ట్వీట్‌ వైరల్‌ ఎలా అవుతుందంటే? | First 50 re-tweets can predict if a tweet will go viral | Sakshi
Sakshi News home page

ట్వీట్‌ వైరల్‌ ఎలా అవుతుందంటే?

Published Fri, Apr 19 2019 4:15 AM | Last Updated on Fri, Apr 19 2019 4:15 AM

First 50 re-tweets can predict if a tweet will go viral - Sakshi

బీజింగ్‌: సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌లో సామాన్యులు పెట్టే ట్వీట్లు కొన్నిసార్లు వైరల్‌ అయిపోతుంటాయి. అదే సమయంలో మరికొందరు ప్రముఖులు చేసిన ట్వీట్లకు కొన్నినిమిషాల పాటు స్పందన బాగున్నప్పటికీ ఆ తర్వాత తగ్గిపోతుంది.    అయితే ఇందుకు ఆయా ట్వీట్లలోని సమాచారం కారణం కాదని చైనాలోని బైహాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ ట్వీట్‌కు సంబంధించి తొలి 50 రీట్వీట్లపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ఏదైనా ఓ ట్వీట్‌కు సంబంధించి తొలి 50 రీట్వీట్లను అధ్యయనం చేయడం ద్వారా ఓ విషయం వైరల్‌గా మారుతుందా? లేదా? అన్నది అంచనా వేయవచ్చని తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు.

రెండు పద్ధతుల్లో విశ్లేషణ..
ఈ పరిశోధనలో భాగంగా వ్యక్తుల ఆలోచనల వ్యాప్తిని అంచనా వేసేందుకు అంటువ్యాధుల వ్యాప్తిని అంచనా వేసే వ్యాప్తికారక మోడల్‌ను, ప్రామాణిక మోడల్‌ను వినియోగించారు. అనంతరం 1.2 కోట్ల ట్వీట్లను, 15 లక్షల రీట్వీట్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా ఓ సమాచారం వైరల్‌గా ఎలా మారుతుందన్న విషయాన్ని అధ్యయనం చేశారు. ఓ ట్వీట్‌ వైరల్‌గా మారడంలో తొలి 50 రీట్వీట్లు కీలకపాత్ర పోషిస్తాయని ఈ పరిశోధనలో తేలినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ 50 రీట్వీట్లు చేసే వ్యక్తుల ఆలోచనా విధానం, ప్రవర్తన, అలవాట్లు, దృక్పథం ఓ విషయం వైరల్‌గా మారడంలో గణనీయమైన ప్రభావం చూపుతాయని వెల్లడించారు. పరిశోధనలో భాగంగా సమాచారం ప్రజల్లోకి ఏవిధంగా వెళుతుందో తెలుసుకునేందుకు ఓ వ్యాప్తికారక మోడల్‌ను అభివృద్ధి చేశామన్నారు. అనంతరం ట్విట్టర్‌లోని సమాచారం, సిమ్యులేటెడ్‌ సమాచారాన్ని వ్యాప్తికారక మోడల్, ప్రామాణిక మోడల్‌ ద్వారా విశ్లేషించామని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో వ్యాప్తికారక మోడల్‌ ద్వారా సమాచారం ఎక్కువగా వైరల్‌ అవుతున్నట్లు గుర్తించామన్నారు. ఓ విషయం వ్యాప్తి చెందే దాన్ని బట్టే అది వైరల్‌గా మారుతుందా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన ‘పీఎల్వోఎస్‌ వన్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement