మితి మీరితే ఏదైనా వికటిస్తుంది. అది ప్రాణాధార మందుల విషయంలో కూడా వాస్తవమేనని తరచు వెల్లడవుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వచ్చిన వ్యాధేమిటో తెలియక, రోగి పడుతున్న నరకయాతనను చూడలేక ఆప్తులంతా క్షోభించే పాడుకాలం అంతరించి...రోగకారక క్రిములను మట్టుబెట్టే యాంటీ బయాటిక్స్ అందుబాటులోకొచ్చినప్పుడు ప్రపంచమంతా సంతోషించింది. యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో ఒక విప్లవాత్మక పరిణామం. రోగాన్ని నిరోధించి, ఆయుఃప్రమాణాన్ని పెంచడంలో అవి కీలక పాత్ర పోషించాయి. దేన్నయినా జయించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి. తరాలనుంచీ, యుగాలనుంచీ మానవజాతి ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొనడంతో మొదలెట్టి దాదాపు వంద రకాల యాంటీయాటిక్స్ అందుబాటులోకొచ్చాయి. అయితే అవసరం జూదంగా మారకూడదు. విచక్షణా, హేతుబద్ధతా కొరవడకూడదు.
యాంటీబయాటిక్స్ విషయంలో జరిగింది అదే. రోగి స్థితిగతులను అంచనావేసి, రోగ తీవ్రతను ఆధారం చేసుకుని మోతాదు నిర్ధారించాల్సి ఉండగా... అందుకు బదులు విచ్చలవిడి వాడకం ఎక్కువైంది. 'పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం...' అన్నట్టు అన్నిటికీ యాంటీబయాటిక్స్ వినియోగించడం పెరిగిపోయింది. కనుకనే వ్యాధి కారక క్రిములు మొండి ఘటాలుగా మారాయి. ఏ మందులనైనా తట్టుకునే స్థితికి చేరుకున్నాయి. పర్యవసానంగా తేలిగ్గా తగ్గవలసిన వ్యాధులు దీర్ఘకాలం పీడిస్తున్నాయి. ఇదే వరస కొనసాగితే భవిష్యత్తులో చిన్న చిన్న గాయాలు కూడా మానే స్థితి ఉండకపోవచ్చునని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మనం ఎలాంటి విపత్కర స్థితికి చేరువవుతున్నామో తెలియజెబుతున్నాయి.
ఇతర రంగాల మాదిరే వైద్య రంగం కూడా వ్యాపారమయం కావడంవల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మనుషుల ప్రాణాలతో ముడిపడి ఉండే ఆరోగ్యరంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం మితిమీరడంవల్లనే ఇంతగా వికటించింది. ఔషధ సంస్థలకూ, వైద్యులకూ ఉండాల్సిన సంబంధమూ.... వైద్యుడికీ, రోగికీ ఉండాల్సిన బంధమూ గతి తప్పాయి. అనైతికత, అమానవీయత దండిగా పెరిగాయి. పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఔషధ సంస్థలు అడ్డదారిలో అమాంతం ఎదగాలని చూస్తున్నాయి.
నాణ్యమైన మందుల్ని ఉత్పత్తి చేయడానికి బదులు నాసిరకం సరుకును మార్కెట్లోకి వదులుతున్నాయి. కొన్నేళ్ల క్రితం 167 రకాల యాంటీబయాటిక్స్‌పై ఆరా తీసినప్పుడు అందులో కేవలం 15 మాత్రమే వ్యాధులను ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయని తేలింది! ఔషధ సంస్థలు వైద్యులకు ఆకర్షణీయమైన బహుమతులను ఎరగా చూపి అమ్మకాలను పెంచుకుంటుంటే...రోగి ఆర్థిక స్థోమతనుగానీ, మందుల వాడవలసిన అవసరాన్నిగానీ పరిగణనలోకి తీసుకోకుండా ఎడాపెడా అంటగట్టే ధోరణి వైద్యుల్లో పెరుగుతోంది. ఇవి చాలవన్నట్టు వచ్చిన రోగమేదో తెలియకుండా, వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకుండా మందుల దుకాణాలకెళ్లి సమస్య చెప్పి ఏవో మాత్రలు కొనుగోలు చేసి వాడేవారూ ఎక్కువయ్యారు. కట్టుదిట్టమైన చట్టాలుండటంతోపాటు వాటి అమలు తీరును పర్యవేక్షించే వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి పోకడలను నియంత్రించడం సాధ్యమవుతుంది. అవి సక్రమంగా పనిచేయకపోవడంవల్లనే రోగ నిరోధకత నానాటికీ క్షీణిస్తున్నదని గుర్తించాలి.
నిజానికిది మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. చాలాచోట్ల అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.ఈ ప్రమాదం గురించి 2001లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ అతివాడకాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టకపోతే గడ్డు పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది. ఈ హెచ్చరికల పర్యవసానంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. మన దేశంలో ఇలాంటి పరిస్థితి కనబడదు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్లు ఎన్నడో కనుమరుగయ్యారు. ఇప్పుడు భారీ పెట్టుబడులతో కార్పొరేట్ ఆస్పత్రులు రంగంలోకొచ్చాయి. అవి రోగిని వైద్య సాయం అవసరం పడిన వ్యక్తిగా కాక, కస్టమర్‌గా భావిస్తున్నాయి. వేల రూపాయలు వ్యయమయ్యే వైద్య పరీక్షలు సరేసరి...అవసరంలేని మందుల్ని అంటగట్టే పోకడలు కూడా పెరిగాయి. అసలు ఏ వ్యాధికైనా అల్లోపతి వైద్య విధానం తప్ప మరే విధమైన ప్రత్యామ్నాయమూ లేదని భావించే వాతావరణం ఏర్పడింది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా ఇంట్లో లభించే చిన్న చిన్న వాటితో దాన్ని అరికట్టడం తేలికవుతుందన్న అవగాహన ఒకప్పుడు ప్రజల్లో ఉండేది. అది రాను రాను కరువవుతోంది. దేనికైనా ఒక మాత్ర మింగేస్తే తేలిగ్గా తగ్గిపోతుందన్న దురభిప్రాయం ఏర్పడుతోంది.
కిందిస్థాయి వరకూ పటిష్టమైన యంత్రాంగం ఉండే ప్రభుత్వాలు తల్చుకుంటే ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని జరగడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలను మాత్రమే తప్పుబట్టి ప్రయోజనం లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థల వైఫల్యం కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి సంస్థలు వైద్యుల్లో మాత్రమే కాదు...ప్రజల్లో సైతం యాంటీబయాటిక్స్‌పైనా...వాటి దుర్వినియోగం, అతి వినియోగంవల్ల కలిగే అనర్థాలపైనా గట్టిగా ప్రచారం చేస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. అలాగే మందుల వినియోగంపై ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సులు, గ్రామీణ ఆరోగ్య సహాయకులవరకూ అందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుండాలి. మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుంది. నిర్లక్ష్యమనే రోగాన్ని వదుల్చుకుంటేనే ముంచుకొస్తున్న ముప్పును ఆపడం తేలికవుతుంది.