
జెనీవా: చైనా నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కరోనా వైరస్ తొలుత భారత్‌లో బయటపడిందంటూ కాకమ్మ కథలు మొదలు పెట్టింది. కరోనా వైరస్ మొదటిసారిగా ఎక్కడ ఎలా బయటపడిందనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో చైనా భారత్‌ను లక్ష్యంగా చేసుకొని నిందలు మోపుతోంది. 2019 వేసవిలో భారత్‌లో కరోనా వైరస్ పుట్టిందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుల బృందం పేర్కొంది. జంతువుల నుంచి మనుషులకి కలుషిత నీటి ద్వారా సోకిన ఈ వైరస్ వూహాన్‌కి చేరుకుందని వారు కొత్త కథ వినిపిస్తున్నారు. వూహాన్‌లో తొలి కేసు బయటపడినంత మాత్రాన వైరస్ పుట్టుక అక్కడే జరిగిందని చెప్పలేమంటున్నారు.
జన్యు మార్పుల ద్వారా పుట్టుక తెలుసుకోవచ్చు: చైనా కొత్త వాదన
కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమం, దాని డీఎన్‌ఏని విశ్లేషించి అది ఎక్కడ ఆవిర్భవించిందో వాదిస్తూ చైనా శాస్త్రవేత్తలు ఒక నివేదికని డబ్ల్యూహెచ్‌ఓకి సమర్పించారు.ప్రధానంగా భారత్, బంగ్లాదేశ్‌లో వైరస్ తక్కువగా మ్యుటేషన్ చెందుతోందని ఆ రెండూ ఇరుగు పొరుగు దేశాలు కావడంతో అక్కడ్నుంచే వైరస్ వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు వాదించారు. అయితే చైనా శాస్త్రవేత్తల వాదనల్లో వాస్తవం లేదని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన నిపుణుడు డేవిడ్ రాబర్ట్‌సన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment