
సాక్షి, హైదరాబాద్: వ్యాధులను నయం చేయాల్సిన ఔషధాలే ఎదురు తిరిగితే పరిస్థితేంటి..? యాంటీ బయోటిక్స్ అతి వాడకంతో ఇప్పుడు అలాంటి ప్రమాదమే మానవాళికి ముప్పుగా పరిణమించింది.. సూక్ష్మక్రిములు యాంటీ బయోటిక్స్‌కు లొంగకుండా తట్టుకునే శక్తిని పెంచుకుని మొండిగా తయారవుతుండటంతో చాలా రకాల వ్యాధులకు అత్యవసర మందులు కూడా పనిచేయకుండా పోతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని తీవ్ర విపత్తుగా గుర్తించింది. రెండేళ్ల పాటు 114 దేశాల్లో యాంటీ బయోటిక్స్ వాడకంపై క్షుణ్ణంగా సర్వే చేసి తొలిసారిగా ఒక సమగ్ర నివేదిక తయారు చేసింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘ప్రపంచ యాంటీబయోటిక్స్ అవగాహన వారం’సందర్భంగా అన్ని దేశాలను హెచ్చరిస్తూ సూచనలు చేసింది.
మన దేశంలో అతి వినియోగం..
యాంటీ బయోటిక్స్ మందులు వాడినా తట్టుకొని నిలబడే సూక్ష్మక్రిముల వల్ల జబ్బులు తగ్గకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచంలో ఏటా కోటి మంది చనిపోతారని హెచ్చరించింది. 2030 నాటికి యాంటీ బయోటిక్స్ పనిచేయని పరిస్థితి ఏర్పడటం, కుటుంబాల్లో ఎవరో ఒకరు చనిపోవడం తదితర కారణాలతో 2.40 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోతారని పేర్కొంది. విచ్చలవిడి యాంటీ బయోటిక్స్ వాడకంలో భారత్ ముందుంది. ఇక్కడ ఏటా లక్ష మంది వరకు చనిపోతున్నట్లు అంచనా. అందులో 58 వేల మంది చిన్నపిల్లలే. చదవండి: (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!)
వారిలో ఐదేళ్ల లోపు పిల్లలుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి దేశంలో ఏటా 15 లక్షల మంది చనిపోతారని అంచనా. 2001–15 మధ్య మనదేశంలో కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ వాడకం 8.5 మిలియన్ యూనిట్ల నుంచి 13.2 మిలియన్ యూనిట్లకు పెరిగిపోయింది. ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 14 యాంటీ బయోటిక్ మాత్రలు మింగుతున్నారని వైద్య నిపుణులు అంచనా వేశారు. 2014 నుంచి 24 రకాల యాంటీ బయోటిక్స్ మందులను సీడీఎస్‌సీవో హెచ్1 జాబితాలో చేర్చింది. అంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కానీ, ఇష్టారీతిన వాడుతున్నారు.
వ్యవసాయం, జంతువుల ద్వారా..
పశువులు, కోళ్లు, మేకల్లో వచ్చే బ్యాక్టీరియా సంబంధ వ్యాధులకు కూడా యాంటీ బయోటిక్ మందులనే వైద్యులు సూచిస్తారు. డాక్టర్లు ఇచ్చే యాంటీ బయోటిక్స్ మందులు నేరుగా మన శరీరంపై 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతున్నాయి. కానీ, వ్యవసాయంలో వాడే పురుగుల మందులు, రసాయన మందులు, కోళ్లు, గేదెలు, ఇతర జంతువులకు వాడే యాంటీ బయోటిక్స్, నీళ్లల్లో రసాయనాల ద్వారా యాంటీ బయోటిక్స్ నిరోధకతను పెంచుకుని 70 శాతం మనపై ప్రభావం చూపిస్తున్నాయి. జాతీయ పాల పరిశోధన సంస్థ పరిశోధన ప్రకారం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సేకరించిన 44 పాల శాంపిళ్లలో 14 శాతం యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలింది. రాజస్తాన్‌లో సేకరించిన పాల శాంపిళ్లలోని ఇకోలి బ్యాక్టీరియా ప్రస్తుతం వాడకంలోని 70 శాతం యాంటీ బయోటిక్స్‌కు లొంగడం లేదు.
పందుల్లో సేకరించిన 774 శాంపిళ్లు, బాతుల్లో సేకరించిన 74 శాంపిళ్లలోని బ్యాక్టీరియా 70 శాతం యాంటీ బయోటిక్స్‌కు లొంగడం లేదు. చేపలోని 82 శాంపిళ్లలోని విబ్రియా బ్యాక్టీరియా.. అందుబాటులో ఉన్న 90 శాతం సాధారణ యాంటీ బయోటిక్స్‌కు లొంగడం లేదు. సీడీడీపీ పరిశోధన ప్రకారం.. హైదరాబాద్‌లో ఫార్మసీ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉండటంతో వాటి ద్వారా వచ్చే వృథా నీటి ప్రాసెసింగ్ ప్లాంట్ల సమీపంలో ఉన్న భూగర్భ, ఉపరితల నీళ్లల్లో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా అన్ని రకాల యాంటీ బయోటిక్స్ మన శరీరాల్లో చేరిపోతున్నాయి. (వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతి!)
టీకాలే మేలు..
ఫ్లూ, న్యుమోనియా, రోటా వైరల్ డయేరియా, డిప్తీరియా, కోరింత దగ్గు, టైఫాయిడ్, మీజిల్స్ వంటివాటికి టీకాలున్నాయి. వాటిని ముందే ఇవ్వటం మంచిది. చేతి, నీటి, ఆహార శుభ్రత, టీకాలు, చక్కటి పోషకాహారం ఇవన్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. యాంటీ బయో టిక్స్ వాడకంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఒక విధానమంటూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సూక్ష్మక్రిములు ప్రస్తుత యాంటీ బయోటిక్స్‌కు నిరోధకత పెంచుకోవటం వల్ల క్షయ, మలేరియా, గనేరియా, న్యుమోనియా, మూ త్రనాళ ఇన్ఫెక్షన్లు సమస్యలుగా పరిణ మిస్తున్నా యని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
శరీరంలో 10 కోటి కోట్ల బ్యాక్టీరియా
మన శరీరంలో దాదాపు కోటి కోట్ల జీవ కణాలుంటే, దానికి పదింతలు ఎక్కువగా అంటే 10 కోటి కోట్ల బ్యాక్టీరియా కూడా మనలోనే ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో, చర్మం మీద, ముక్కులో, నోట్లో, ఊపిరితిత్తుల్లో ఇలా చాలా శరీరభాగాల్లో స్థిర నివాసం ఉంటాయి. వీటిలో చెడ్డవీ మంచివీ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మనలోని రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేలా చేస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం.. అయితే యాంటీ బయోటిక్స్ వేసుకున్నప్పుడు దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు, కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్ ఈ రెండు రకాల సూక్ష్మజీవులే అన్ని రకాల వ్యాధులకు కారణం. యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపగలవు. వైరల్ ఇన్‌ఫెక్షన్లను యాంటీబయోటిక్స్ పెద్దగా అదుపు చేయలేవు. ఈ విషయం తెలియక వైరల్ ఇన్‌ఫెక్షన్‌లైన జలుబు, ఫ్లూలకు యాంటీబయోటిక్స్ వాడేస్తుంటాం. ఇలా వాడటం వల్ల వైరస్ నశించకపోగా శరీరంలోని బ్యాక్టీరియా బలం పెరుగుతుంది.
మరికొన్ని అంశాలు
►యాంటీ బయోటిక్స్ నిరోధకత పెంచుకోవడంతో చిన్నా చితకా జబ్బులకు కూడా మందుల్లేని పరిస్థితి ఏర్పడుతోంది.
►జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా యాంటీ బయోటిక్స్ వాడటం సాధారణమై పోయింది.
►తెలంగాణ గ్రామాల్లో అనర్హులైన అనేకమంది మెడికల్ ప్రాక్టీషనర్లూ ఉన్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతో పనిచేయక జబ్బులు ముదురుతున్నాయి.
►పంటలకు విచ్చలవిడిగా పురుగు మందులను చల్లుతున్నారు. కూరగాయలు, ధాన్య పు గింజలకూ వాడేస్తున్నారు. అటువంటి ఆహార పదార్థాలను తిన్నాక మనుషుల్లోనూ వాటి ఆనవాళ్లు ఉంటున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదనలివే..
►యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గించేందుకు దేశాలు జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
► వ్యవసాయంలో పురుగు మందులను, పశువులకు ఇష్టారాజ్యంగా ప్రేరేపిత యాంటీ బయోటిక్స్ వాడకుండా చూసేందుకు ఒక పటిష్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
►యాంటీ బయోటిక్స్ అవసరం లేకుండా జలుబు లాంటి సాధారణ ఇన్‌ఫెక్షన్లను నివారించే సహజ పద్ధతులను వైద్యులు రోగులకు సూచించాలి.
హెచ్1 జాబితాలోని యాంటీ బయోటిక్స్ ఇవే..
1) సెఫడ్రాక్సిల్ 2) సెఫజోలిన్ 3) సెఫ్‌డినిర్
4) సెఫ్టజిడిమ్ 5) సెఫ్టిజోగ్జిమ్ 6) సిఫరోగ్జిమ్
7) సిప్రోఫ్లోగ్జాసిన్ 8) క్లారిత్రోమైసిన్
9) క్లిండామైసిన్ 10) కోట్రిమోక్సాజోల్ 11) గాటిఫ్లోక్సాసిన్ 12) అజిత్రోనామ్ 13) ఇస్పామిసిన్ 14) లివోఫ్లోక్సాసిన్ 15) లినజోలిడ్
16) మెరోపినామ్ 17) మోక్సిఫ్లోక్సాసిన్
18) నైట్రాజిపామ్ 19) నార్‌ఫ్లాక్సాసిన్ 20) ఒఫ్లాక్సాసిన్ 21) తొబ్రామైసిన్ 22) అమికాసిన్
23) స్పార్‌ఫ్లోక్సాసిన్ 24) మినోసైక్లిన్
Comments
Please login to add a commentAdd a comment