China Scientists
-
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
చందమామపై నీటి జాడలు!
బీజింగ్: చందమామపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా? అంటే నిజమేనని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరీక్షించగా, జలం జాడ కనిపించిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) వెల్లడించింది. చైనా 2020లో ప్రయోగించిన చాంగే–5 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చింది. దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి చేర్చింది. వీటిపై చైనా సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నమూనాల్లో భారీ స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. 2009లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్–1 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. -
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయవా?
గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్కు లేకుండా ఇల్లు కదలాలంటే భయం, భయం శరీరాన్ని, మెదడుని ఆక్రమించిన కలుషిత గాలి ఇప్పుడు వ్యాధుల నుంచి బయటపడేసే సంజీవిని లాంటి యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపిస్తోంది. వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్స్ పని చేయడం లేదని, ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఢిల్లీకి చెందిన సమత వయసు 40 సంవత్సరాలు. ఒకరోజు హఠాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆస్తమా అటాక్ అయింది. ఇంట్లో ఎవరికీ లేని ఆస్తమా ఎందుకొచ్చిందా అని ఆందోళనతో ఉంటే మందులు పని చెయ్యకపోవడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు. చివరికి ఆస్పత్రిలో చేరితే వైద్యులు అతి కష్టమ్మీద ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. దీనికంతటికీ కారణం వాయు కాలుష్యం. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం గాల్లో కలిసిపోయి మనుషుల ఊపిరితిత్తులు, గుండె, మెదడుకి పాకుతోంది. వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, కేన్సర్, చివరికి ఆయుఃప్రమాణాలు క్షీణిస్తాయనే మనకి తెలుసు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనిలా ఉపయోగపడే యాంటీబయోటిక్స్ పని చేయకుండా వాయుకాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్‌లో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలున్నాయి. కలుషిత గాలితో వచ్చే అనర్థాల్లో తాజాగా యాంటీబయోటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం అతి పెద్ద పెనుముప్పుగా మారనుందని హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎని్వరాన్‌మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. ► గాల్లోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10శాతం పెరిగితే యాంటీబయోటిక్‌ను నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోంది ► ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు పీఎం 2.5 దు్రష్పభావాలను ఎదుర్కొంటున్నారు. ► గాల్లో పీఎం 2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం దుర్లభంగా మారింది. ► యాంటీబయోటిక్స్ పనిచెయ్యకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితి మీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యమూ మనుషుల శరీరంలో యాంటీబయోటిక్ నిరోధక బ్యాక్టీరియాను పెంచుతోంది. ► ఆస్పత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు వంటి వాటి నుంచి యాంటీబయోటిక్‌లు పని చెయ్యకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రాణం పోసే యాంటీబయోటిక్ ప్రాణమెలా తీస్తుంది? యాంటీబయోటిక్స్‌ని మితి మీరి వాడకం వల్ల శరీరంలో సహజసిద్ధమైన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పని చేయకుండా పోతున్నాయి. యాంటీబయోటిక్స్ పని చెయ్యకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి లక్ష మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో అత్యధికమరణాలు సంభవించే ముప్పు ఉంది. -
నియోకోవ్ వైరస్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు!
దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో నియో కోవ్ ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. (చదవండి: New Virus NeoCov: మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి ) ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్‌తో అల్లాడిపోతున్నప్రజలకు నియోకోవ్ మరింత తలనొప్పిగా మారునుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకుంటే ఈ వైరస్ వల్ల భవిష్యత్తులో మనుషులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్లోని వేరియంట్లు సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎస్ఏఆర్ఎస్) వరకు వ్యాధులకు కారణమయ్యే వైరస్‌కు సంబంధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన నియో కోవ్ వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతోపాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని వూహాన్ ల్యాబ్ సైంటిస్టులు హెచ్చరించారు. -
జంతువుల నుంచే కరోనా!
బీజింగ్: కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చిందన్న వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), చైనా పరిశోధకుల ఉమ్మడి బృందం కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి లీకేజీకి అవకాశం లేదంది. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు మరో జంతువు ద్వారా సోకి ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. కోవిడ్ తొలిసారిగా బయటపడిన చైనా నగరం వూహాన్‌ను జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈ పరిశోధకుల బృందం సందర్శించి తయారుచేసిన ముసాయిదా నివేదిక మంగళవారం విడుదల కానుండగా ఆ ప్రతి ముందుగానే తమకు లభ్యమైందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. వైరస్ మొట్టమొదటగా ఎక్కడి నుంచి వచ్చిందనే కీలక విషయంతోపాటు పలు ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలను చూపలేకపోయింది. మున్ముందు సంభవించే ఇలాంటి మహమ్మారులను నివారించేందుకు ఈ నివేదికలోని వివరాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. వైరస్ మొదటగా ఎలా వ్యాపించిందన్న విషయంలో డబ్ల్యూహెచ్‌వో– చైనా నిపుణులు తయారు చేసిన ఈ ముసాయిదా నాలుగు అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషులకు సోకింది. ఇలా జరగటానికి చాలా అవకాశాలున్నాయి. ఒక వేళ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన పక్షంలో ‘కోల్డ్–చైన్’ఆహారోత్పత్తుల ద్వారా వ్యాపించడం సాధ్యం. కానీ ఇలా జరిగేందుకు అవకాశాలు లేవు. గబ్బిలాలను ఆశ్రయించి ఉండే కరోనా వైరస్లు, కోవిడ్‌కు కారణమైన సార్స్–కోవ్–2కు దగ్గరి సంబంధం ఉంది. అయితే, వీటి మధ్య అంతరం ఉంది. పంగోలిన్లలో ఉండే వైరస్‌కు, కరోనా వైరస్‌తో అత్యంత దగ్గర సంబంధం ఉంది. మింక్‌లు, పిల్లుల్లో వైరస్లు కోవిడ్ వైరస్ రకానికి అత్యంత సమీపంగా ఉంటాయి. ఇవి కూడా ఈ వైరస్ వాహకాలే’అని పేర్కొంది. చైనాలోని హువానన్ మార్కెట్లో మొదటిసారిగా వైరస్ కేసులు బయటపడటంపై ఈ నివేదిక ప్రస్తావిస్తూ..ఇతర ప్రాంతాల్లో మొదలై అక్కడికి వ్యాపించి ఉంటుందని వివరించింది. ఈ మార్కెట్లో భారీ సంఖ్యలో ఎలుకలు, దుప్పులు, మొసళ్లు వంటి రకరకాల జీవుల విక్రయాలు జరిగిన విషయం ప్రస్తావిస్తూ...వీటి ద్వారానే వూహాన్‌కు కొత్త వైరస్ వచ్చి ఉంటుందని అంచనా వేసింది. డిసెంబర్ 2019లో వూహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ నుంచే మొదటిసారిగా కోవిడ్ మొదలయిందా అనే విషయమై ఈ నివేదిక ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చైనా నగరం వూహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రబలేందుకు కారణమైందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తదితరులు∙విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకేజీకి అవకాశాలున్నాయన్న వాదనలను బలపరిచారు. ఈ నివేదిక విడుదల పలుమార్లు వాయిదా పడటంతో చైనా అందులో తన అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఈ నివేదిక తయారీపై మాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ నివేదిక రూపకల్పనలో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉంది’అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌వో బృందానికి బంధనాలు? వైరస్ మూలాలను కనుగొనేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్‌వో బృందానికి చైనా ప్రభుత్వం పలు పరిమితులు విధించింది. విచారణకు కీలకమైన పత్రాలేవీ వారికి అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపణలున్నాయి. వూహాన్‌లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో పలువురు చైనా శాస్త్రవేత్తలను ఈ బృందం కలుసుకుంది. ఇక్కడ నాలుగు గంటలపాటు గడిపింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావించే వూహాన్ మార్కెట్లో నాలుగు గంటలపాటు గడిపింది. కానీ, చాలా రోజులపాటు ఏ పనీ లేకుండా తమకు కేటాయించిన హోటల్లోనే కాలక్షేపం చేసినట్లు బృందం సభ్యులు తెలిపారు. -
కరోనాపై చైనా మరో కథ
జెనీవా: చైనా నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కరోనా వైరస్ తొలుత భారత్‌లో బయటపడిందంటూ కాకమ్మ కథలు మొదలు పెట్టింది. కరోనా వైరస్ మొదటిసారిగా ఎక్కడ ఎలా బయటపడిందనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో చైనా భారత్‌ను లక్ష్యంగా చేసుకొని నిందలు మోపుతోంది. 2019 వేసవిలో భారత్‌లో కరోనా వైరస్ పుట్టిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుల బృందం పేర్కొంది. జంతువుల నుంచి మనుషులకి కలుషిత నీటి ద్వారా సోకిన ఈ వైరస్ వూహాన్‌కి చేరుకుందని వారు కొత్త కథ వినిపిస్తున్నారు. వూహాన్లో తొలి కేసు బయటపడినంత మాత్రాన వైరస్ పుట్టుక అక్కడే జరిగిందని చెప్పలేమంటున్నారు. జన్యు మార్పుల ద్వారా పుట్టుక తెలుసుకోవచ్చు: చైనా కొత్త వాదన కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమం, దాని డీఎన్ఏని విశ్లేషించి అది ఎక్కడ ఆవిర్భవించిందో వాదిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక నివేదికని డబ్ల్యూహెచ్ఓకి సమర్పించారు.ప్రధానంగా భారత్, బంగ్లాదేశ్‌లో వైరస్ తక్కువగా మ్యుటేషన్ చెందుతోందని ఆ రెండూ ఇరుగు పొరుగు దేశాలు కావడంతో అక్కడ్నుంచే వైరస్ వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు వాదించారు. అయితే చైనా శాస్త్రవేత్తల వాదనల్లో వాస్తవం లేదని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన నిపుణుడు డేవిడ్ రాబర్ట్సన్ అన్నారు. -
రక్త పరీక్షతో కేన్సర్ గుట్టు రట్టు!
కేన్సర్.. దీనిని కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించేందుకు తామొక టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు చైనీస్ శాస్త్రవేత్తలు. కొన్నేళ్ల క్రితం లిక్విడ్ బయాప్సీ పేరుతో ఓ కొత్త కేన్సర్ గుర్తింపు పరీక్ష అందుబాటులోకి వచ్చింది. రక్త పరీక్షల్లోనే కేన్సర్ కణితులు లేదా కణాలు వది లేసిన కొన్ని అవశేషాలను గుర్తించి వాటి ఆధారంగా వ్యాధి సోకిందని నిర్ధారించుకోవడం ఈ లిక్విడ్ బయాప్సీలో ప్రధానాంశం. వ్యాధి లక్షణాలు కనిపించే ముందుగానే గుర్తించడం వీటి ద్వారా కూడా సాధ్యమే కానీ ఫలితాలపై భరో సా తక్కువ. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు ‘పాన్‌సీర్’ పేరుతో సరికొత్త లిక్విడ్ బయాప్సీ పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ద్వారా కనీసం ఐదు రకాల కేన్సర్లను లక్షణాలు కనిపించేందు కు కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించవచ్చునని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. ఇది కేన్సర్‌ను ముందుగానే గుర్తించే పరీక్ష కానేకాదని, వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడేందుకు ఇంకా సమయం ఉండగానే తెలుసుకోవడం దీంట్లోని ముఖ్యాంశమని శాస్త్రవేత్తలు తెలిపారు. మిథైల్ గ్రూపుల ఆధారంగా.. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రక్త పరీక్ష డీఎన్ఏ పోగుల్లోని ప్రత్యేక ప్రాంతాలను పరి శీలించడం ద్వారా జరుగుతుంది. కేన్సర్ కణితుల డీఎన్ఏలో తరచూ కనిపించే మిథైల్ గ్రూపులను ఈ రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అత్యంత సూక్ష్మస్థాయి డీఎన్ఏ మిథైల్ గ్రూపులను కూడా గుర్తించేందుకు తాము సరికొత్త పద్ధతులను ఉపయోగించామని శాస్త్రవేత్తలు తెలిపారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల ద్వారా రక్తంలో కనిపించే మిథైల్ గ్రూపులతో కూడిన డీఎన్ఏ కేన్సర్ కణితి నుంచి వెలువడిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని వారు చెప్పారు. ఈ పరీక్షను అభివృద్ధి చేసేందుకు తాము 2007–2014 మధ్యకాలంలో చైనాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 414 మంది రక్తపు ప్లాస్మాను సేకరించామని చెప్పారు. రక్తం సేకరించే సమయానికి ఐదేళ్ల ముందు నుంచి వీరు కేన్సర్ బారిన పడని వారు. ఆ తరువాత నాలుగేళ్లలో 191 మంది ఉదర, కోలోరెక్టల్, కాలేయ, ఊపిరితిత్తుల, శ్వాసకోశ సంబంధిత కేన్సర్ల బారినపడ్డారు. ఈ 5 రకాల కేన్సర్లబారిన పడ్డ మరో 223 మంది రోగుల ప్లాస్మాలను కూడా సేకరించారు. మెషీన్ లెర్నింగ్ ద్వారా ఈ వివరాలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కు అందించారు. ఈ దశ తరువాత పరీక్షలు జరపగా పాన్‌సీర్ పరీక్ష కేన్సర్ ఉన్న వారిని 88% వరకు గుర్తించింది. రక్తం సేకరించేటప్పుడు లేకున్నా తరువాతి కాలంలో వ్యాధి బారినపడ్డ 95% మందిని కూడా ఈ పరీక్ష విజయవంతంగా గుర్తించింది. మరింత విస్తృత స్థాయిలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సమాచారం సేకరించి సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరిస్తే వ్యాధి నిర్ధారణలో మరింత కచ్చితత్వం వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?
సింగపూర్ సిటీ: నిఫా, ఎబోలా వైరస్ల తరహాలో కరోనా వైరస్ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇతర వైరస్ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సార్స్ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు. -
ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?
జరిగిన కథ: చైనా శాస్త్రవేత్తలు కోతికి మనిషి మెదడును సెట్ చేయడంతో ‘కోతిలోకం’లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కొద్దికాలంలోనే కోతికి మనిషి బుద్ధులు వచ్చాయి. తలకొన అడవిలో రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార కోతి గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్‌లూ ఆయుధాలు తీశాయి. కాని అవి నకిలీ ఆయుధాలు కావడంతో ఇరువర్గాల్లో ఒక్క కోతి కూడా గాయపడలేదు. తరువాయి భాగం:‘‘ఇలా అయితే లాభం లేదు. బాహాబాహీకి దిగి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం’’ బస్తీమే సవాల్ అని అరుస్తూ బాహాబాహీకి దిగాయి రియల్ ఎస్టేట్ కోతి గ్యాంగులు.సరిగ్గా పది నిమిషాల తరువాత...‘‘ఆగండి’’ అనే అరుపు వినబడింది. రెండు గ్యాంగులూ కొట్లాట ఆపి ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాయి.‘‘ఎవరు మీరు? శాంతిదూతా?’’ అడిగింది గ్యాంగ్‌లో ఒక కోతి.‘‘కాదు. ఎల్ఐసీ ఏజెంట్‌ని. నా పేరు పొదుపేష్ కుమార్. ఏటూరునాగారం అడవి నుంచి వస్తున్నాను’’ అన్నది కొత్తగా వచ్చిన ఆ కోతి.‘‘మాతో నీకేం పని?’’ అడిగింది గ్యాంగ్‌లో కోతి.‘‘బాహాబాహీ రక్ష అని కొత్త పాలసీ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ టాక్ ఎబౌట్..’’ అన్నది ఎల్ఐసీ కోతి.‘చెప్పి చావు’ అన్నట్లుగా చూశాయి రెండుగ్యాంగుల కోతులు.ఎల్ఐసీ కోతి చెప్పటం మొదలు పెట్టింది:‘‘బాహబాహీ రక్షలో... డెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొట్లాటలో మీ పళ్లు విరిగాయనుకోండి మీరు ఒక్కపైసా జేబులో నుంచి తీయాల్సిన పనిలేదు. డెంటల్ ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు వస్తాయి. మీ తలకు గాయాలుఅయ్యాయనుకోండి...హెడ్ ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయి. టైమ్ బాగోలేక మీరు పోయారనుకోండి....‘అమర జ్యోతి’ ఇన్సూరెన్స్ స్కీం కింద మీ కుటుంబ సభ్యులకు అక్షరాలా.....ఇంత డబ్బు వస్తుంది....’’ఎల్ఐసీ కోతి నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతుంది. పొదుపేష్ కుమార్ స్పీచ్ ధాటికి రెండు కొతి గ్యాంగులూ మూర్ఛపోయాయి.‘‘అయ్యో పాపం!’’ అనుకుంటూ తలకొన కోతి ఒకటి తాడి చెట్టు ఎక్కి...తాటికల్లు తెచ్చి వాటి ముఖం మీద చల్లింది. అప్పటికిగాని వాటికి మెలకువ రాలేదు.రెండు కోతిగ్యాంగులూ కాస్త తెరుకున్నాయో లేదో...‘‘నమస్కారం. నా పేరు వివాహిత్ విందా. వికారబాద్ అడవిలో మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. కోతి మ్యారేజ్ బ్యూరోలలో రెండు తెలుగు స్టేట్స్లో మనదే టాప్. మీకు తెలుసు...పెళ్లి అనేది నూరేళ్ల పంట... ఆ పంట ఫలాలు చేతికందాలంటే మాలాంటి మ్యారేజ్ బ్యూరోలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి. మునుపటి రోజులు కాదు...ఒక కోతికి పెళ్లి జరగాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు. ఎప్పుడైతే మనిషి మెదడు జన్యువులను మన మెదడులో ప్రవేశ పెట్టారో...మనిషి ఆచారవ్యవహారాలు కూడా మనకు వచ్చాయి. అందులో కట్నకానుకలు కూడా ఒకటి. ఈ సిస్టమ్ మనలోకి వచ్చాక మన జాతిలో ‘మ్యారేజ్’ అనే మాటే వినబడం లేదు. కోట్లకు కోట్లు పోసి ఎక్కడ పెళ్లిళ్లు చేస్తామండీ!ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మాలాంటి మ్యారేజ్ బ్యూరోల అవసరం వస్తుంది. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి చాలు...వారం తిరక్కుండానే...ఒక మంచి ఆడకోతిని చూసి మ్యారేజ్ చేసే బాధ్యతను మా మ్యారేజ్ బ్యూరో తీసుకుంటుంది... ఇందుకు మీరు పెద్దగా ఇవ్వాల్సిందేమీ లేదు...మీరు పుచ్చుకున్న కట్నకానుకల్లోనే కొంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుంది...’’ ఇలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూనే....‘‘హాbŒ ...హాచ్...హాచ్’’ అని మూడుసార్లు గట్టిగా తుమ్మింది మ్యారేజ్ బ్యూరో కోతి.అయిదు నిమిషాలు తిరిగేలోపే...అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో నుంచి మూడుకోతులు దిగాయి. తుమ్మిన కోతిని అమాంతం ఎత్తి అంబులెన్స్‌లో పడేశాయి. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఆకోతి అరిచేలోపే చేతికి సెలైన్ పెట్టేశాయి.కొద్దిసేపటి తరువాత...