World Health Organization Concern Heart Disease With Bad Fat - Sakshi
Sakshi News home page

చెడు కొవ్వుతో చేటు.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం అవే..

Published Sat, Jan 28 2023 2:19 AM | Last Updated on Sat, Jan 28 2023 8:31 AM

World Health Organization Concern Heart Disease With Bad Fat - Sakshi

చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ (టీఎఫ్‌ఏ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాలేనని స్పష్టం చేసింది.

2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహారం వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. భారత్‌లో 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది టీఎఫ్‌ఏ అధిక వాడకం వల్ల చనిపోయారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో టీఎఫ్‌ఏ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80 శాతం భారత్‌లోనే సంభవించాయి.

యూరప్‌లో 1.25 లక్షల మంది టీఎఫ్‌ఏ అధిక వినియోగం వల్ల చనిపోయారు. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్‌ జనాభాలో 12 శాతం మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో టీఎఫ్‌ఏ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్ట్‌ మొదటి స్థానంలో ఉండగా, భారత్‌ 11వ స్థానంలో ఉంది.  
సాక్షి, హైదరాబాద్‌ 

 ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ అంటే
ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ (టీఎఫ్‌ఏ) అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమన్నమాట. గ్రాము ట్రాన్స్‌ ఫ్యాట్‌లో 9 కేలరీలుంటాయి. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి.

వంటనూనెలు, వేపుళ్లు, ప్యాక్‌ చేసిన లేదా శుద్ధి చేసిన ఆహారాల్లో టీఎఫ్‌ఏ ఉంటుంది. కేకులు, కుకీలు, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటిల్లోనూ ఉంటుంది.  బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం, రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరానికి ట్రాన్స్‌ ఫ్యాట్‌ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే. ప్రతి వంద గ్రాముల ఫ్యాట్‌లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5 శాతానికి మించి ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండకూడదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

ఈ ఏడాది చివరకు టీఎఫ్‌ఏను పూర్తిగా నియంత్రించాలి 
ప్రపంచలో 60 దేశాలు టీఎఫ్‌ఏ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. గతేడాది జనవ­రిలో భారతదేశం టీఎఫ్‌ఏ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది. అన్ని దేశాల్లో­నూ ఈ ఏడాది చివరికల్లా టీఎఫ్‌­ఏను నియంత్రించాలని డబ్ల్యూహె­చ్‌ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధి­చేసిన వంట నూనెలను నిషేధించాలి. పూర్తి­గా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో టీఎఫ్‌ఏ ఎంత శాతం ఉందో ప్యాకెట్లపై ముద్రించాలి. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది టీఎఫ్‌ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 


2019 లెక్కల ప్రకారం గుండెపోటు మరణాల్లో టీఎఫ్‌ఏ అధిక వాడకం వల్ల ఏఏ దేశాల్లో ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే..

నివేదికలోని ముఖ్యాంశాలు..
►మెక్సికోలో కంపెనీలు టీఎఫ్‌ఏ నియంత్రణ సరిగా చేయకపోతే 40 వేల డాలర్లు జరిమానాగా నిర్ణయించారు.

►ఉజ్బెకిస్తాన్‌లో పామాయిల్‌ వినియోగం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో ఆ దేశంలో ఏడాదికి 5 వేల టన్నులు విని­యోగం ఉంటే, 2019 నాటికి అది పది­రెట్లకు అంటే 50 వేల టన్నులకు చేరింది.  

►ప్రపంచంలోని 500 కోట్ల మంది జనాభా టీఎఫ్‌ఏ నియంత్రణ అమలు చేయని దేశాల్లో ఉన్నారు. తద్వారా వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. 

►మన దేశంలో 2013లో టీఎఫ్‌ఏపై పాక్షిక నియంత్రణ మొదలైంది. 2020 డిసెంబర్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) టీఎఫ్‌ఏను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయి నియంత్రణ చేపట్టింది.

►ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2020 డిసెంబర్‌ నుంచి లేబొరేటరీల్లో టెస్టులు మొదలుపెట్టింది. ఇది ఆయిల్‌ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. 

►అంతర్జాతీయంగా లేబొరేటరీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై డబ్ల్యూహెచ్‌ఓ 2021లో ఒక అధ్యయనం చేసింది. మన దేశం సహా కెనడా, బ్రెజిల్, టర్కీ, పాకిస్తాన్, పోర్చుగల్, నైజీరియా, శ్రీలంక, చైనా, ఫిజీ, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే లేబొరేటరీలను పరిశీలించింది. ప్రతి లేబొరేటరీలో ఒకే విధమైన ఆహార­పదా­ర్థా­లను పరీక్షించినా, వాటి ఫలితాలు మాత్రం ఒకేవిధంగా లేవని గుర్తించింది. దీంతో ఆహార పదార్థాలను పరిశీలించే లేబొరే­టరీలపై అనుమానాలు నెలకొన్నాయి. 

నూనె తగ్గించాలి..పండ్లు, కూరగాయలు తినాలి 
వంటనూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉపయోగపడతాయి. అందుకే వాటిల్లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. కాబట్టి సగటున మనిషి ఏ రూపంలోనైనా సరే రోజుకు 30 గ్రాములకు మించి వంటనూనెలను వాడకూడదు. ఆవిధంగా టీఎఫ్‌ఏ వినియోగం తగ్గించాలి. జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కూడా తగ్గించాలి.

సహజ సిద్ధమైన తాజా ఆహారం తీసుకుంటే కూడా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. రోజూ 400 గ్రాములకు తగ్గకుండా కూరగాయలు, పండ్లు తినాలి. నూనె వేపుడులకు దూరంగా ఉండాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలు వాడకూడదు. లేనిపక్షంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. 
– డాక్టర్‌ గుత్తా సురేష్, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement