
సూపర్‌బగ్స్ పనిపట్టే కొత్త యాంటీబయోటిక్!
చిన్నా చితకా ఇన్ఫెక్షన్లకు సైతం పెద్దపెద్ద యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడేస్తున్న కొద్దీ, యాంటీబయోటిక్స్‌కు లొంగని రీతిలో సూక్ష్మజీవులు ముదిరి సూపర్‌బగ్స్‌గా తయారవుతున్న సంగతి తెలిసిందే. యాంటీబయోటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్స్ వల్ల ఇన్ఫెక్షన్లు సోకిన వారు ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. యాంటీబయోటిక్స్‌కు ఒకపట్టాన లొంగని మొండివ్యాధులను సైతం సమర్థంగా నయం చేయగల సరికొత్త యాంటీబయోటిక్‌ను బ్రిటిష్ వైద్య నిపుణులు కనుగొన్నారు. ‘క్లోస్తియోమైడ్’ అనే ఈ యాంటీబయోటిక్ ఎంతకూ నయం కాని ఇ–కోలి, గనేరియా వంటి వ్యాధులను నయం చేయగలదని, సాదాసీదా యాంటీబయోటిక్స్‌కు అంతంకాని ‘ఎంఆర్‌ఎస్‌ఏ’ వంటి సూపర్‌బగ్స్‌ను సమర్థంగా తుదముట్టించగలదని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డేమ్ సేలీ డేవిస్ వెల్లడించారు. అయితే, ఇది పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులోకి వచ్చేందుకు ఐదేళ్లు పట్టవచ్చని ఆయన తెలిపారు.