అంబులెన్స్ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టుకు దగ్గర్లో ఏడంతస్తుల ఖరీదైన భవంతి ఉంది.చాలా ఎత్తులో అమర్చిన బోర్డ్‌లో...‘చచ్చినా చావనివ్వం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్’ అనే అక్షరాలు కనిపించాయి.అంబులెన్స్ నుంచి దిగిన మ్యారేజ్‌బ్యూరో కోతికి మాత్రం చుక్కలు కనిపించాయి.‘‘ఏం జరుగుతోంది?!’’ అని అరిచేలోపే....తీసుకెళ్లి ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’లో చేర్చి ఫేస్‌కు మాస్కులు పెట్టారు! ‘‘వామ్మో...వాయ్యో...’’ అంటూ ఆ హాస్పిటల్ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది మిసెస్ వివాహిత్ విందా.డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక కోతి అక్కడికి వచ్చి...‘‘మీ ఆయన పేరు వామ్మో నా? వాయ్యో నా? రెండిట్లో ఏది?’’ అని అడిగింది.‘‘రెండూ కాదండీ...మా ఆయన పేరు వివాహిత్ విందా...’’ అంటూ మళ్లీ ఏడుపు అందుకొంది ఆ కోతి ఇల్లాలు.‘‘ఒహో...సిక్స్ బై టు...సెవెన్ ఇంటూ ఫోర్ పేషెంటా!’’‘‘ఆయన పేరు పేషెంట్ కాదండీ...వివాహిత్ విందా’’‘‘నా బొంద...మాకంటూ ఒక భాష ఏడ్చింది కదా... ఆ భాషలోనే మాట్లాడుకుంటాం! నువ్వు అట్టే కన్ఫ్యూజ్ కాకు. మీ ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించడం జరిగింది. పది నిమిషాలు ఆలస్యమైతే మీకు దక్కేవాడు కాదు. సమయానికి మా అంబులెన్స్ రాబట్టి ప్రాణాలతో మిగిలాడు’’ అని చెప్పింది ఆ డాక్టర్ కోతి.రెండు రోజులు తరువాత వివాహిత్ విందాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.‘‘అయ్యా! మూడు తుమ్ములు తుమ్మిన పాపానికి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్లా!’’ అంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్ ముందు వీలైనంత దీనంగా నిలబడ్డాడు వివాహిత్ విందా.‘‘మీ వేలి గోరు స్కాన్ చేయడానికి ఇంతైంది...మీ కాలి గోరు స్కాన్ చేయడానికి, అందులో మట్టిని స్కాన్ చేయడానికి ఇంతైంది...మీరు తుమ్మినప్పుడు బయటికి వచ్చిన సూక్ష్మజీవులు మామూలు సూక్ష్మజీవులేనా...ఈ మధ్య ప్రాణాంతకంగా తయారైన సకోనతుమ్తుమ్ రకం సూక్ష్మజీవులా? అనేది తేల్చడానికి ఇంతైంది...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు సూపరింటెండెంట్ కోతి.ఆయన చెప్పింది వింటూ ‘హాచ్’ అని తుమ్మాడు వివాహిత్ విందా....అంబులెన్స్ వస్తున్న చప్పుడు వినిపించి ‘నన్ను రక్షించండి బాబోయ్’ అని వెనక్కి చూడకుండా పరుగెత్తాడు. – యాకుబ్ పాషా -
ఆ తరువాత ఏంజరిగిందో తెలుసా?
కోతికి మనిషి మెదడు: చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలు – నేషనల్ సైన్స్ రివ్యూ జనరల్ కొన్ని సంవత్సరములు తరువాత.... తలకోన అడవిలో... కోతులు ఎర్లీ మార్నింగ్ లేచాయి. చెట్టుకింద ఉన్న పండ్లు, చెట్టు మీద ఉన్న పండ్లను తిన్నాయి. ఆ తరువాత కబుర్లు చెప్పుకున్నాయి. ఆ తరువాత కీచుకీచుమంటూ కీచులాడుకున్నాయి. ఆ తరువాత కొంచెంసేపు జోకులు వేసుకొని నవ్వుకున్నాయి. ఆ తరువాత మూకుమ్మడిగా తునికిచెట్టు కిందికి వెళ్లి కూర్చున్నాయి. సరిగ్గా అప్పుడే కళ్లకు ఖరీదైన అద్దాలు, భుజానికి అంతకంటే ఖరీదైన నల్లబ్యాగ్ వేసుకున్న ఒక కోతి అక్కడికి వచ్చింది.‘‘హాయ్ అండీ...నా పేరు కోతికుమార్. నల్లమల అడవి నుంచి వస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. ‘వానర లోక’ అనే కొత్త వెంచర్‌ను స్టార్ట్ చేశాము. సిటీకి దగ్గర ఉండేలా ప్లాన్ చేశాం. రోడ్లు, ట్రాన్స్పోర్ట్, వాస్తు...అన్ని బ్రహ్మాండం...’’ నాన్‌స్టాప్‌గా చెప్పుకుపోతున్నాడు కోతికుమార్.కోతులగుంపుకి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాట్లాడుతున్నాదేమిటో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.‘‘రియల్ ఎస్టేట్ ఏమిటి? కొత్త వేంచర్ ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది ఒక కోతి.‘‘ఎక్కడున్నారయ్యా మీరు! ఒకవైపు మన కోతులు కనివిని ఎరుగని అభివృద్ధి వైపు దూసుకువెళుతుంటే...మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నారు. మనిషి మెదడును కోతిలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో.... మన కోతులు ఎక్కడికోవెళ్లిపోయాయి! మన నుంచే వచ్చిన మనిషి మన కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు. ఇప్పుడు ఇక అంత సీన్ లేదు. మనిషితో సమానంగా మనం డెవలప్ అవుతున్నాం. ఈ క్రమంలో భాగంగానే మన కోతుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇంకా ఎంతకాలం బతుకు వెళ్లదీస్తాం? మనకు మాత్రం భద్రత ఉండొద్దా? ఈ విశాల అడవిలోమీకంటూ కొంప ఉండొద్దా? అందుకే వచ్చింది మా వానరలోక....’’ఈలోపు అక్కడికి మరొక కొత్త కోతి వచ్చింది.‘‘నా పేరు మంకీస్ రాజ్. ఆదిలాబాద్ అడవుల్లో నుంచి వస్తున్నాను. దయచేసి మీరు వీడి మాటలు నమ్మకండి. రియల్ ఎస్టేట్ పేరుతో ఎన్నో అడవుల్లో ఎందరో అమాయక కోతుల చేత డబ్బు కట్టించుకొని, కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. నాది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్సే. కాని నమ్మకమే మా ప్రాణం. విశ్వాసమే మా ఆయుధం...మీ సౌకర్యమే మా శ్వాస...డబ్బులు ఊరకే రావు...’’ అని దంచుకుంటూ పోతున్నాడు మంకీస్ రాజ్.‘‘ఎవడ్రా నువ్వు?’’ అని రాజ్‌పై తన తోకతో దాడి చేశాడు కోతికుమార్. ‘‘నాపైనే తోక చేసుకుంటావా! ఎన్ని గుండెల్రా నీకు...రేయ్ వచ్చేయండ్రా’’ అని అరిచాడు కోతికుమార్.అంతే... తెల్లలుంగీ వేసుకున్న కోతుల గుంపు అక్కడికి వచ్చింది. వాటి చేతిలో పదునైన వేటకోడవళ్లు ఉన్నాయి.ప్రమాదాన్ని పసిగట్టిన మంకీస్ రాజ్...‘‘కమాన్ గయ్స్...బయటికి వచ్చేయండి’’ అని అరిచాడు. అంతే...చెట్ల చాటు దాక్కున కోతుల గుంపు అరుస్తూ బయటికి వచ్చింది. జీన్స్ ధరించిన ఆ కోతుల చేతిలో నాటుబాంబులు ఉన్నాయి. ఇక చూడండి.... రెండు వర్గాలు... డిష్యూం డిష్యూం డిష్యూం!‘‘రెండు గంటల నుంచి ఫైట్ చేసుకుంటున్నారు... ఒక్కరూ గాయపడడం లేదేమీటి?’’ అన్నది తలకోన కోతి కాస్త గట్టిగానే. ఈమాట వినబడగానే రెండు గ్రూప్‌లు స్విచ్ఆఫ్ చేసినట్లు ఆగిపోయాయి.‘‘రేయ్... ఎవడ్రా ఈ బాంబులు కొన్నది’’ తోడగొట్టి గట్టిగా అరిచాడు మంకీస్ రాజ్.‘‘నేనేనయ్యా’’ భయంభయంగా అంది ఒక బక్కప్ప కోతి.‘‘అసలేం జరిగింది?’’ గర్జించాడు మంకీస్ రాజ్.‘‘కమీషన్‌కు కక్కుర్తి పడి...మనం ఎప్పుడూ కొనే చోట కాకుండా....ఆ చెడ్డప్ప దగ్గర కొన్నానయ్యా...వాడు ఈ డూప్లికేట్ బాంబులు, పేలని బాంబులు ఇచ్చి మోసం చేస్తాడని అనుకోలేదయ్యా.నన్ను క్షమించండయ్యా’’ అని ఘొల్లుమన్నాడు బక్కప్ప.అవతలి వైపు... ‘‘రేయ్...ఈ వేటకోడవళ్లు కొన్నది ఎవరు?’’ భయంకరంగా గర్జించాడు కోతికుమార్.అందరూ సైలెన్స్ అయ్యారు.‘‘ఏమ్రా.... నేనంటే భయం తగ్గిందా...లేక బలుపు పెరిగిందా... కమాన్ టెల్ మీ... చెప్పండ్రా... వేటకొడవళ్లు కొన్నది ఎవరు?’’ మళ్లీ గర్జించాడు కోతికుమార్.‘‘ఎవరో కాదయ్యా.... మీ తమ్ముడే...’’ అన్నది ఒక కోతి.నిజమా!’ అన్నట్లుగా తమ్ముడి వైపు చూశాడు కోతికుమార్. ‘నిజమే’ అన్నట్లు పశ్చాత్తాప హృదయంతో కళ్లు నేలకేశాడు ఆ తమ్ముడు.‘‘ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు తమ్ముడూ....అసలు నువ్వు నా తమ్ముడి వేనా....ఎందుకు చేశావు ఈ పాపిష్టి పని?’’ గుండె పట్టుకొని బాధగా అరుస్తున్నాడు కోతికుమార్.‘‘నన్ను క్షమించన్నయ్యా. దేవుడిలాంటి అన్నయ్యను మోసం చేశాను. నన్ను ఎవరూ క్షమించ లేరు...క్షమించినా నేను తట్టుకోలేను...’’ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు తమ్ముడు కోతి.‘‘డైలాగుల సంగతి సరే, అసలు ఏంజరిగిందో చెప్పు...’’ గద్దించాడు కోతికుమార్కి బాడీగార్డ్ కోతి.‘‘చెబుతాను....సరిగ్గా నెల రోజుల క్రితం ‘కోతిని’ అనే అమ్మాయితో లవ్‌లో పడ్డాను. ఆమె లేకుండా జీవించలేను. ఒకరోజు ఆమె నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు అడిగింది. లేదంటే పరువు పోతుందని, మా అన్న పరమ పినాసి...ఏనాడు ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోడు...అంటే వంశగౌరవం మంటగలుస్తుందని...అబద్ధం ఆడాను...నువ్వు ఎంత అడిగినా సరే ఇస్తాను అన్నాను.అన్నాను సరే... నా దగ్గర డబ్బెక్కడిది!అన్నను అడిగితే ‘ఎందుకు?’ అని గద్దిస్తాడు.‘నా గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్నయ్యా..’ అంటాను.‘నీ ఫేస్‌కు గర్ల్ఫ్రేండా....హాహాహా...’ అని గబ్బరుసింగులా నవ్వుతాడు.‘అన్న నవ్విండు కాబట్టి మనం నవ్వకపోతే బాగుండదు’ అని మీరు కూడా కోరస్‌గా ‘హోహోహో’ అని నవ్వుతారు.నా ఇజ్జత్ కబ్జా అయిపోతది. ఇంత అవసరమా?వంద అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు..ఒకే ఒక్క మోసం చేసి నా ప్రేమను గెలుచుకోవాలనుకున్నాను.అందుకే ఈ మోసం చేశాను. ఎప్పుడూ కొనే చోట కాకుండా...ఈసారి వేటకొడవళ్లను వేటపాలెంలో కొన్నాను. అక్కడమోసప్ప అనే రౌడీ దగ్గర ఈ వేటకొడవళ్లు కొని మిగిలిన సొమ్ము జేబులో వేసుకున్నాను. ఇవి మరీ....బొమ్మ వేటకొడవళ్లా ఉన్నాయి! అని అడిగితే...ఏదో మాట వరుసకు ఇవి మీ చేతుల్లో ఉండాలిగానీ....ఎప్పుడైనా ఫైట్ చేసి చచ్చారా? మీ గురించి నాకు తెలియదా...ఫైట్ చేయనప్పడు బొమ్మ వేటకొడవళ్లు అయితే ఏంటి? నిజమైనవి అయితే ఏమిటి? అన్నాడు. నిజమే కదా అనిపించింది’’ స్టోరీ అంతా చెప్పి కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు తమ్ముడు కోతి! (సశేషం) – యాకుబ్ పాషా -
ట్వీట్ వైరల్ ఎలా అవుతుందంటే?
బీజింగ్: సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో సామాన్యులు పెట్టే ట్వీట్లు కొన్నిసార్లు వైరల్ అయిపోతుంటాయి. అదే సమయంలో మరికొందరు ప్రముఖులు చేసిన ట్వీట్లకు కొన్నినిమిషాల పాటు స్పందన బాగున్నప్పటికీ ఆ తర్వాత తగ్గిపోతుంది. అయితే ఇందుకు ఆయా ట్వీట్లలోని సమాచారం కారణం కాదని చైనాలోని బైహాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ ట్వీట్‌కు సంబంధించి తొలి 50 రీట్వీట్లపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ఏదైనా ఓ ట్వీట్‌కు సంబంధించి తొలి 50 రీట్వీట్లను అధ్యయనం చేయడం ద్వారా ఓ విషయం వైరల్‌గా మారుతుందా? లేదా? అన్నది అంచనా వేయవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లో విశ్లేషణ.. ఈ పరిశోధనలో భాగంగా వ్యక్తుల ఆలోచనల వ్యాప్తిని అంచనా వేసేందుకు అంటువ్యాధుల వ్యాప్తిని అంచనా వేసే వ్యాప్తికారక మోడల్‌ను, ప్రామాణిక మోడల్‌ను వినియోగించారు. అనంతరం 1.2 కోట్ల ట్వీట్లను, 15 లక్షల రీట్వీట్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా ఓ సమాచారం వైరల్‌గా ఎలా మారుతుందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. ఓ ట్వీట్ వైరల్‌గా మారడంలో తొలి 50 రీట్వీట్లు కీలకపాత్ర పోషిస్తాయని ఈ పరిశోధనలో తేలినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ 50 రీట్వీట్లు చేసే వ్యక్తుల ఆలోచనా విధానం, ప్రవర్తన, అలవాట్లు, దృక్పథం ఓ విషయం వైరల్‌గా మారడంలో గణనీయమైన ప్రభావం చూపుతాయని వెల్లడించారు. పరిశోధనలో భాగంగా సమాచారం ప్రజల్లోకి ఏవిధంగా వెళుతుందో తెలుసుకునేందుకు ఓ వ్యాప్తికారక మోడల్‌ను అభివృద్ధి చేశామన్నారు. అనంతరం ట్విట్టర్‌లోని సమాచారం, సిమ్యులేటెడ్ సమాచారాన్ని వ్యాప్తికారక మోడల్, ప్రామాణిక మోడల్ ద్వారా విశ్లేషించామని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో వ్యాప్తికారక మోడల్ ద్వారా సమాచారం ఎక్కువగా వైరల్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. ఓ విషయం వ్యాప్తి చెందే దాన్ని బట్టే అది వైరల్‌గా మారుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన ‘పీఎల్వోఎస్ వన్’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. -
ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాయొచ్చు
ఇప్పుడున్న కాగితాలు కొంత కాలానికి చిరిగిపోతాయి. వాటిపై రాతలు కొన్ని రోజులకే చెరిగిపోతాయి. చైనా శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందుల్ని తప్పించే కొత్త రకం కాగితాన్ని తయారు చేశారు. ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. దీనిపై రాసింది 6 నెల్లదాకా చెక్కుచెదరదు. ఫ్యుజియన్ నార్మల్ వర్సిటీకి చెందిన లుజోహు చెన్ బృందం ఈ కాగితాన్ని తయారు చేసింది. ఈ కాగితం 3 పొరలుగా ఉంటుంది. ఒక వైపు పొరపై ప్రత్యేకంగా తయారు చేసిన నీలిరంగు పూస్తారు. వేడి తగలగానే ఆ రంగు మాయమై కాగితం తెల్లగా మారుతుంది. రెండోవైపు నలుపు రంగు పూస్తారు. దీన్ని వెలుతురులో పెట్టినప్పుడు వేడిని పుట్టిస్తుంది. 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలో ఈ కాగితంపై నీలిరంగు వస్తూపోతూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఈ కాగితం తెల్లగా కనబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీల కంటే తక్కువుంటే కాగితం నీలిరంగుకు మారుతుంది.వేడిని పుట్టించే ప్రత్యేకమైన పెన్నుతో ఈ కాగితంపై రాయవచ్చు.ఈ కాగితంపై వందసార్లు రాసుకోవచ్చునని చెన్ చెబుతున్నారు. పెన్నుతో రాసింది చెరిగిపోవాలంటే కాగితాన్ని మైనస్ పది డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే చాలు. ఈ కొత్తరకం కాగితాన్ని అనేక సార్లు ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల కాగితం వినియోగం గణనీయంగా తగ్గుతుందని, ఫలితంగా కాగితం తయారీ కోసం చెట్లను నరకడం తగ్గుతుందని వారు వివరిస్తున్నారు. -
జీన్ ఎడిటింగ్‌తో జననం.. వినాశనం తప్పదు!
హాంగ్‌కాంగ్: చైనాలోని షెంజెన్‌కు చెందిన పరిశోధకుడు హే జియాంకుయ్ సంచలన ప్రకటన చేశారు. తాను మానవ పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేపట్టాననీ, తద్వారా ఈ నెలలో ఇద్దరు చిన్నారులు జన్మించారని బాంబు పేల్చారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డా.మైకెల్ డీమ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మనుషుల డీఎన్ఏలోని వ్యాధికారక జన్యువులను తొలగించి, ఆరోగ్యకరమైన జన్యవులను చేర్చుకోవచ్చు. తద్వారా భవిష్యత్ తరాలకు అస్సలు ఎలాంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుమారుడు లేదా కుమార్తె జుట్టు రంగు, ఎత్తు, శరీర ఛాయ, ఎలా ఉండాలో పిండం దశలోనే నిర్ణయించవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఎవరైనా దుర్వినియోగం చేసి రోగాలు, అలసట, ముసలితనం, చావు అంటూలేని శక్తిమంతమైన మనుషులను తయారుచేస్తే మానవజాతి మొత్తం అంతరించిపోతుందన్న భయంతో అమెరికా, చైనా సహా పలు ప్రపంచదేశాలు జీన్ ఎడిటింగ్‌ను నిషేధించాయి. అయితే చైనాలో పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. హెచ్ఐవీ దంపతుల ఎంపిక తాజాగా ఈ విషయమై జియాంకుయ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం కోసం హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకిన దంపతులను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఫలదీకరణం తర్వాత మూడు నుంచి 5 రోజుల వయసున్న పిండాలను ఎడిట్ చేసి ఎయిడ్స్ సోకేందుకు కారణమయ్యే సీసీఆర్5 అనే ప్రొటీన్‌ను పిండాల నుంచి తొలగించామని వెల్లడించారు. ఈ ప్రక్రియను ముందుగా ఎలుకలు, కోతులపై పరీక్షించాకే మనుషుల్లో చేపట్టామన్నారు. పుట్టిన ఇద్దరు బాలికల్లో ఒకరిలో మార్పిడి చేసిన రెండు జన్యువులు ఉండగా, మరో చిన్నారిలో ఒకే జన్యువు ఉందన్నారు. హాంకాంగ్‌లో మంగళవారం జీన్ ఎడిటింగ్ సదస్సు నేపథ్యంలో జియాంకుయ్ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రయోగం మానవాళికి వినాశకరంగా మారుతుందనీ, సమాజంలో నైతిక విలువలు పడిపోతాయని చాలామంది శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాధి నిరోధక లక్షణాలు భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మరికొందరు ఈ మొత్తం ప్రక్రియపైనే సందేహాలు వ్యక్తం చేశారు. -
కేన్సర్‌కు ‘క్రిస్పర్’
ప్రాణాంతక కేన్సర్ చికిత్సలో శాస్త్రవేత్తలు మరో కీలకమైన ముందడుగు వేశారు. మానవ జన్యువుల్లో అతిసులువుగా అవసరమైన మార్పులు చేయగల క్రిస్పర్ టెక్నాలజీని వాడే సరికొత్త చికిత్స విధానాన్ని తొలిసారి మానవులపై ప్రయోగించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే కేన్సర్‌కు మరింత మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు. శరీరంలో ఏదైన రోగకారక బ్యాక్టీరియా, వైరస్ ప్రవేశిస్తే మొట్టమొదట స్పందించేది రోగనిరోధక వ్యవస్థే అనే విషయం తెలిసిందే. తెల్లరక్త కణాలతో కూడిన ఈ వ్యవస్థ నుంచి తప్పించుకుని కేన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో తెల్ల రక్తకణాలనే కేన్సర్‌కు చికిత్సగా వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన పరిశోధకుల్లో వచ్చింది. ఈ విధానాన్ని ఇమ్యునోథెరపీ అంటారు. ఇప్పటి వరకు కొన్ని వైరస్ల ద్వారా తెల్ల రక్త కణాలను చైతన్యవంతం చేసి చికిత్స అందించేవారు. క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ ద్వారా తెల్ల రక్తకణాల్లో జన్యుపరమైన మార్పులు చేసి అప్పటి వరకూ గుర్తించని కేన్సర్ కణాలను కూడా గుర్తించి చంపేలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ పద్ధతి పరిశోధనశాలలో మంచి ఫలితాలనిచ్చింది. దీంతో కొందరు చైనా శాస్త్రవేత్తలు మానవులపై వచ్చే నెల ప్రయోగాలు చేపట్టనున్నారు. సిచుహాన్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వెస్ట్ చైనా ఆస్పత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ముందు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడ్డవారిలో ఒకరి తెల్ల రక్త కణాలను మార్చి మళ్లీ వారిలో ప్రవేశపెడతారు. ఫలితాలను బట్టి మరికొంత మందిపై ప్రయోగాలు చేపడతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
గ్రాఫీన్ ఈ-పేపర్
బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరతీస్తూ తొలిసారిగా గ్రాఫీన్‌తో ఎలక్ట్రానిక్ కాగితాన్ని తయారు చేశారు. దీన్ని ఈ-రీడర్లు, శరీరానికి ధరించే స్మార్ట్ పరికరాల్లో డిస్ప్లేగా ఉపయోగిస్తారు. గ్రాఫీన్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, తేలికైన పదార్థం. దీని ఒక పొర కేవలం 0.335 నానోమీటర్ల మందం ఉంటుంది. ఇది ఉష్ణం, విద్యుత్తు శక్తిలకు మంచి వాహకం. ప్రస్తుతమున్న సంప్రదాయ ఈ-పేపర్లతో పోలిస్తే, గ్రాఫీన్ ఎలక్ట్రానిక్ కాగితం, అవసరానికి తగ్గట్టుగా వంగడంతోపాటు, బలంగా ఉంటుంది. కాంతిని ఎక్కువదూరం ప్రసరింపచేస్తుంది గనుక విషయం బాగా కనిపిస్తుంది. గ్రాఫీన్ కార్బన్ మూలకం అయినందున ధర కూడా తక్కువగా ఉంటుంది. మరో ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభిస్తారు. -
హార్ట్‌బీట్‌తో చార్జింగ్!
వాషింగ్టన్: మన గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తుల కదలిక వంటి వాటి ఆధారంగా.. స్వల్పస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. అతి సన్నని ‘లెడ్ జిర్కోనిక్ టైటనేట్’ పట్టీలు, కదలికను విద్యుత్‌గా మార్చే రెక్టిఫయర్లను ఈ పరికరంలో ఉపయోగించారు. హృద్రోగులకు అమర్చే పేస్‌మేకర్‌ను ఎప్పటికప్పుడు రీచార్జ్ చేసుకోగలిగేలా.. ప్రస్తుతం ఈ పరికరాన్ని రూపొందించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికి అమర్చే ‘హార్ట్‌రేట్ మానిటర్లు, పేస్మేకర్లు, న్యూరల్ సిమ్యులేటర్లు..’తో పాటు శరీరంలో అమర్చే అనేక వైద్య పరమైన ఇంప్లాంట్లకు అవసరమైన విద్యుత్‌ను ఈ పరికరంతో పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
జస్ట్ 'లైట్'తో...లై-ఫే
లైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తే ఎలా ఉంటుంది... అవును మీరు విన్నది నిజమే... ఇంతకుముందు వై-ఫై ద్వారా ఇంటర్నెట్ పొందేవాళ్లం. అయితే ఇప్పుడు జస్ట్ 'లైట్' ఉంటే చాలు... దాని ద్వారా ఇంటర్నెట్ పొందవచ్చని చైనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడమే ఇప్పుడు కష్టం కదా. అదే విధంగా ఇంటర్నెట్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు...ఆ ఇంటర్నెట్కు మధ్యమంగా వ్యవహరిస్తున్న వై-ఫై టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు మరింత సులువైన టెక్నాలజీని చైనాకు చెందిన సైంటిస్ట్‌లు కనిపెట్టారు. బల్బు ఉంటే చాలు దాన్నే ఇంటర్నెట్ మాధ్యమంగా వినియోగించుకో వచ్చంటున్నారు. ఒక్క కంప్యూటర్‌కు మాత్రమే కాకుండా కొన్ని సిస్టమ్స్‌కు కనెక్ట్ చేయాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉపయోగించుకునే వై-ఫై రూటర్ ద్వారా నెట్ ప్రసారాలు చేయాల్సి వచ్చేది. పైగా వాటి పరికరాల ఖర్చు కూడా ఎక్కువే.దాంతో చైనా సైంటిస్ట్‌లు ఎల్ఇడి బల్బ్ ద్వారా ఈ ప్రసారాలు చేసి అబ్బుర పరుస్తున్నారు. దీనివల్ల వై-ఫై కంటే కూడా రేడియేషన్ లెవల్స్ తక్కువగా ఉండటమే కాదు ఎనర్జీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. అంతేకాదు లైట్ ఉపయోగించి ఈ టెక్నాలజీని పనిచేసేలా చేస్తున్నారు.కాబట్టి దానికి లై-ఫే అని పేరు పెట్టారు చైనాకు చెందిన షాంగై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఫిజిక్స్ వారు. నవంబర్ 5న చైనాలోని షాంగైలో దీన్ని ప్రదర్శనకు పెట్టనున్నారు. ఒకవేళ లైట్ ఆపివేస్తే సిగ్నల్ ఆగిపోయి నెట్ వర్క్ కూడా నిలిచిపోతుందని సైంటిస్ట్‌లు చెపుతున్నారు. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా వాడనున్నట్లు వారు తెలియ చేశారు.మరి ఈ టెక్నాలజీ మనదేశంలోకి రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
కాంతితో ఇంటర్నెట్
* ఎల్ఈడీ బల్బులతో సమాచారాన్ని ప్రసారం చేసే ‘లైఫై’ టెక్నాలజీని అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు * వ్యయం తక్కువ.. భద్రత ఎక్కువ * కేవలం ఒక వాట్ బల్బుతో నాలుగు కంప్యూటర్లకు నెట్ బీజింగ్: కేవలం కాంతి (లైట్)తో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేయగల సరికొత్త సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘వైఫై’ను పోలిన ఈ టెక్నాలజీని ‘లైఫై’గా పిలుస్తున్నారు. వైఫైలో రేడియో తరంగాలను ఉపయోగిస్తే.. ఈ ‘లైఫై’లో కేవలం కాంతిని మాత్రమే వినియోగిస్తారు. వైఫైలో వాడే పరికరాల ధర ఎక్కువ, వాటి విద్యుత్ వినియోగమూ ఎక్కువే. అదే ‘లైఫై’కి అయ్యే వ్యయం, విద్యుత్ వినియోగం చాలా తక్కువ. ‘లైఫై’ టెక్నాలజీ ద్వారా కేవలం ఒక వాట్ సామర్థ్యమున్న చిన్న ఎల్ఈడీ బల్బుతో ఏకంగా సెకనుకు 150 మెగాబిట్స్ వేగంతో నాలుగు కంప్యూటర్లకు ఇంటర్నెట్ను అందించవచ్చు. ఇందులో సమాచార భద్రత, ఇతర సౌకర్యాలూ ఎక్కువే. దీనితో నెట్‌ను అందుకోవడమే కాదు.. ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి మధ్యా సమాచార మార్పిడి చేయవచ్చు.దీనిలో రేడియో తరంగాల వాడకం లేకపోవడంతో.. విమానాల్లోనూ, రేడియేషన్ ఉండే సున్నిత ప్రదేశాల్లోనూ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. అయితే, ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులూ ఉన్నాయి. కేవలం లైట్ ఆపేస్తే ఇంటర్నెట్ నిలిచిపోతుంది. గోడలు అడ్డుగా ఉండడం, ఎక్కువ దూరం లో ఉంటే పనిచేయకపోవడం దీనిలో లోపాలు. ‘లైఫై’ టెక్నాలజీని తొలుత బ్రిట న్కు చెందిన ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్త హరాల్డ్ హాస్ ప్రతిపాదించారు. దానిని తాజాగా చైనాకు చెందిన షాంఘై ఫుడాన్ వర్సిటీ ప్రొఫెసర్ చి నాన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే, ఈ ‘లైఫై’ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ప్రొఫెసర్ చి నాన్ చెప్పారు. చైనాలోని షాంఘైలో వచ్చే నెల 5న జరగనున్న అంతర్జాతీయ ఇండస్ట్రీ ఫెయిర్‌లో పది ‘లైఫై’ కిట్లను ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలిపారు.