ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.
ఎలా సురక్షితం?
'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
తాజా సమాచారం
కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్‌డేట్ చేయవచ్చు.
దుర్వినియోగానికి కళ్లెం
కొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.
మరింత సురక్షితం
కొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.
వేగవంతమైన ధ్రువీకరణ
క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్‌ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment