సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రాణాలను కాపాడే యాంటీబయోటిక్స్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతున్నాయి. విచ్చలవిడి వినియోగం కొంప ముంచుతోంది. ప్రతి చిన్న రోగానికీ పెద్ద మందు వేయడం శరీరానికి భారంగా మారింది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వాటికి కూడా ఖరీదైన, మోతాదుకు మించి యాంటీబయోటిక్స్‌ను వాడుతున్నారు. దీంతో కొన్ని రకాల బాక్టీరియా హై డోస్ (తీవ్ర మోతాదుతో కూడిన) యాంటీబయోటిక్స్‌కూ లొంగని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల జరగాల్సిన నష్టం కంటే ఎక్కువగా జరుగుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాంటీబయోటిక్స్ గురించి కొన్ని నిజాలు..
►ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా రూ.240 కోట్ల విలువైన యాంటీబయోటిక్స్ వినియోగంలో ఉన్నట్టు అంచనా.
► డాక్టరు సూచించినవి కాకుండా నేరుగా కౌంటర్ సేల్ అంటే మందుల షాపు వద్దకెళ్లి వాడుతున్న వారు 30 శాతం మంది.
► ఉదాహరణకు ఒక వ్యాధి తగ్గాలంటే ఐదురోజుల కోర్సు పూర్తి చేయాలి. కానీ మూడురోజులకే జబ్బు తగ్గిందని ఆపేస్తున్నారు.
► చిన్న చిన్న జ్వరాలు, జలుబు, దగ్గు, విరేచనాలు వంటి జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడేవాళ్లు ఎక్కువయ్యారు.
►యాంటీబయోటిక్స్‌కు జబ్బులు తగ్గకపోతే రోగం ముదిరి ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాలి. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతారు.
► ఎక్కువ వినియోగంలో ఉన్న యాంటీబయోటిక్స్...అజిత్రోమైసిన్, సెఫాక్సిమ్, సెఫడోక్సిమ్, నార్‌ఫ్లాక్సిన్, సెఫ్‌ట్రియాక్సోన్, ఆఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, టాజోబ్యాక్టమ్ వంటివి.
నియంత్రణ ముఖ్యం
- యాంటీ బయోటిక్స్ వాడేముందు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి.
- యాంటీ బయోటిక్స్ వాడేటప్పుడు కోర్సు పూర్తయ్యే వరకూ మధ్యలో మానెయ్యొద్దు.
- డాక్టర్ సూచించిన మోతాదే వాడాలి.
- మెడికల్ స్టోర్‌కు వెళ్లి మనకు మనమే యాంటీబయోటిక్ తెచ్చుకోకూడదు.
- చిన్న చిన్న జబ్బులకు యాంటీబయోటిక్స్ వాడటం మంచిది కాదు.
యాంటీ బయాటిక్ ఎలా వాడాలి?
బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి.వ్యాధి తీవ్రతను బట్టి యాంటి బయాటిక్స్ వాడాల్సి ఉంది. కానీ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు.
యాంటీ బయాటిక్స్ మందులు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడి మంచాన పడుతున్నారు. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడడం వల్ల ప్రస్తుతం కొత్త చిక్కు వచ్చి పడింది. బాక్టీరియాలు సైతం యాంటీ బయాటిక్స్ మందులకు అలవాటు పడడంతో శరీరంలో సహజ సిద్ధంగా ఉండే వ్యాధి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రమాదకర స్థాయికి యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఇప్పటికైనా నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి దేశంలోని చాలా కాంబినేషన్ యాంటీబయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రెండు మూడురకాలకు చెందిన యాంటీ బయాటిక్స్‌ను కలిపి (కాంబినేషన్) వాడటం సరైంది కాదని పేర్కొంది. కాంబినేషన్ మందులను కుష్టు, క్షయ వంటి వ్యాధులకు వాడాలి. కానీ మన వద్ద చిన్న చిన్న రోగాలకు కూడా కాంబినేషన్ ఔషధాలు వాడుతున్నారు. ఒకటి అవసరమైనచోట రెండు వాడటం వల్ల కూడా ఆ మందు పనిచేయని పరిస్థితి వస్తుంది
లొంగకపోతే పెద్ద ప్రమాదం
యాంటీబయోటిక్స్ మందులు పరిమితంగా ఉంటాయి. ఒక్కసారి ఈ మందులకు బ్యాక్టీరియా లొంగకపోతే తర్వాత కష్టం. కొత్త జబ్బులు వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈ పరిస్థితులను అధిగమించడం చాలా కష్టమవుతుంది. పరిమిత మోతాదులో వాడాలి.
– డా.సీహెచ్.ప్రభాకర్‌రెడ్డి,హృద్రోగ నిపుణులు
మోతాదుకు మించి వాడితే...
యాంటీబయోటిక్స్ పరిమితంగా వాడాలి. జబ్బును బట్టి డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకే కోర్సు వాడాలి. అలాగని రెండ్రోజులు వాడి వదిలేయకూడదు కూడా. పరిమిత మోతాదులో జబ్బును బట్టి వాడితేనే మంచిది. లేదంటే కొన్ని జబ్బులు మొండికేసే అవకాశం ఉంటుంది.
–డా.ఫణి మహేశ్వరరెడ్డి, జనరల్ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment