
సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు. తరచూ ఈ సమస్య వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు తగ్గినా ఈ సమస్య అలాగే ఉంటుంది. మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ’హిక్’అనే ధ్వనికి కారణమవుతుంది. అందుకే వీటిని ఇంగ్లిష్‌లో హికప్స్ అని పిలుస్తారు. తెలుగులో వెక్కిళ్లు అని పిలుస్తారు.
దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు. ఒక్కోసారి ఆగకుండా వెక్కిళ్లు వస్తుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయి. నవ్వడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల, ఒక్కోసారి అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వచ్చే అవకాశముంది.
ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే ఏం చేయాలంటే...
► కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఉండాలి.
► కాసేపటి తర్వాత మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలాలి
► అనంతరం... మరోసారి ఊపిరి బిగబట్టాలి.
► ఈ ప్రక్రియను కాసేపు ఇలాగే కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగే అవకాశం ఉంటుంది.
► ఇక గబగబా ఊపిరి తీసుకోవడం కూడా ఓ పద్ధతి.
► రెండు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత.. ఎక్కిళ్లు ఆగుతాయి.
► ఆ తర్వాత మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి.
► ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు.
► ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment