సాక్షి, హైదరాబాద్ : తుమ్మినా, దగ్గినా యాంటీబయోటిక్స్ మందులు రాయడం చాలామంది డాక్టర్లకు పరిపాటైంది. ‘ఫ్లస్ వన్’అనే మెడికల్ జర్నల్ ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం.. దేశంలో నాలుగేళ్లలోపు పిల్లల్లో ప్రతి వెయ్యిలో 636 మందికి యాంటీబయోటిక్స్ రాస్తున్నారని తేలింది. 10–19 ఏళ్ల వయసు వారికి అతి తక్కువగా వెయ్యిలో 280 మందికి ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. మొత్తంగా దేశంలో యాంటీబయోటిక్ దుర్వినియోగం అధికంగా ఉందని తేల్చింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్లలో 33.2 శాతం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు రాయడం గమనార్హం. భారతదేశంలో రిటైల్ రంగంలో తలసరి యాంటీబయోటిక్ వినియోగం 22 శాతం పెరిగిందని అధ్యయనంలో తేలింది. భారతదేశంలో అధిక యాంటీబయోటిక్ వాడకానికి ప్రధాన కారణం అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలడమేనని తెలిపింది. వివిధ కారణాలతో చనిపోయే ఐదేళ్లలోపు పిల్లల్లో 50 శాతం మంది న్యుమోనియా, విరేచనాలు వంటి అంటువ్యాధుల కారణంగానే చనిపోతున్నారని తేల్చింది. అయితే ఈ యాంటీ బయాటిక్స్ కేవలం తీవ్రమైన అంటువ్యాధుల చికిత్సకు ఉద్దేశించినవి కావని తేలింది. యాంటీబయాటిక్స్ మందుల దుర్వినియోగం ప్రధానంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఆసుపత్రులు, క్లినిక్‌లలో అధికంగా జరుగుతోందని అధ్యయనం తెలిపింది. పెద్ద నగరాల్లోని ఆసుపత్రుల్లో అంతగా ఉండట్లేదని పేర్కొంది. కాబట్టి కిందిస్థాయిలో నిఘా అవసరమని తేల్చింది.
ఆ దేశాల కంటే తక్కువే అయినా..
వివిధ యూరోపియన్ దేశాల కంటే తక్కువగానే మన దేశంలో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారని అధ్యయనం తెలిపింది. భారత్‌లో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 412 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. ఇటలీలో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ రేటు వెయ్యి మందికి 957 ప్రిస్క్రిప్షన్లు, జర్మనీలో 561 ప్రిస్క్రిప్షన్లు, యూకేలో 555 ప్రిస్క్రిప్షన్లు, డెన్మార్క్‌లో 481 ప్రిస్క్రిప్షన్లుగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కొన్ని యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ల రేటు మన దేశంలో ఎక్కువ ఉందని తెలిపింది. యాంటీబయాటిక్స్ అనుచిత వాడకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, మన కేంద్రం పలు చర్యలు చేపట్టింది. యాంటీబయోటిక్స్ డిమాండ్ తగ్గించడానికి, సార్వత్రిక రోగనిరోధకత కోసం కొత్త టీకాలు ప్రవేశపెట్టింది. కానీ లక్ష్యాలను సాధించే విషయంలో పురోగతి అంతగా లేదని అధ్యయనం తెలిపింది.
పని చేయని స్థితికి..
1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్న తర్వాత క్రమంగా యాంటీబయోటిక్స్ అభివృద్ధి పెరిగింది. రకరకాల బాక్టీరియాను మట్టుబెట్టడం సులువైంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడం సులభతరమైంది. కానీ మన అలవాట్లు, నిర్లక్ష్యం వల్ల ఈ యాంటీబయోటిక్స్‌కు బాక్టీరియా తలొగ్గే పరిస్థితి లేకుండా పోతుంది. ఆయా మందులకు లొంగట్లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. న్యుమోనియా, టీబీ, రక్తంలో ఇన్‌ఫెక్షన్లు, గనేరియా లాంటి వ్యాధుల విషయంలో చికిత్స అనేది సవాలుగా మారింది. శక్తిమంతమైన యాంటీబయోటిక్ మందులు కూడా పనిచేయడం మానేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి సాధారణ ఇన్‌ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. మొదటి దశ యాంటీబయోటిక్స్ చికిత్స వల్ల ఫలితం లేనప్పుడు మరింత ఖర్చుతో కూడుకున్న సమర్థమైన యాంటీబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. యాంటీబయోటిక్స్ పనిచేయకపోవడం వల్ల చికిత్సా కాలం పెరుగుతుంది. అనారోగ్య బాధ పెరుగుతుంది. ఆసుపత్రుల్లో ఉండే కాలం పెరుగుతుంది. వైద్యం ఖర్చు పెరిగి కుటుంబాలు, సమాజాలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచిన సమస్య యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ అని నిపుణులు అంటున్నారు.
అవగాహన కల్పించాలి..
యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ ఒక సామాజిక విషాదంగా మారింది. యాంటీబయోటిక్స్ లేని రోజుల్లో చిన్నపాటి జబ్బులు కూడా ప్రాణాంతకంగా మారేవి. కానీ అవే యాంటీబయోటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం వల్ల, అవసరమైనప్పుడు అసలు ఏ మందులూ పనిచేయని పరిస్థితి వస్తుంది. ఈ యాంటీబయోటిక్స్ హానికర అలర్జీలు, విరేచనాలు, గుండె జబ్బులు, కండరాల సమస్యలు వంటి దుష్ప్రభావాలు కలగజేస్తాయి.
– డాక్టర్ ఆకుల సంజయ్‌రెడ్డి, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment