మెడికిల్‌ షాపుల్లో..శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు | tablets | Sakshi
Sakshi News home page

మెడికిల్‌ షాపుల్లో..శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు

Published Sun, Jul 24 2016 10:51 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మెడికిల్‌ షాపుల్లో..శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు

మెడికిల్‌ షాపుల్లో..శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు

♦ మందుల విక్రయాలకు చెల్లుచీటీ
♦ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ అమ్మకాలు 
♦ అవి ఎలా పడితే అలా వాడితే దుష్ప్రభావం
♦ పశ్చిమ ప్రకాశంలో యథేచ్ఛగా విక్రయాలు
 
జిల్లా వ్యాప్తంగా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లు ఎక్కువయ్యారు. శంకర్‌ దాదాలు ఎవరో ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఓ సినిమాలో హీరో పాత్రధారి ఎంబీబీఎస్‌ చదవకుండానే తన తల్లిదండ్రులు, ప్రియురాలి మెప్పు పొందేందుకు నానాతంటాలు పడతాడు. ఎంబీబీఎస్‌ చదివిన వ్యక్తిలా ఎదుటి వారి ముందు కట్టింగ్‌ ఇస్తాడు. అది సినిమా.. జిల్లాలో అలాంటి శంకర్‌ దాదాలు చాలామందే ఉన్నారు. ఆర్‌ఎంపీల ముసుగులో కొందరు, మెడికల్‌ షాపుల యజమానుల ముసుగులో మరికొందరు రోగులకు మిడిమిడి జ్ఞానంతో మందులు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్నారు. మెడికల్‌ షాపుల యజమానులు ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. 
– మార్కాపురం 
 
రోగి అవసరాన్ని మందుల షాపుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ (మందుల చీటీ) లేకుండానే యాంటీబయాటిక్స్‌ విక్రయిస్తున్నారు. ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రమాణాలు పాటించకుండానే మందులు అమ్ముతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర పట్టణాల్లో మందుల షాపుల యజమానులు ఇచ్చిందే మాత్ర, అమ్మిందే ధరగా తయారైంది.
 
 నిబంధనలు తెలిసినా డాక్టర్లు సైతం తమ క్లినిక్‌ల్లో అనుమతులు లేకుండానే మందుల షాపులు పెట్టి విక్రయిస్తున్నారు. ఫార్మసిస్ట్‌ల సమక్షంలోనే మందులను విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అరకొర పరిజ్ఞానం ఉన్న వారు సైతం మందులు విక్రయిస్తున్నారు. ఫార్మసీ చదివిన వారి పేరుతో లైసెన్స్‌ తీసుకుని ఈ తతంగాన్ని సాగిస్తున్నారు. 
 
24 మండలాల్లో 500 మెడికల్‌ షాపులు
మార్కాపురం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు.. అంటే మెుత్తం 24 మండలాల్లో దాదాపు 500 మెడికల్‌ షాపులున్నాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆస్పత్రుల ఫీజులు భరించలేక జ్వరం, దగ్గు, విరేచనాల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం మెడికల్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాన్ని గమనించిన మందుల షాపుల యజమానులు తమకు ఇష్టామొచ్చిన మాత్రతో పాటు అదనంగా ప్రతి రోగానికి యాంటిబయాటిక్స్‌ అమ్ముతున్నారు. పారాసిట్మల్‌ ట్యాబ్లెట్లలో సుమారు 20కి పైగా కంపెనీలు ఉన్నాయి. వాస్తవ ధర ఒక్కో ట్యాబ్లెట్‌ 25 పైసలు నుంచి 30 పైసలు మధ్య ఉండగా రోగికి రూ.1.50 నుంచి రూ.2లకు విక్రయిస్తున్నారు. డాక్టర్‌ రాసి ఇచ్చిన చీటీ లేనిదే మందులు విక్రయించకూడదన్న ఔషధ నియంత్రణ మండలి నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. కొంతమంది మందుల షాపుల యజమానులు ఒకడుగు ముందుకేసి మిడిమిడి జ్ఞానంతో ఇంజెక్షన్లు సైతం చేస్తున్నారు. 
 
మెడికల్‌ షాపుల్లో ఆర్‌ఎంపీలు
ఆర్‌ఎంపీలు కొందరు మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న కెమిస్ట్, డ్రగ్గిస్ట్‌లు మాత్రమే రోగులకు మందులు విక్రయించాలి. పశ్చిమ ప్రకాశంలో కొంతమంది మెడికల్‌ షాపుల యజమానులు తమకు తెలిసిన వారి సర్టిఫికెట్లతో మందుల షాపులు నిర్వహిస్తున్నారు. తమ ఇష్టామొచ్చిన ధరలతో అమ్ముతూ రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. వైద్యులు రాసి ఇచ్చే మందులకు, మెడికల్‌ షాపుల యజమానులు ఇచ్చే మందులకు పొంతన ఉండకపోగా ఇదేమని ప్రశ్నిస్తే కంపెనీ తేడా.. మందు ఒక్కటే అంటూ సమాధానం చెబుతున్నారు. మార్కెట్‌లో వివిధ రకాల కంపెనీలు  షాపుల యజమానులకు కమీషన్లు ఎక్కువగా ఇస్తుండటంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి దుకాణంలో రికార్డులు, బిల్లు పుస్తకాలు తప్పనిసరిగా నిర్వహించాలి. వినియోగదారునికి ధరతో కూడిన బిల్లు ఇవ్వాలి. ఆచరణలో ఇవి అమలు కావటం లేదు. 

ఇవి మచ్చుకు కొన్నే..
4 ఇటీవల కనిగిరి, దర్శి, రాజంపల్లి, బేస్తవారిపేట, గిద్దలూరుల్లో లైసెన్స్‌లు లేకుండా మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసుకుని మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటి యజమానులపై డ్రగ్‌ ఇన్‌స్పక్టర్‌ కేసులు నమోదు చేశారు. 4 బేస్తవారిపేటలో ఫిజిషియన్‌ శాంపిల్స్‌ను అమ్ముతుండగా గుర్తించి ఆ మందుల దుకాణంపై కేసు నమోదు చేశారు. 
 
4 దర్శిలో ఒక మందుల షాపులో గేదెలు పాలు ఎక్కువగా వచ్చేందుకు ఆక్సిడోసిన్‌ నకిలీ మందును అమ్ముతుండగా సీజ్‌ చేశారు. ఇది చాల ప్రమాదకరమైన మందు. నకిలీ కావటం గమనార్హం. ఎటువంటి కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీ దీనిపై లేదు. దీన్ని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాధీనం చేసుకున్నారు. 
 
ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం
మందుల షాపుల యజమానులు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయవచ్చు. అలా ఫిర్యాదు చేసిన వినియోగదారుల పేర్లు గోప్యంగా ఉంచుతాం. మందుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కరపత్రాలు పంచుతున్నాం. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. కొన్ని మందులను డాక్టర్ల ప్రిస్కిప్షన్‌ ఉంటేనే ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మందులు ఇస్తే చర్యలు తీసుకుంటాం. మెడికల్‌ షాపుల యజమానులకు కూడా అవగాహన కల్పిస్తాం.
– జయరాముడు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, మార్కాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement