కేన్సర్.. దీనిని కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించేందుకు తామొక టెక్నాలజీని అభివృద్ధి చేశామంటున్నారు చైనీస్ శాస్త్రవేత్తలు. కొన్నేళ్ల క్రితం లిక్విడ్ బయాప్సీ పేరుతో ఓ కొత్త కేన్సర్ గుర్తింపు పరీక్ష అందుబాటులోకి వచ్చింది. రక్త పరీక్షల్లోనే కేన్సర్ కణితులు లేదా కణాలు వది లేసిన కొన్ని అవశేషాలను గుర్తించి వాటి ఆధారంగా వ్యాధి సోకిందని నిర్ధారించుకోవడం ఈ లిక్విడ్ బయాప్సీలో ప్రధానాంశం. వ్యాధి లక్షణాలు కనిపించే ముందుగానే గుర్తించడం వీటి ద్వారా కూడా సాధ్యమే కానీ ఫలితాలపై భరో సా తక్కువ. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు ‘పాన్‌సీర్’ పేరుతో సరికొత్త లిక్విడ్ బయాప్సీ పద్ధతిని అభివృద్ధి చేశారు. దీని ద్వారా కనీసం ఐదు రకాల కేన్సర్లను లక్షణాలు కనిపించేందు కు కనీసం నాలుగేళ్ల ముందే గుర్తించవచ్చునని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. ఇది కేన్సర్‌ను ముందుగానే గుర్తించే పరీక్ష కానేకాదని, వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు బయటపడేందుకు ఇంకా సమయం ఉండగానే తెలుసుకోవడం దీంట్లోని ముఖ్యాంశమని శాస్త్రవేత్తలు తెలిపారు.
మిథైల్ గ్రూపుల ఆధారంగా..
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రక్త పరీక్ష డీఎన్‌ఏ పోగుల్లోని ప్రత్యేక ప్రాంతాలను పరి శీలించడం ద్వారా జరుగుతుంది. కేన్సర్ కణితుల డీఎన్‌ఏలో తరచూ కనిపించే మిథైల్ గ్రూపులను ఈ రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అత్యంత సూక్ష్మస్థాయి డీఎన్‌ఏ మిథైల్ గ్రూపులను కూడా గుర్తించేందుకు తాము సరికొత్త పద్ధతులను ఉపయోగించామని శాస్త్రవేత్తలు తెలిపారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల ద్వారా రక్తంలో కనిపించే మిథైల్ గ్రూపులతో కూడిన డీఎన్‌ఏ కేన్సర్ కణితి నుంచి వెలువడిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని వారు చెప్పారు. ఈ పరీక్షను అభివృద్ధి చేసేందుకు తాము 2007–2014 మధ్యకాలంలో చైనాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 414 మంది రక్తపు ప్లాస్మాను సేకరించామని చెప్పారు.
రక్తం సేకరించే సమయానికి ఐదేళ్ల ముందు నుంచి వీరు కేన్సర్ బారిన పడని వారు. ఆ తరువాత నాలుగేళ్లలో 191 మంది ఉదర, కోలోరెక్టల్, కాలేయ, ఊపిరితిత్తుల, శ్వాసకోశ సంబంధిత కేన్సర్ల బారినపడ్డారు. ఈ 5 రకాల కేన్సర్లబారిన పడ్డ మరో 223 మంది రోగుల ప్లాస్మాలను కూడా సేకరించారు. మెషీన్ లెర్నింగ్ ద్వారా ఈ వివరాలను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌కు అందించారు. ఈ దశ తరువాత పరీక్షలు జరపగా పాన్‌సీర్ పరీక్ష కేన్సర్ ఉన్న వారిని 88% వరకు గుర్తించింది. రక్తం సేకరించేటప్పుడు లేకున్నా తరువాతి కాలంలో వ్యాధి బారినపడ్డ 95% మందిని కూడా ఈ పరీక్ష విజయవంతంగా గుర్తించింది. మరింత విస్తృత స్థాయిలో కేన్సర్ వ్యాధిగ్రస్తుల సమాచారం సేకరించి సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరిస్తే వ్యాధి నిర్ధారణలో మరింత కచ్చితత్వం వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment