మందుల ‘చీటింగ్ | Pharmacies' Cheating | Sakshi
Sakshi News home page

మందుల ‘చీటింగ్

Published Fri, May 9 2014 3:52 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

మందుల ‘చీటింగ్ - Sakshi

మందుల ‘చీటింగ్

ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు
 వైద్యులుగా చలామణి అవుతున్న ఫార్మసిస్ట్‌లు
 విచ్చలవిడిగా గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు
 ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న బాధితులు

 
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్‌కు చెందిన మహిళ ఇటీవల గర్భస్రావం కోసం దగ్గర్లోని మెడికల్ షాపునకు వెళ్లింది. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండానే సదరు దుకాణదారుడు కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు. వాటిని తీసుకున్న రెండోరోజే మహిళకు గర్భస్రావం కావడంతోపాటు ప్రాణాలను కోల్పోయింది. కడుపులోని పిండం మెరుగుదల కోసం విద్యానగర్‌లోని ఓ ఆస్పత్రి వైద్యురాలు మందు పేరును అర్థం కాకుండా కలిపి రాయడం వల్ల సదరు ఆస్పత్రిలోని ఫార్మసిస్ట్ ‘మైప్రోజిస్ట్’కు బదులు‘మిసోప్రెస్ట్’ఇవ్వడంతో బాధిత మహిళ గర్భాన్ని కోల్పోయింది. దీనిపై సుప్రీకోర్టులో కేసు నడుస్తోంది.
 
ఇవి ఉదాహరణలు మాత్రమే. అనేక హానికారక మందులను మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్లు లేకుండానే ఇచ్చేస్తున్నారు. ఇవి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రోగుల అవగాహన రాహిత్యం మెడికల్ షాపుల గిరాకీని పెంచుతోంది. వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారం రోగులు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి అకాల మృత్యువాత పడుతున్నారు.

1940 డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మడం నేరం. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి తదితర 25 రకాల నాన్‌షెడ్యూల్ మందులనే ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించాలి. మరో వెయ్యి రకాల మందులను ఎట్టి పరిస్థితుల్లో ప్రిస్కిప్షిన్ లేకుండా విక్రయించరాదు. అధికారుల ఉదాసీనత, చట్టాల్లోని లొసుగులతో కొందరు ఫార్మసిస్ట్‌లు వైద్యులు రాసిన మందుల చీటీతో సంబంధం లేకుండానే రోగులకు మందులు ఇచ్చేస్తున్నారు.

నగరంలో 30 శాతం అమ్మకాలు ప్రిస్కిప్షిన్ లేకుండానే జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు రెండో రకం నాణ్యత కలవే కావడం గమనార్హం. జలుబు, జ్వరం, తలనొప్పి మాత్రలే కాదు, గర్భస్రావానికి ఉపయోగించే ప్రమాదకరమైన మెఫఫిన్, జొటాటెక్, ఐపిల్స్‌తో పాటు పలు రకాల స్లీపింగ్ మాత్రలను సైతం యథేచ్ఛగా అమ్ముతుండటం విశేషం.
 
మెడికల్ షాపుల్లో తనిఖీలేవీ?

గ్రేటర్‌లో పదివేలకుపైగా మందుల దుకాణాలున్నాయి. ఇవి రోజూ రూ.పది కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. అయితే 50 శాతం దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌లు లేరు. చాలామంది సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని షాపులు నడుపుతున్నారు. ఫార్మారంగంపై కనీస అవగాహన లేని వారు మందులు విక్రయిస్తుండటంతో పరిస్థితి వికటిస్తోంది. నిషేధిత మందులపై సరైన ప్రచారం లేకపోవడంతో వాటినీ యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. అనివార్యమైతే తప్ప పసిపిల్లలకు డబ్బాపాలను సూచించడం, అమ్మడం చేయరాదు.

కానీ అన్ని మెడికల్‌షాపుల్లోనూ ఈ ఉత్పత్తులు కొల్లలుగా కనిపిస్తున్నాయి. ఔషధ దుకాణాల్లో కనీసం ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాల్సి ఉండగా, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్లు అటువైపు చూడట్లేదు. హయత్‌నగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, అఫ్జల్‌గంజ్, కోఠి, ఎల్‌బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, చాంద్రాయణగుట్ట, పాతబస్తీల్లోని మందుల దుకాణాల్లో నాణ్యతలేని, అనుమతిలేని, గడువు ముగిసిన మందులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
 
 రోగ నిరోధక శక్తి తగ్గుతుంది..
 నేరుగా మెడికల్ షాపు యజమానులు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పే. వైద్యంపై కనీస అవగాహన లేని వారిచ్చే మందులు వాడటం శ్రేయస్కరం కాదు. డాక్టర్ సిఫార్సు చేసినవే వాడాలి
 - ప్రొ.నాగేందర్, ఉస్మానియా మెడికల్‌కాలేజీ
 
 వైద్యుల రాతలపై ‘సుప్రీం’లో కేసు
 పలువురు వైద్యులు అర్థం కాని విధంగా మందుల పేర్లు రాస్తున్నారు. తొలి, చివరి అక్షరం తప్ప మరేమి రాయట్లేదు. దీంతో అనుభవం లేని ఫార్మసిస్టులు ఒకటి బదులు మరొకటి ఇస్తున్నారు. మందుల పేర్లు సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.
 - సీహెచ్.పరమాత్మ, తెలంగాణ ఫార్మసిస్టుల సంఘం కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement