ఆ తరువాత ఏంజరిగిందో తెలుసా? | Funday Laughing story 28-04-2019 | Sakshi
Sakshi News home page

ఆ తరువాత ఏంజరిగిందో తెలుసా?

Published Sun, Apr 28 2019 12:04 AM | Last Updated on Sun, Apr 28 2019 12:04 AM

Funday Laughing story 28-04-2019 - Sakshi

కోతికి మనిషి మెదడు:  చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలు  – నేషనల్‌ సైన్స్‌ రివ్యూ జనరల్‌

కొన్ని సంవత్సరములు తరువాత.... తలకోన అడవిలో...  కోతులు  ఎర్లీ మార్నింగ్‌ లేచాయి. చెట్టుకింద ఉన్న పండ్లు, చెట్టు మీద ఉన్న పండ్లను తిన్నాయి. ఆ తరువాత కబుర్లు చెప్పుకున్నాయి. ఆ తరువాత కీచుకీచుమంటూ కీచులాడుకున్నాయి. ఆ తరువాత కొంచెంసేపు జోకులు వేసుకొని నవ్వుకున్నాయి. ఆ తరువాత మూకుమ్మడిగా తునికిచెట్టు కిందికి వెళ్లి కూర్చున్నాయి. సరిగ్గా అప్పుడే కళ్లకు ఖరీదైన అద్దాలు, భుజానికి అంతకంటే ఖరీదైన నల్లబ్యాగ్‌ వేసుకున్న ఒక కోతి అక్కడికి వచ్చింది.‘‘హాయ్‌ అండీ...నా పేరు కోతికుమార్‌. నల్లమల అడవి నుంచి వస్తున్నాను. నేను రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ని. ‘వానర లోక’ అనే కొత్త వెంచర్‌ను స్టార్ట్‌ చేశాము. సిటీకి దగ్గర ఉండేలా  ప్లాన్‌ చేశాం. రోడ్లు, ట్రాన్స్‌పోర్ట్, వాస్తు...అన్ని బ్రహ్మాండం...’’ నాన్‌స్టాప్‌గా చెప్పుకుపోతున్నాడు కోతికుమార్‌.కోతులగుంపుకి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ మాట్లాడుతున్నాదేమిటో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.‘‘రియల్‌ ఎస్టేట్‌ ఏమిటి? కొత్త వేంచర్‌ ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది ఒక కోతి.‘‘ఎక్కడున్నారయ్యా మీరు! ఒకవైపు మన కోతులు కనివిని ఎరుగని అభివృద్ధి వైపు దూసుకువెళుతుంటే...మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నారు. మనిషి మెదడును కోతిలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో.... మన కోతులు ఎక్కడికోవెళ్లిపోయాయి! మన నుంచే వచ్చిన మనిషి మన కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు. ఇప్పుడు ఇక అంత సీన్‌ లేదు. మనిషితో సమానంగా మనం డెవలప్‌ అవుతున్నాం. ఈ క్రమంలో భాగంగానే మన కోతుల కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇంకా ఎంతకాలం బతుకు వెళ్లదీస్తాం? మనకు మాత్రం భద్రత ఉండొద్దా? ఈ విశాల అడవిలోమీకంటూ కొంప ఉండొద్దా? అందుకే వచ్చింది మా వానరలోక....’’ఈలోపు అక్కడికి మరొక కొత్త కోతి వచ్చింది.‘‘నా పేరు మంకీస్‌ రాజ్‌. ఆదిలాబాద్‌ అడవుల్లో నుంచి వస్తున్నాను. దయచేసి మీరు వీడి మాటలు నమ్మకండి. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో ఎన్నో అడవుల్లో ఎందరో అమాయక కోతుల చేత డబ్బు కట్టించుకొని, కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. నాది కూడా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్సే. కాని నమ్మకమే మా ప్రాణం. విశ్వాసమే మా ఆయుధం...మీ సౌకర్యమే మా శ్వాస...డబ్బులు ఊరకే రావు...’’ అని దంచుకుంటూ పోతున్నాడు మంకీస్‌ రాజ్‌.‘‘ఎవడ్రా నువ్వు?’’ అని రాజ్‌పై తన తోకతో దాడి చేశాడు కోతికుమార్‌.

‘‘నాపైనే తోక చేసుకుంటావా! ఎన్ని గుండెల్రా నీకు...రేయ్‌ వచ్చేయండ్రా’’ అని అరిచాడు కోతికుమార్‌.అంతే... తెల్లలుంగీ వేసుకున్న కోతుల గుంపు అక్కడికి వచ్చింది. వాటి చేతిలో పదునైన  వేటకోడవళ్లు ఉన్నాయి.ప్రమాదాన్ని పసిగట్టిన మంకీస్‌  రాజ్‌...‘‘కమాన్‌ గయ్స్‌...బయటికి వచ్చేయండి’’ అని అరిచాడు. అంతే...చెట్ల చాటు దాక్కున కోతుల గుంపు అరుస్తూ బయటికి వచ్చింది. జీన్స్‌ ధరించిన ఆ కోతుల చేతిలో నాటుబాంబులు ఉన్నాయి. ఇక చూడండి.... రెండు వర్గాలు... డిష్యూం డిష్యూం డిష్యూం!‘‘రెండు గంటల నుంచి ఫైట్‌ చేసుకుంటున్నారు... ఒక్కరూ గాయపడడం లేదేమీటి?’’ అన్నది తలకోన కోతి కాస్త గట్టిగానే.  ఈమాట వినబడగానే రెండు గ్రూప్‌లు స్విచ్‌ఆఫ్‌ చేసినట్లు ఆగిపోయాయి.‘‘రేయ్‌... ఎవడ్రా  ఈ  బాంబులు కొన్నది’’ తోడగొట్టి గట్టిగా అరిచాడు మంకీస్‌ రాజ్‌.‘‘నేనేనయ్యా’’ భయంభయంగా అంది ఒక బక్కప్ప కోతి.‘‘అసలేం జరిగింది?’’ గర్జించాడు మంకీస్‌ రాజ్‌.‘‘కమీషన్‌కు కక్కుర్తి పడి...మనం ఎప్పుడూ కొనే చోట కాకుండా....ఆ చెడ్డప్ప దగ్గర కొన్నానయ్యా...వాడు ఈ డూప్లికేట్‌ బాంబులు, పేలని బాంబులు ఇచ్చి మోసం చేస్తాడని అనుకోలేదయ్యా.నన్ను క్షమించండయ్యా’’ అని ఘొల్లుమన్నాడు బక్కప్ప.అవతలి వైపు... ‘‘రేయ్‌...ఈ వేటకోడవళ్లు కొన్నది ఎవరు?’’ భయంకరంగా గర్జించాడు కోతికుమార్‌.అందరూ సైలెన్స్‌ అయ్యారు.‘‘ఏమ్‌రా.... నేనంటే భయం తగ్గిందా...లేక బలుపు పెరిగిందా... కమాన్‌ టెల్‌ మీ... చెప్పండ్రా... వేటకొడవళ్లు కొన్నది ఎవరు?’’ మళ్లీ గర్జించాడు కోతికుమార్‌.‘‘ఎవరో కాదయ్యా.... మీ తమ్ముడే...’’ అన్నది ఒక కోతి.నిజమా!’ అన్నట్లుగా తమ్ముడి వైపు చూశాడు కోతికుమార్‌.

‘నిజమే’ అన్నట్లు పశ్చాత్తాప హృదయంతో కళ్లు నేలకేశాడు ఆ తమ్ముడు.‘‘ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా  ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు తమ్ముడూ....అసలు నువ్వు నా తమ్ముడి వేనా....ఎందుకు చేశావు ఈ పాపిష్టి పని?’’ గుండె పట్టుకొని బాధగా అరుస్తున్నాడు కోతికుమార్‌.‘‘నన్ను క్షమించన్నయ్యా. దేవుడిలాంటి అన్నయ్యను మోసం చేశాను. నన్ను ఎవరూ  క్షమించ లేరు...క్షమించినా నేను తట్టుకోలేను...’’ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు తమ్ముడు కోతి.‘‘డైలాగుల సంగతి సరే, అసలు ఏంజరిగిందో చెప్పు...’’ గద్దించాడు కోతికుమార్‌కి బాడీగార్డ్‌ కోతి.‘‘చెబుతాను....సరిగ్గా నెల రోజుల క్రితం ‘కోతిని’ అనే అమ్మాయితో లవ్‌లో పడ్డాను. ఆమె లేకుండా జీవించలేను. ఒకరోజు ఆమె నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు అడిగింది. లేదంటే పరువు పోతుందని, మా అన్న పరమ  పినాసి...ఏనాడు ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోడు...అంటే వంశగౌరవం మంటగలుస్తుందని...అబద్ధం ఆడాను...నువ్వు ఎంత అడిగినా సరే  ఇస్తాను అన్నాను.అన్నాను సరే... నా దగ్గర డబ్బెక్కడిది!అన్నను అడిగితే ‘ఎందుకు?’ అని గద్దిస్తాడు.‘నా గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అన్నయ్యా..’ అంటాను.‘నీ ఫేస్‌కు గర్ల్‌ఫ్రేండా....హాహాహా...’ అని గబ్బరుసింగులా నవ్వుతాడు.‘అన్న నవ్విండు కాబట్టి మనం నవ్వకపోతే బాగుండదు’ అని మీరు కూడా కోరస్‌గా  ‘హోహోహో’ అని నవ్వుతారు.నా ఇజ్జత్‌ కబ్జా అయిపోతది. ఇంత అవసరమా?వంద అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు..ఒకే ఒక్క మోసం చేసి నా ప్రేమను గెలుచుకోవాలనుకున్నాను.అందుకే ఈ మోసం చేశాను. ఎప్పుడూ కొనే చోట కాకుండా...ఈసారి వేటకొడవళ్లను వేటపాలెంలో కొన్నాను. అక్కడమోసప్ప అనే రౌడీ దగ్గర ఈ వేటకొడవళ్లు కొని మిగిలిన సొమ్ము జేబులో వేసుకున్నాను. ఇవి మరీ....బొమ్మ వేటకొడవళ్లా  ఉన్నాయి! అని అడిగితే...ఏదో మాట వరుసకు ఇవి మీ చేతుల్లో ఉండాలిగానీ....ఎప్పుడైనా ఫైట్‌ చేసి చచ్చారా? మీ గురించి నాకు తెలియదా...ఫైట్‌ చేయనప్పడు బొమ్మ వేటకొడవళ్లు అయితే ఏంటి? నిజమైనవి అయితే ఏమిటి? అన్నాడు. నిజమే కదా అనిపించింది’’ స్టోరీ అంతా చెప్పి కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు తమ్ముడు కోతి!          
(సశేషం) – యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement