జెనీవా : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిధులు నిలిపివేయడంపై అమెరికా పున: పరిశీలన చేస్తోందని ఆశిస్తున్నట్టు ఆ సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. తనను రాజీనామా చేయాలని కొందరు అమెరికా చట్ట సభ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని.. కానీ తాను మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడటానికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గతవారం యూఎస్ ప్రతినిధులు సభలో కొందరు రిపబ్లికన్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు స్వచ్ఛందంగా నిధులు ఇవ్వాలని అనుకుంటే టెడ్రోస్ రాజీనామా చేయాలనే షరుతు విధించాలని ట్రంప్‌కు సూచించారు. దీనిపై టెడ్రోస్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని దేవుడు అందించిన గొప్ప పనిగా భావించి రాత్రి, పగలు ప్రజల ప్రాణాలను కాపాడటానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా నియంత్రణపై ఉందని పేర్కొన్నారు.
మరోవైపు డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా నిధులు నిలిపివేయడంపై ఆ సంస్థ అత్యవసర విభాగం చీఫ్ మైక్ ర్యాన్ స్పందించారు. ఈ నిర్ణయం సంస్థ ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. అవసరమై న వైద్య సేవలు, పిల్లల్లో రోగనిరోధకత, పోలియో నిర్మూలన సేవలకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. కాగా, కరోనా మహమ్మారి తీవ్రతను దాచిపెట్టడంతో పాటుగా, నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌ఓ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ట్రంప్ ఆ సంస్థకు నిధులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసింది. దాదాపు 60 నుంచి 90 రోజుల పాటు డబ్ల్యూహెచ్‌వో నిధులను నిలిపివేసే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల విషయంలో అతిపెద్ద దాతగా ఉన్న అమెరికా.. ప్రతి ఏడాది కొన్ని కోట్ల డాటర్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment