుకోవాలని టీకా అభివృద్ధి కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 25కి పైగా దేశాలు ఇలాంటి షరతులకు అంగీకరించే టీకాలను దిగుమతి చేసుకున్నాయి. భారత్‌కు కూడా దీనికి అంగీకరిస్తే ఫైజర్, మోడెర్నా సహా విదేశీ టీకాలెన్నో భారత్‌కు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్‌ ఈ ఏడాది డిసెంబరు నాటికి 5 కోట్ల డోసులను అందిస్తామని చెబుతోంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి మాత్రమే తాము భారత్‌కు టీకాలు ఇవ్వగలమని మోడెర్నా స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement