చైనాను వణికిస్తున్న ‘కరోనా’ | Corona Virus Killed Six People In China | Sakshi
Sakshi News home page

చైనాను వణికిస్తున్న ‘కరోనా’

Published Wed, Jan 22 2020 1:40 AM | Last Updated on Wed, Jan 22 2020 6:55 AM

Corona Virus Killed Six People In China - Sakshi

వూహాన్‌: పొరుగుదేశం చైనాలో కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. నిన్నమొన్నటివరకూ వూహాన్‌ ప్రాంతానికి మాత్రమే పరిమితమైందనుకున్న సూక్ష్మజీవి కాస్తా ఇప్పుడు ఖండాలు దాటి తైవాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలకూ పాకినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంగళవారం నాటికి చైనాలో ఈ వైరస్‌ బారిన పడ్డవారు సుమారు ఆరుగురు మరణించగా మరో 300 మంది వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. చైనా కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువై ఈ కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందన్న అంచనాలతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. మరోవైపు ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రభుత్వ నిపుణుడు ఝాంగ్‌ నాన్‌షాన్‌ సోమవారం ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.  

గత నెల చివరిలో తొలిసారి ఈ కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలిసింది. మధ్య చైనాలోని వూహాన్‌ ప్రాంతంలో తొలి కేసు నమోదు కాగా తరువాతి కాలంలో బీజింగ్, షాంఘై, గువాంగ్‌డాంగ్‌ ప్రాంతాల్లోనూ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మంగళవారం 80 వరకూ కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ సుమారు 300 మంది వైరస్‌ బారిన పడినట్లు అయింది. మరో 900 మంది వైద్యుల పరిశీలనలో ఉండటం గమనార్హం.  

వేగం దాని లక్షణం... 
మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. లూనార్‌ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తారని, ఫలితంగా ఈ వ్యాధి మరింత ఎక్కువ మందికి సోకే అవకాశముందని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2002–2003లో సార్స్‌ వైరస్‌ విస్తృతిని గుర్తించేందుకు సాయపడిన ఝాంగ్‌.. ప్రభుత్వ టెలివిజన్‌ సీసీటీవీలో మాట్లాడుతూ గువాంగ్‌ డాంగ్‌ ప్రాంతంలో ఇద్దరికి కుటుంబ సభ్యుల నుంచే వైరస్‌ సోకిందని స్పష్టం చేయగా, 15 మంది వైద్యాధికారులూ వైరస్‌ బారిన పడినట్లు వూహాన్‌ మున్సిపల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. ఇదిలా ఉండగా.. వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని, ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని అందుకోవాలని అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఆదేశించారు.

ఏమిటీ కరోనా వైరస్‌... 
జలుబు నుంచి తీవ్రస్థాయి శ్వాసకోశ వ్యాధులకు కారణమైన వైరస్‌ల కుటుంబానికి చెందింది. ఎంఈఆర్‌ఎస్, సార్స్‌ వంటి వాటిని ఇప్పటికే గుర్తించగా.. ఏడవ రకం వైరస్‌ అయిన కరోనా వైరస్‌ను వూహాన్‌లో తొలిసారి గుర్తించారు. 

చైనా, హాంకాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్కానర్‌ 

వ్యాప్తి ఇలా..
ఈ వైరస్‌ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు. 
–గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్‌ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.  
–వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని భావిస్తున్నారు.

ప్రపంచ దేశాలు అప్రమత్తం..
వూహాన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఆసియాదేశాలు ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు  చర్యలు ప్రారంభించాయి. 2002 –2003లో చైనా నుంచే సార్స్‌ వైరస్‌ వ్యాపించిన నేపథ్యంలో ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై పరీక్షలు జరపడం మొదలుపెట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్‌ ఉధృతిని గుర్తించడంతోపాటు, నియంత్రణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరినీ థర్మోస్‌ స్కాన్లు తీసేందుకు థాయ్‌లాండ్‌ సిద్ధమవుతోంది.

అగ్రరాజ్యం అమెరికాలోని మూడు విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్‌ ప్రక్రియ మొదలైంది. జపాన్‌ కూడా అప్రమత్తమయింది. అంతేకాకుండా, హాంకాంగ్‌లోనూ విమాన ప్రయాణీకుల స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు వైరస్‌ ప్రభావం పర్యాటక రంగంపై పడుతుందన్న అంచనాలతో ఆసియా స్టాక్‌ మార్కెట్లలో షేర్లు పతనమయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement