చైనా గుట్టు రట్టు చేసిన ‘వుహాన్‌ ఫైల్స్‌’ | The Wuhan Files Show China Lied About Covid | Sakshi
Sakshi News home page

కరోనా విషయంలో చైనా బండారం బట్టబయలు

Published Wed, Dec 2 2020 3:04 PM | Last Updated on Thu, Dec 3 2020 2:43 AM

The Wuhan Files Show China Lied About Covid - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి మరో పదేళ్ల వెనక్కి వెళ్లింది. వైరస్‌ గురించి తెలిసిన నాటి నుంచి పలు దేశాలు చైనాలోనే ఈ వైరస్‌ జన్మించిందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అయితే కరోనా విషయంలో చైనాని, డబ్ల్యూహెచ్‌ఓని బాధ్యులను చేస్తూ.. అవకాశం దొరికిన ప్రతి సారి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నుంచి బయటపడటం కోసం నాలుగు రోజుల క్రితం చైనా ఓ కట్టు కథని ప్రచారంలోకి తెచ్చింది. భారత్‌లోనే కరోనా వైరస్‌ జన్మించిందని.. అక్కడ నుంచి వచ్చిన వస్తువుల మీద వైరస్‌ని గుర్తించామని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఈ ఆరోపణలను ఏ దేశం సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చైనా ఆరోపణలు అవాస్తవాలు అని తెలిపే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ‘వుహాన్‌ ఫైల్స్’‌ పేరుతో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ అంతర్గత పత్రాలు సీఎన్‌సీఎన్‌ చేతికి చిక్కాయి. 177 పేజీల ఈ డాక్యుమెంట్‌ మీద ‘అంతర్గత పత్రాలు.. రహస్యంగా ఉంచండి’ అని ఉంది. ఇక దీని ప్రకారం స్థానిక హుబే ప్రాంతంలో తొలుత వైరస్‌ వెలుగు చూసింది. ఫిబ్రవరి 10 నాటికి ఇక్కడ 5,918 కేసులు నమోదయ్యాయి. అయితే అదే రోజున చైనా అధ్యక్షుడు తమ దేశంలో నమోదైన కేసుల సంఖ్యను ఇందులో సగానికి సగం తగ్గించి చెప్పడం గమనార్హం. (చదవండి: ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌కి చైనా టీకా )

ఇక ఈ ఫైల్స్‌లో డిసెంబర్‌ 2019, ప్రారంభంలోనే గుర్తు తెలయని ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి మొదలైనట్లు, అయితే.. దీని గురించి ఎక్కడ ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించలేదని ఈ వుహాన్‌ ఫైల్స్‌లో ఉంది. 2019 అక్టోబర్‌ నుంచి 2020 ఏప్రిల్‌ వరకు హుబేలో వైరస్‌ని కట్టడి చేయడం కోసం ఈ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ ఫైల్స్‌ వెల్లడించాయి. ఇదే సమయంలో కరోనా ప్రపంచం అంతా విస్తరించింది. ఇక హుబే ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నుంచి వచ్చిన అంతర్గత పత్రాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికను ఆరుగురు నిపుణులు ధ్రువీకరించారు. అంతేకాక చైనా ప్రభుత్వం కేసుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాజిటివ్‌ వచ్చినప్పటికి నెగిటివ్‌ అంటూ తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు ఈ నివేదక వెల్లడించింది. అంతేకాక జనవరి 10 వరకు కేసుల గురించి ఎలాంటి వివరాలను బయటకు వెల్లడికానివ్వలేదు. ఇక దీని గురించి శాస్త్రవేత్తలు జారీ చేసిన హెచ్చరికలను చైనా ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని నివేదిక తెలిపింది. (చదవండి: కరోనాపై చైనా మరో కథ)

అంతేకాక గతేడాది డిసెంబరులో వుహాన్‌ హుబే ప్రాంతంలో తొలి కరోనా కేసులు వెలుగు చూసాయి. ఆ తర్వాత మహమ్మారి ప్రపంచం అంతటా వ్యాపించింది. ఇప్పటి వరకు 63.2 మిలియన్ల మందికి పైగా కోవిడ్‌ బారిన పడగా.. 1.45 మిలియన్ల మందికి పైగా మరణించారు. కరోనా వైరస్‌కు సంబంధించిన ఆధారాలను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నిస్తుందటూ ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న ఊహాగానాలకు ఈ నివేదికతో బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు కూడా వైరస్‌ ఎక్కడ పుట్టిందనే దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం మాత్రం లభించలేదు. కానీ జంతు విక్రయాలు జరిపే వుహాన్‌ వెట్‌ మార్కెట్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనట్లు మెజారిటీ దేశాలు భావిస్తున్నాయి. పేషెంట్లందరిలో మార్కెట్‌కు చెందిన ఓ సాధారణ వైరస్‌ లక్షణాలు కనిపించాయి. కానీ జనవరి వరకు దీన్ని అంటువ్యాధిగా భావించలేదు. ఇటీవల చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ 2019 వేసవిలో భారత్‌లోనే జన్మించిందని.. అ‍క్కడి నుంచే ప్రపంచం అంతా వ్యాపించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాతో పాటు ఇతర ప్రపంచదేశాలు తనపై చేస్తోన్నఆరోపణలన్నింటిని  చైనా ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement