ప్రపంచాన్ని ఏడాదిపాటు ఊపిరాడకుండా చేసిన కరోనా వైరస్ మహమ్మారి పుట్టుపూర్వోత్తరాలు వెలికితీయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టమైన విజయం సాధించలేక పోయింది. అయితే అది చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచి లీకై వుండకపోవచ్చని మాత్రం తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్తల బృందం పది పన్నెండు రోజులు చైనాలో పర్యటించి వచ్చాక ఈ నివేదిక వెలువరించింది. వారిని అనుమతించే విషయంలో చాన్నాళ్లు విముఖత ప్రదర్శించిన చైనా... నివేదిక వచ్చాక మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏ రకమైన అడ్డంకులు కల్పించకుండా, మొదటే శాస్త్రవేత్తలను ఆహ్వానించివుంటే ఈ ఆనందం ఇప్పుడు మరిన్ని రెట్లుండేదేమో! నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడిచ్చిన నివేదిక ప్రాథమికమైనదే. పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలంటే నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు.
ఇంతకూ నివేదిక ఏం చెప్పింది? కరోనా వైరస్ జంతువులనుంచి గానీ, శీతలీకరించిన ఆహార ఉత్పత్తులనుంచిగానీ వ్యాప్తి చెంది వుండొచ్చని వివరించింది. అలాంటి ఉత్పత్తులు వెలుపలి దేశాలనుంచి చైనాకు వచ్చివుండొచ్చని కూడా అభిప్రాయపడింది. కరోనా జాడలు కనబడిన తొలినాళ్లలో ఏం జరిగిందో గుర్తుతెచ్చుకోవాలి. వుహాన్‌లో తొలి కరోనా వైరస్ కేసులు 2019 డిసెంబర్ 12–29 మధ్య బయటపడ్డాయి. ఈ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా ఆ నెల 31న మాత్రమే తెలియజేసింది. వుహాన్‌లో నిరుడు జనవరి 23న లాక్‌డౌన్ అమలు చేయడం ప్రారంభించిననాటికే ఆ వైరస్ జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, హాంకాంగ్, మెక్సికో, సౌదీ అరేబియా, అమెరికాలకు వ్యాపించింది. కరోనా తీవ్రత గ్రహించలేక చైనా మొదట్లో కొన్ని తప్పులు చేసిందని సరిపెట్టుకోవచ్చు. అలా మన దేశంతోపాటు అమెరికా తదితరచోట్లకూడా జరిగాయి.
కానీ చైనాలో జరిగినవి కేవలం తప్పులు మాత్రమే కాదు... ఆ వైరస్ వైనాన్ని కప్పెట్టడానికి ప్రయత్నించారన్న సంగతి గుర్తుంచుకోవాలి. సార్స్‌ని పోలిన వైరస్ జనం ప్రాణాలు తోడేస్తున్న దని తొలిసారి గ్రహించి సహచరులకు చెప్పటంతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా అందరినీ అప్రమత్తం చేసిన వైద్యుడు డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌కు పోలీసుల నుంచి ఎదురైన వేధిం పులు అన్నీ ఇన్నీ కాదు. ప్రశ్నించే పేరుతో గంటలకొద్దీ నిర్బంధించి, వదంతులు వ్యాపింపజేస్తే వైద్య పట్టా రద్దు చేయటంతోపాటు శిక్షపడేలా చూస్తామని హెచ్చరించారు. చివరకు ఆ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తూ ఆ క్రమంలోనే తానూ బాధితుడిగా మారి నిరుడు ఫిబ్రవరి 7న ఆ వైద్యుడు కన్నుమూశాడు.
ఆ తర్వాతైనా చైనా తన ధోరణి మార్చుకుని వుంటే బాగుండేది. కానీ అది తప్పులు మీద తప్పులు చేస్తూ పోయింది. తమ దేశం నుంచి వచ్చే విమానాలను అనుమతించరాదని అమెరికా, యూరోప్ దేశాలు నిర్ణయించినప్పుడు అది విరుచుకుపడింది. తాము తీసుకుంటున్న ముందు జాగ్రత్తలేమిటో చెప్పలేదు. ప్రజారోగ్య వ్యవస్థను కదిలించి, పటిష్టమైన చర్యలు తీసుకోవటం, ఆ అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచుకుంటూ, వాటితో కలిసి పనిచేయటానికి ప్రయత్నించటం వంటివి చేస్తే చైనాపై నింద పడేది కాదు. అలా చేయలేదు సరిగదా వైరస్ తీవ్రతనూ, వేగంగా వ్యాప్తిచెందే తీరునూ వెల్లడించి అప్రమత్తం చేయడానికి సిద్ధపడలేదు. తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా ఆపటానికే చైనా ఈ వైరస్‌ను సృష్టించిందని డోనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తే...అది అమెరికా ప్రయోగశాల సృష్టి అని చైనా మీడియా లంకించుకుంది. అసలు ప్రతి దేశంలోనూ జీవశాస్త్ర ప్రయోగశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం అమెరికాకు ఎందుకొచ్చిందని చైనా వ్యాధి నియంత్రణ కేంద్రాల చీఫ్ జెంగ్ గుయాంగ్ కొత్త వాదన లేవనెత్తారు.
డబ్ల్యూహెచ్‌ఓ బృందం వస్తామన్నప్పుడు కూడా దాన్ని అనుమతించటానికి చైనా వెనకాడింది. ఇప్పుడైనా ఎన్నో పరిమితుల మధ్య శాస్త్రవేత్తలు దర్యాప్తు చేయాల్సివచ్చింది. నిరుడు అక్టోబర్‌లో తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఆన్‌లైన్ భేటీకి చైనా సిద్ధపడింది. ఆ తర్వాత జనవరి వరకూ ఆ సంస్థ శాస్త్రవేత్తలను ఆన్‌లైన్‌లో కలిసే విషయంలో తాత్సారం చేసింది. చివరకు గత నెల రెండోవారంలో శాస్త్రవేత్తలను దేశంలోకి అనుమతించగా వారు క్వారంటైన్ లాంఛనాలు పూర్తి చేసుకుని 28న దర్యాప్తు ప్రారం భించారు. ఇన్నాళ్లయ్యాక, అంతా సర్దుకున్నాక వారు వెలికితీసేది పెద్దగా లేకపోవచ్చు. అలాగని వైరస్‌కు చైనాయే కారణమని నిందించటం కూడా తొందరపాటే అవుతుంది. ట్రంప్ చైనా వైరస్ అంటూ ప్రచారం చేస్తున్నప్పుడే, ఆయనకు ప్రపంచం నలుమూలలనుంచీ నిఘా నివేదికలు రోజూ అందించే జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ కార్యాలయం అది వుహాన్ ప్రయోగశాల సృష్టి కాదని స్పష్టంగా చెప్పింది.
శాస్త్రవేత్తలు వుహాన్‌లో 2019 సంవత్సరంలో జబ్బుపడిన వేలాదిమందినుంచి సేకరించి వుంచిన నమూనాలను పరిశీలించారు. డిసెంబర్‌కు ముందు అక్కడ దాదాపుగా వ్యాధి జాడలేదన్న నిర్ణ యానికొచ్చారు. అలాగే గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందివుండొచ్చన్న అంచనా విషయం లోనూ ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే మరిన్ని దేశాల్లో, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే తప్ప నిజాలేమిటో తెలిసే అవకాశం లేదు. చైనా తనకు అలవాటైన గోప్యతను కాస్త సడలించుకుని, సహకరించివుంటే...ముందే శాస్త్రవేత్తలను అనుమతించివుంటే ప్రపంచానికెంతో మేలు జరిగేది. చైనాపై వున్న నిందలు పటాపంచలయ్యేవి.
Comments
Please login to add a commentAdd a comment