జహీరాబాద్ టౌన్ : జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి తదితర చిన్న సమస్యలకు గతంలో మెడికల్ దుకాణాల్లో మందులు ఇచ్చేవారు. అయితే పరిస్థితి మారడంతో ఇప్పడు డాక్టర్ చీటీ కావాలంటున్నారు మందుల దుకాణాల వ్యాపారులు. ఒకటీ రెండు మందు గోలీలకు కూడా డాక్టర్ చీటీ ఎక్కడి నుంచి తేవాలని స్థానికులు వాపోతున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన చీటీ ఉంటేనే మందులు ఇవ్వాలి. పైగా బిల్లు కూడా ఇవ్వాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ విధించిన నిబంధనలు ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఇటీవల సంగారెడ్డి డివిజన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జహీరాబాద్ మందుల దుకాణాల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఎట్టి పరిస్థితిలో మందులను డాక్టర్ చీటీ లేనిదే ఇవ్వరాదని, ఆలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పట్టణంలోని ఓ మెడికల్ దుకాణానికి నోటీసులు జారీ చేసి వారం రోజుల పాటు దుకాణం తీయవద్దని హెచ్చరించారు.
చీటీ లేకుండా మందులు ఇస్తే ఇక నుంచి నెల రోజుల పాటు దుకాణం తీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో వ్యాపారులు గత్యంతరం లేక దుకాణాల ముందు నోటీసులు అంటించి, డాక్టర్ చీటీ ఉంటేనే మందులు ఇస్తామంటున్నారు. తలనొప్పి జలుబు తదితర చిన్న సమస్యల గురించి డాక్టర్ వద్దకు ఎలా పోయెదని స్థానికులు వాపోతున్నారు. జనరిక్ మందులకు డాక్టర్ చీటీ కావాలంటూ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ హెచ్చరించడం తగదన్నారు. వ్యాపారులు కూడా ఒకటీ రెండు టాబ్లెట్లు ఇవ్వడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.
చీటీ ఉంటేనే గోలీ..
Published Mon, Jul 20 2015 2:41 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM
Advertisement