‘‘ఇంటర్‌స్టిటియం’’ అంటే ఏమిటో చెప్పుకోండి? తెలియదా...? కొంతకాలం క్రితం వరకూ శాస్త్రవేత్తలకూ దీని గురించి అస్సలు తెలియదు. విషయం ఏమిటంటే.. కొన్ని నెలల క్రితం మన శరీరంలో ఉండే అవయవాన్ని కొత్తగా గుర్తించారు. అవునండి.. ఇది నిజం. కొన్ని వేల ఏళ్లుగా వైద్యులు, శాస్త్రవేత్తలు మన శరీర భాగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఇదొక్కటి మాత్రం అందరి కళ్లూ కప్పేసింది. మన అవయవాలను కప్పుతూ ఉండే కణజాలానికి ప్రత్యేకమైన పనులేమీ లేవుకాబట్టి అది అవయవం కాదని అనుకునేవారు.
కానీ ఇటీవల ఒక రోగికి ఎండోస్కోపీ చేస్తూండగా శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు. ఈ కణజాలానికి శరీరం మొత్తానికి లింకులు ఉన్నాయని... బయటి నుంచి వచ్చే ఒత్తిడి నేరుగా అవయవాలపై పడకుండా ఇవి అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీనికే ఇంటర్‌స్టిటియం అని పేరు పెట్టారు. ఈ కణజాలాన్ని ప్రత్యేకంగా పరిశీలించేందుకు వీలయ్యేది కాదని.. నమూనా కోసం కత్తిరిస్తే.. అక్కడ ఉండే ద్రవం మొత్తం ఖాళీ అయిపోవడంతోపాటు మృదులాస్థి కణజాలం కూడా ముక్కలైపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎండోస్కోపీతో కణజాలాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకపోవడం, నేరుగా చూసేందుకు అవకాశం ఉండటం వల్ల ఈ సరికొత్త అవయవం గురించి తెలిసిందని చెప్పారు. ఈ కొత్త అవయవంతో ఉపయోగం ఏమిటన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్‌స్టిటియం కేన్సర్ కణాలు శరీరం మొత్తం విస్తరించేందుకు సహకరిస్తుందని తాజా అంచనా.
పెరుగుతున్న యాంటీబయాటిక్ వాడకం...
భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏటికేడాదీ యాంటీబయాటిక్‌ల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోందని, ఫలితంగా సమీప భవిష్యత్తులోనే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవులు సాధారణ మందులకు లొంగని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తోంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి. 2010 – 2015 మధ్యకాలంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం యాంటీబయాటిక్‌ల వాడకం ఏటా 15 శాతం చొప్పున పెరిగింది.
మొత్తం 76 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో యాంటీబయాటిక్‌ల వాడకం పెరిగిపోతూండగా.. అధికాదాయ దేశాల్లో స్థిరంగా ఉండటం. చివరి ప్రయత్నంగా వాడాల్సిన మందులను కూడా విచ్చలవిడిగా వాడేయటం ఆందోళన కలిగించే అంశమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఒక అంచనా ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,200 డోసుల యాంటీబయాటిక్‌లు వాడారు. ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించకపోతే 2030 నాటికి వీటి వాడకం రెట్టింపు కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధ్యయనం తాలూకు వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment