ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? | Funday Laughing story of the week 05-05-2019 | Sakshi
Sakshi News home page

 ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?

Published Sun, May 5 2019 12:02 AM | Last Updated on Sun, May 5 2019 12:02 AM

Funday Laughing  story of the week 05-05-2019 - Sakshi

జరిగిన కథ: చైనా శాస్త్రవేత్తలు కోతికి మనిషి మెదడును సెట్‌ చేయడంతో ‘కోతిలోకం’లో  విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కొద్దికాలంలోనే కోతికి మనిషి బుద్ధులు వచ్చాయి. తలకొన అడవిలో రెండు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార కోతి గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్యాంగ్‌లూ ఆయుధాలు తీశాయి. కాని అవి నకిలీ ఆయుధాలు కావడంతో ఇరువర్గాల్లో ఒక్క కోతి కూడా గాయపడలేదు.

తరువాయి భాగం:‘‘ఇలా అయితే లాభం లేదు. బాహాబాహీకి దిగి ఎవరి సత్తా ఏమిటో చూసుకుందాం’’  బస్తీమే సవాల్‌ అని అరుస్తూ బాహాబాహీకి దిగాయి రియల్‌ ఎస్టేట్‌ కోతి గ్యాంగులు.సరిగ్గా పది నిమిషాల తరువాత...‘‘ఆగండి’’ అనే అరుపు వినబడింది. రెండు గ్యాంగులూ కొట్లాట ఆపి ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశాయి.‘‘ఎవరు మీరు? శాంతిదూతా?’’ అడిగింది గ్యాంగ్‌లో ఒక కోతి.‘‘కాదు. ఎల్‌ఐసీ ఏజెంట్‌ని. నా పేరు పొదుపేష్‌ కుమార్‌.  ఏటూరునాగారం అడవి నుంచి వస్తున్నాను’’ అన్నది కొత్తగా వచ్చిన ఆ కోతి.‘‘మాతో నీకేం పని?’’ అడిగింది గ్యాంగ్‌లో కోతి.‘‘బాహాబాహీ రక్ష అని కొత్త పాలసీ వచ్చింది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తాను. లెట్‌ మీ టాక్‌ ఎబౌట్‌..’’ అన్నది ఎల్‌ఐసీ కోతి.‘చెప్పి చావు’ అన్నట్లుగా చూశాయి రెండుగ్యాంగుల కోతులు.ఎల్‌ఐసీ కోతి చెప్పటం మొదలు పెట్టింది:‘‘బాహబాహీ రక్షలో... డెంటల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. కొట్లాటలో మీ పళ్లు విరిగాయనుకోండి మీరు ఒక్కపైసా జేబులో నుంచి తీయాల్సిన పనిలేదు. డెంటల్‌ ఇన్సూరెన్స్‌ కింద మీకు డబ్బులు వస్తాయి. మీ తలకు గాయాలుఅయ్యాయనుకోండి...హెడ్‌ ఇన్సూరెన్స్‌ కింద డబ్బులు వస్తాయి. టైమ్‌ బాగోలేక మీరు పోయారనుకోండి....‘అమర జ్యోతి’  ఇన్సూరెన్స్‌ స్కీం కింద మీ కుటుంబ సభ్యులకు అక్షరాలా.....ఇంత డబ్బు వస్తుంది....’’ఎల్‌ఐసీ కోతి నాన్‌స్టాప్‌గా చెప్పుకుంటూ పోతుంది.

పొదుపేష్‌ కుమార్‌ స్పీచ్‌ ధాటికి రెండు కొతి గ్యాంగులూ మూర్ఛపోయాయి.‘‘అయ్యో పాపం!’’  అనుకుంటూ తలకొన కోతి ఒకటి తాడి చెట్టు ఎక్కి...తాటికల్లు తెచ్చి వాటి ముఖం మీద చల్లింది. అప్పటికిగాని వాటికి మెలకువ రాలేదు.రెండు కోతిగ్యాంగులూ కాస్త తెరుకున్నాయో లేదో...‘‘నమస్కారం. నా పేరు వివాహిత్‌ విందా. వికారబాద్‌ అడవిలో మ్యారేజ్‌ బ్యూరో నిర్వహిస్తున్నాను. కోతి మ్యారేజ్‌ బ్యూరోలలో రెండు తెలుగు స్టేట్స్‌లో మనదే టాప్‌. మీకు తెలుసు...పెళ్లి అనేది నూరేళ్ల పంట... ఆ పంట ఫలాలు చేతికందాలంటే మాలాంటి మ్యారేజ్‌ బ్యూరోలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి. మునుపటి రోజులు కాదు...ఒక కోతికి పెళ్లి జరగాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలియంది కాదు. ఎప్పుడైతే మనిషి మెదడు జన్యువులను మన మెదడులో ప్రవేశ పెట్టారో...మనిషి ఆచారవ్యవహారాలు కూడా మనకు వచ్చాయి. అందులో కట్నకానుకలు కూడా ఒకటి. ఈ సిస్టమ్‌ మనలోకి వచ్చాక మన జాతిలో ‘మ్యారేజ్‌’ అనే మాటే వినబడం లేదు. కోట్లకు కోట్లు పోసి ఎక్కడ పెళ్లిళ్లు చేస్తామండీ!ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మాలాంటి మ్యారేజ్‌ బ్యూరోల అవసరం వస్తుంది.

మీ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో ఇవ్వండి చాలు...వారం తిరక్కుండానే...ఒక మంచి ఆడకోతిని చూసి మ్యారేజ్‌ చేసే బాధ్యతను మా మ్యారేజ్‌ బ్యూరో తీసుకుంటుంది... ఇందుకు మీరు పెద్దగా ఇవ్వాల్సిందేమీ లేదు...మీరు పుచ్చుకున్న కట్నకానుకల్లోనే కొంత మొత్తాన్ని మాకు ఇస్తే సరిపోతుంది...’’  ఇలా సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూనే....‘‘హాbŒ ...హాచ్‌...హాచ్‌’’ అని మూడుసార్లు గట్టిగా తుమ్మింది మ్యారేజ్‌ బ్యూరో కోతి.అయిదు నిమిషాలు తిరిగేలోపే...అక్కడికి ఒక అంబులెన్స్‌ వచ్చింది. అందులో నుంచి మూడుకోతులు దిగాయి. తుమ్మిన కోతిని అమాంతం ఎత్తి  అంబులెన్స్‌లో పడేశాయి. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఆకోతి అరిచేలోపే చేతికి సెలైన్‌ పెట్టేశాయి.కొద్దిసేపటి తరువాత...అంబులెన్స్‌ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గర ఆగింది. ఆ చెట్టుకు దగ్గర్లో  ఏడంతస్తుల ఖరీదైన భవంతి ఉంది.చాలా ఎత్తులో అమర్చిన బోర్డ్‌లో...‘చచ్చినా చావనివ్వం సూపర్‌ స్పెషలిటీ హాస్పిటల్‌’ అనే అక్షరాలు కనిపించాయి.అంబులెన్స్‌ నుంచి దిగిన మ్యారేజ్‌బ్యూరో కోతికి మాత్రం చుక్కలు కనిపించాయి.‘‘ఏం జరుగుతోంది?!’’ అని అరిచేలోపే....తీసుకెళ్లి ‘ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌’లో చేర్చి ఫేస్‌కు మాస్కులు పెట్టారు!

‘‘వామ్మో...వాయ్యో...’’ అంటూ ఆ హాస్పిటల్‌ దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది మిసెస్‌ వివాహిత్‌ విందా.డాక్టర్‌ దుస్తుల్లో ఉన్న ఒక కోతి అక్కడికి వచ్చి...‘‘మీ ఆయన పేరు వామ్మో నా? వాయ్యో నా? రెండిట్లో ఏది?’’ అని అడిగింది.‘‘రెండూ కాదండీ...మా  ఆయన పేరు వివాహిత్‌ విందా...’’ అంటూ మళ్లీ ఏడుపు అందుకొంది ఆ కోతి ఇల్లాలు.‘‘ఒహో...సిక్స్‌ బై టు...సెవెన్‌ ఇంటూ ఫోర్‌ పేషెంటా!’’‘‘ఆయన పేరు పేషెంట్‌  కాదండీ...వివాహిత్‌ విందా’’‘‘నా బొంద...మాకంటూ ఒక భాష ఏడ్చింది కదా... ఆ భాషలోనే మాట్లాడుకుంటాం! నువ్వు అట్టే కన్‌ఫ్యూజ్‌ కాకు.  మీ ఆయన్ను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో చేర్పించడం జరిగింది. పది నిమిషాలు ఆలస్యమైతే మీకు దక్కేవాడు కాదు. సమయానికి మా అంబులెన్స్‌ రాబట్టి ప్రాణాలతో మిగిలాడు’’ అని చెప్పింది ఆ డాక్టర్‌ కోతి.రెండు రోజులు తరువాత వివాహిత్‌ విందాను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జీ అయ్యాడు.‘‘అయ్యా! మూడు తుమ్ములు తుమ్మిన పాపానికి మూడు లక్షల అరవై వేల నాలుగు వందల డెబ్బై రూపాయల బిల్లా!’’ అంటూ  హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ముందు వీలైనంత దీనంగా నిలబడ్డాడు వివాహిత్‌ విందా.‘‘మీ వేలి గోరు స్కాన్‌ చేయడానికి ఇంతైంది...మీ కాలి గోరు స్కాన్‌ చేయడానికి, అందులో మట్టిని స్కాన్‌ చేయడానికి ఇంతైంది...మీరు తుమ్మినప్పుడు బయటికి వచ్చిన సూక్ష్మజీవులు మామూలు సూక్ష్మజీవులేనా...ఈ మధ్య ప్రాణాంతకంగా తయారైన సకోనతుమ్‌తుమ్‌ రకం సూక్ష్మజీవులా? అనేది తేల్చడానికి ఇంతైంది...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు సూపరింటెండెంట్‌ కోతి.ఆయన చెప్పింది వింటూ  ‘హాచ్‌’ అని తుమ్మాడు వివాహిత్‌ విందా....అంబులెన్స్‌ వస్తున్న చప్పుడు వినిపించి ‘నన్ను రక్షించండి బాబోయ్‌’ అని వెనక్కి చూడకుండా పరుగెత్తాడు.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement